https://oktelugu.com/

MLC Elections: తెలంగాణలో యూపీ నమూనా.. అదే జరిగితే కారు పార్టీకి మరింత కష్టకాలం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ స్థానాలకు రాజీనామా చేశారు. జనగామ, హుజురాబాద్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 6, 2024 10:27 am
    MLC Elections

    MLC Elections

    Follow us on

    MLC Elections: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కారు పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. తుంటి ఎముక విరిగి కేసీఆర్ మంచాన పడ్డారు.. ఇప్పట్లో ఆయన లేచి పరిస్థితి లేదు. ఇక అధికార కాంగ్రెస్ వరుసగా శ్వేత పత్రాల పేరుతో ఇరుకున పెడుతోంది. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున.. నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాల్లో భారత రాష్ట్ర సమితి నాయకులు వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే ఈ తరుణంలో పులి మీద పుట్రలా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా భారత రాష్ట్ర సమితికి తీవ్ర నిరాశజనకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే భారత రాష్ట్ర సమితిని మరింత కట్టడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యూపీ నమూనాను అమలు చేయడం విశేషం.

    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ స్థానాలకు రాజీనామా చేశారు. జనగామ, హుజురాబాద్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో వారు రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. అయితే ఈ ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 29న ఎన్నికలు జరపాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికల నిర్వహించాలని తాజా షెడ్యూల్లో ఎన్నికల స్పష్టంగా పేర్కొనడంతో భారత రాష్ట్ర సమితికి ఇబ్బందికరంగా మారింది. అంతేకాదు రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడానికి, తమకు రావాల్సి ఉందని భావిస్తున్న ఒక ఎమ్మెల్సీ సీటును కారు పార్టీ కోల్పోయేందుకు ఇది కారణం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం పేర్కొన్న నిబంధనల ప్రకారం రెండింటికి కూడా బ్యాలెట్ పేపర్లను సైతం వేరువేరు సెట్స్ లలో సిద్ధం చేయాలని.. ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ముద్రించాలని ఆదేశాలు జారీ చేసింది. కి పోలింగ్ స్టేషన్లను కూడా విడివిడిగానే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఓటరుల జాబితాలో కూడా ఇదే పద్ధతి పాటించాలని సూచించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరపాలని పేర్కొన్నది.. అంతేకాదు అభ్యర్థులు తమ నామినేషన్లలోనే తాము పోటీ చేయాలనుకున్న పదవి ( శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి) ప్రస్తావించాలని నిర్దేశించింది.

    గతంలో రాష్ట్రంలో రెండు సీట్లు ఖాళీ అయితే రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ఆనవాయితీగా ఉండేది. అప్పుడు మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను, ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్య+1తో భాగించి.. వచ్చిన సంఖ్యకు ఒకటి కలిపేవారు. అంతమంది ఎమ్మెల్యేల బలం ఉన్నవారు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ప్రకటించేవారు. ఉదాహరణకు 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుంటే దానిని 3తో భావిస్తారు. వచ్చిన 40కి ఒకటి కలిపి 40 మంది ఎమ్మెల్యేల బలం వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటించేవారు. ఇక రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి, శ్రీహరి కి వేరు వేరు పదవీకాలం ఉన్నప్పుడు మాత్రమే వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసి, వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తారు. అప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు ఆయా అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఇద్దరి పదవీకాలం కూడా నవంబర్ 30, 2027 తో ముగుస్తున్నాయి. అయినప్పటికీ ఇద్దరూ ఖాళీ చేసిన పదవులను విడివిడిగా భర్తీ చేయడానికి ఈజీ షెడ్యూల్ విడుదల చేయడం విశేషం.

    తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఒక్కో ఎమ్మెల్సీని ఎన్నుకునేందుకు మొత్తం 119 మంది ఎమ్మెల్యేలూ ఓటర్లుగా ఉంటారు. అప్పుడు మెజారిటీ ఓట్లు ఉన్నవారే గెలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది కనుక.. ఆ రెండు స్థానాలనూ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరుతూ అసెంబ్లీ కార్యాలయ వర్గాలు లేఖ రాయడం విశేషం. శనివారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను అసెంబ్లీ కార్యాలయ వర్గాలు సంప్రదించనున్నాయి. ఇక ఈ విధానానికి ఎందుకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిందో ఉత్తరప్రదేశ్ పరిణామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది మే 29న శాసనమండలి ఎన్నికలు జరిగాయి. రెండు సాధారణ భర్తీలకు ఈ పోలింగ్ జరిగింది. ఆ పదవులకు సంబంధించి పదవీకాలాలు వేర్వేరుగా ఉన్నాయి. ఖాళీ చేసిన రెండు స్థానాల్లో ఒకదానికి 2027 జనవరి 30 వరకు పదవీకాలం ఉంది. రెండవ దానికి 2028 జూలై ఆరు వరకు పదవి కాలం ఉంది. సభ్యుడి మరణం లేదా రాజీనామా కారణం వల్ల ఏర్పడిన సాధారణ ఖాళీ కావడంతో ఎన్నికల సంఘం నిబంధన మేరకు వీటికి వేరువేరుగా ఎన్నికలు జరిపారు. 396 మంది ఎమ్మెల్యేలు రెండు సీట్లకు వేరువేరుగా ఓట్లు వేశారు. ఆ రెండు సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ అత్యంత సులువుగా గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన బిజెపి అభ్యర్థులు మానవేంద్ర సింగ్, పదమ్ సింగ్ చౌదురి చేరో 164 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు తమకు కూడా యూపీ విధానం లాభిస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓటమిపాలయ్యారు. అంత తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే చాలా దరఖాస్తులు రావడంతో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్ల గుల్లాలు పడుతుంది. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి మైనారిటీలకు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. షబ్బీర్ అలీ లేదా అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.