Chalapathi Rao : నవరస నటన సార్వభౌముడు కైకాల సత్యనారాయణ కన్నుమూసి రెండు రోజులు కాకముందే సీనియర్ నటుడు చలపతి రావు (78) గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.. ఈ వార్త తెలిసి తెలుగు సినీ ప్రముఖులు చలపతిరావు పార్థీవ దేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్లారు. చలపతిరావుకు ఇతర కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చలపతిరావు కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో తన కుమారుడు, దర్శకుడు అయిన రవిబాబు ఇంట్లో ఉంటున్నారు. 1944 మే 8 న కృష్ణాజిల్లా బల్లిపర్రులో జన్మించిన చలపతిరావు.. నటుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందారు. సుమారు 600 పైగా చిత్రాల్లో ఆయన నటించారు.. 1966 లో విడుదలైన గూడచారి 116 సినిమా ద్వారా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ నటించిన చిత్రాల్లో ఆయన సహాయ నటుడి పాత్రలు వేశారు..

ఆయనతో ప్రత్యేక అనుబంధం
సీనియర్ ఎన్టీఆర్ తో చలపతిరావు కు ప్రత్యేక అనుబంధం ఉంది.. ఆ అనుబంధంతోనే సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఎక్కువ సహాయ నటుడి పాత్రలు ఆయనకు దక్కాయి. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి వంశంలో మూడు తరాల కథానాయకులతో నటించే అవకాశం ఆయనకు లభించింది..”యమగోల”, “యుగ పురుషుడు”,” డ్రైవర్ రాముడు”, “అక్బర్ సలీం అనార్కలి”, ” భలే కృష్ణుడు”, “సరదా రాముడు”, “జస్టిస్ చౌదరి”, ” బొబ్బిలి పులి”, ” చట్టంతో పోరాటం”, ” దొంగ రాముడు”, ” అల్లరి అల్లుడు”, “అల్లరి”, “నిన్నే పెళ్ళాడతా”, ” నువ్వే కావాలి”, “సింహాద్రి”, ” బొమ్మరిల్లు”, “అరుంధతి”, “సింహా”, “దమ్ము”, “లెజెండ్” ఇలా ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడి పాత్రల్లో నటించారు. ఆంగ్ల చివరిసారిగా బంగార్రాజు అనే చిత్రంలో నటించారు.
ఎల్లుండి అంత్యక్రియలు
చలపతిరావు కుమార్తె అమెరికాలో నివాసం ఉంటోంది.. చలపతిరావు మరణ వార్తను ఆమెకు రవిబాబు చేరవేశారు. ఆమె ఇండియాకు వచ్చేసరికి మంగళవారం అర్ధరాత్రి అవుతుంది. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు జరుగుతాయి.. అభిమానుల సందర్శనార్థం చలపతిరావు పార్థివ దేహాన్ని ఆదివారం మధ్యాహ్నం వరకు రవిబాబు ఇంట్లోనే ఉంచుతారు. మధ్యాహ్నం మూడు తర్వాత మహాప్రస్థానానికి తరలించి అక్కడ ఫ్రీజర్ బాక్స్ లో పార్థివ దేహాన్ని ఉంచుతారు. బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు.