https://oktelugu.com/

Happy Valentines Day 2024: మీ మనసైనవారికి ఇలా శుభాకాంక్షలు చెబితే.. ఐస్ ఐపోతారంతే..

Happy Valentines Day 2024 ఈ విశాలమైన ప్రపంచాన్ని నడిపే ప్రేమకు ఎంతో బలం ఉంది. చరిత్ర ఉంది. జ్ఞాపకాల గతం ఉంది. అందమైన వర్తమానం ఉంది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ప్రేమ అనేది అనుభూతుల సమాహారం అయినప్పుడు.. దాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 14, 2024 / 12:03 PM IST
    Follow us on

    Happy Valentines Day 2024: ప్రేమ.. రెండు అక్షరాలు పదం మాత్రమే కాదు.. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. ఎన్నో భావాల సమ్మేళితం. ముందుకు నడిపించే భావోద్వేగం. జ్ఞాపకాల సమాహారం. ఇంతటి చరిత్ర ఉన్న ప్రేమికుల రోజున.. మీ మనసుకు నచ్చిన వారికి శుభాకాంక్షలు చెబితే అది జీవితాంతం గుర్తుంటుంది.. అయితే ఆ శుభాకాంక్షలు రొటీన్ గా కాకుండా విభిన్నంగా ఉంటేనే ఎదుటివారికి నచ్చుతుంది. అది మీపై ప్రేమను మరింత పెంచుతుంది. ఈ ప్రేమికుల దినోత్సవ సందర్భంగా అలాంటి ప్రత్యేకమైన శుభాకాంక్షలు పరంపరను మీకు అందిస్తున్నాం. ఇంకా ఎందుకు ఆలస్యం చదివేయండి.

    క్లాస్ రూమ్ లో టీచర్ అడిగే ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెబుతారు. అదే ఎగ్జామ్ లో ఆ ప్రశ్నకు సరైన సమాధానం రాసిన వారే టాపర్ అవుతారు. ఇదే సూత్రం ప్రేమకు కూడా వర్తిస్తుంది. ప్రేమికుల దినోత్సవం రోజు ఎవరైనా శుభాకాంక్షలు చెబుతారు. విభిన్నంగా చెబితేనే మీ మనసయిన వారి గుండెల్లో మీ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు. ఈ విశాలమైన ప్రపంచాన్ని నడిపే ప్రేమకు ఎంతో బలం ఉంది. చరిత్ర ఉంది. జ్ఞాపకాల గతం ఉంది. అందమైన వర్తమానం ఉంది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ప్రేమ అనేది అనుభూతుల సమాహారం అయినప్పుడు.. దాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి.

    “సూర్యుడు ఉదయిస్తే నేను మేల్కొంటాను. అప్పుడున్న ఆలోచన నువ్వే అవుతావు. సూర్యుడు అస్తమించాక నేను నిద్రపోతాను. అప్పుడు నా చివరి సంఘర్షణ నువ్వే అవుతావు. నా తొలి, నా తుది నీ చుట్టూ తిరుగుతుంది కాబట్టి.. నువ్వు నా ఆరో ప్రాణం. నీకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు”

    “నిండుకుండ తొణకదు. నీపై నా ప్రేమ కూడా అంతే. ఎన్ని అవాంతరాలు వచ్చినా మారదు. నీ రూపం నాకు అపురూపం. నీ మాట నాకు పూల తోట. నీతో గడిపిన ప్రతిక్షణం వేనవేల జ్ఞాపకాల సమహారం. నీ ప్రేమ కోసం అనుక్షణం తపిస్తూనే ఉంటాను.. నా ప్రియమైన నీకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు”

    “స్వర్గం, నరకం వేర్వేరు కాదు. నువ్వు నాతో ఉంటే స్వర్గం. లేకుంటే నరకం. అందుకే నీకు తోడుగా ఉంటాను. నీకు నీడగా ఉంటాను. జన్మంతా నిన్ను పెరవేసుకొని ఉంటాను. సంతోషం, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం వేరువేరు పదాలైనప్పటికీ.. వీటి కలబోత నీ రూపం. నీకు నా ప్రేమికుల రోజు దినోత్సవ శుభాకాంక్షలు”

    “మండే వేసవిలో చినుకుల చల్లదనం.. ముంచెత్తే వానల్లో కాపాడే ధైర్యం.. వణికించే చలిలో వెచ్చదనం.. అన్నీ నువ్వే. కాలాన్ని తగ్గట్టు మారేది నా ప్రేమ కాదు. నీకు నా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు”

    ” కన్ను మూస్తే మరణం.. కన్ను తెరిస్తే జననం.. జనన, మరణాలతో సంబంధం లేదు. నీ పై నా ప్రేమ అజరామరం.. నీకు నా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు”

    ” నిన్ను నా కళ్ళల్లో దాచుకోను. కన్నీరు వస్తే అందులో కరిగిపోతావు. అందుకే హృదయంలో పదిలంగా దాచుకున్నా. ప్రతీ హృదయ స్పందన లో నువ్వే ఉండేలా చూసుకున్నా. నీకు నా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు”

    “సూర్యుడు ఉదయిస్తే ఈ జగమంతా వెలుగు నిండుతుంది. నీ రాకతో నా జీవితం కూడా అలానే వెలుగులు నింపుతుంది. నా తుది శ్వాస వరకు నా జీవితాన్ని ఇలాగే ఉంచు. ఎందుకంటే వెలుగులోనే నా జీవితం అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. నీకు నా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు”

    “నీతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అనుభూతులు ఉన్నాయి. నా జీవితం ప్రతిక్షణం లో నీ సంచారం ఉంది. అందుకే నువ్వు లేకుండా నేను ఉండలేను. నీకు నా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు”