Chandrayaan 2 – NASA : నాసా.. అమెరికా అంతరిక్ష పరిశోధనలు చేసే ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. చంద్రుడిపై తొలిసారి అమెరికా జెండా రెపరెపలాడించిన ఘనత ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఉంది. అంతేకాదు అనితరసాధ్యమైన ప్రయోగాలు చేసి అమెరికా కీర్తి ప్రతిష్టలను గగనవ్యాప్తం చేసిన చరిత్ర ఈ పరిశోధన కేంద్రం సొంతం. చంద్రుడు నుంచి మొదలుపెడితే అంగారకుడి వరకు ఎన్నో ప్రయోగాలు నాసా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలు ఉన్నప్పటికీ నాసా చేసిన ప్రయోగాలనే అవి ప్రామాణికంగా తీసుకుంటాయి. వివిధ పరిశోధనల్లో నాసా సహాయం కూడా తీసుకుంటాయి. అలాంటి నాసా భారత్ ప్రయోగించిన ప్రయోగాలను చూసి ఫిదా అయింది. ముఖ్యంగా ఇస్రో ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్_3 ప్రయోగాన్ని చూసి ఆశ్చర్య పోయింది.
చంద్రయాన్_3 ప్రయోగానికి ముందే ఆ వ్యోమ నౌక అభివృద్ధి కార్యకలాపాలను అమెరికా చూసింది. అతి తక్కువ ఖర్చుతో భారత అంతరిక్ష సంస్థ వ్యోమ నౌకను అభివృద్ధి చేయడం పట్ల ఆశ్చర్యపోయింది. చంద్రయాన్_3 వ్యోమ నౌక తయారు చేసేందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అమ్మాలని అమెరికా కోరింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 92 వ జయంతిని పురస్కరించుకొని ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలోని ఆయన స్మారక మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అబ్దుల్ కలాం చేసిన ప్రయోగాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. దేశ యువత అబ్దుల్ కలాం బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కష్టపడి చదవాలని, ఇష్టమైన రంగంలో ఎదిగితే అది దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ ఒక కీలక విషయాన్ని విద్యార్థులను ఉద్దేశించి ప్రకటించారు. “చంద్రయాన్_3 వ్యోమ నౌకను రూపొందించిన తర్వాత అమెరికా నుంచి నాసా కు చెందిన జట్టు ప్రొఫల్షన్ లాబరేటరీ నిపుణులను ఇక్కడికి ఆహ్వానించాం. చంద్రయాన్_3 గురించి వారికి వివరించాం. చంద్రయాన్_3లో మనం వినియోగించిన శాస్త్రీయ పరికరాలను చూసిన నాసా నిపుణులు.. ఖర్చుతో ఆధ్యాత్మిక సాంకేతికత కలిగి ఉన్న పరికరాలను వాడారు అని కొనియాడారు. వాటితో దీన్ని ఎలా రూపొందించారు? ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు ఎందుకు అమ్మకూడదు” అని సోమనాథ్ వివరించారు.
ఇదే సమయంలో అంతరిక్ష పరిశోధన రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సోమనాథ్ విద్యార్థులకు వివరించారు. సంప్రదాయ కోర్సులు కాకుండా వినూత్నమైన కోర్సులను అభ్యసించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ” చెన్నైలోని అగ్నికుల్, హైదరాబాదులో స్కై రూట్ సంస్థలు రాకెట్లు నిర్మిస్తున్నాయి. అలాగే అంతరిక్ష సాంకేతికతలో భారత్ ను మరింత శక్తివంతం చేసే దిశగా రాకెట్లు, ఉపగ్రహాల తయారీకి నిపుణులు ముందుకు రావాలి” అని సోమనాథ్ వివరించారు.”సాధారణ కుటుంబంలో జన్మించి ఇస్రో ఇంజనీర్ గా, రాష్ట్రపతిగా కలాం రాణించారు.. నేను కూడా సాధారణ పాఠశాలలో చదివాను. కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదు” అని సోమనాథ్ పేర్కొన్నారు. కాగా, వ్యోమగాములను అంతరిక్షంలో తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన గగన్ యాన్ ప్రయోగం కీలక పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ ప్రయోగంలో కీలకమైన వ్యవస్థ పనితీరును ప్రదర్శించే టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్_1( టీవీ_డీ1) పరీక్షను తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఈనెల 21 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు తర్వాత దీనికి మరో మూడు డీ2, డీ3, డీ4 పరీక్షలు నిర్వహించనున్నారు.