Sarkari Naukri Trailer: తెలుగులో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చాలా తక్కువగా వస్తాయి. స్టార్ సింగర్ సుమ కొడుకు ఆకాష్ గోపరాజు మొదటి ప్రయత్నమే సాహసం చేశాడు. పీరియాడిక్ సోషల్ సబ్జెక్టు ఎంచుకున్నాడు. 90లలో హెచ్ ఐ వి ప్రపంచాన్ని భయపెట్టింది. భారతదేశంలో కూడా విపరీతంగా వ్యాపించింది. అవగాహన లేని చాలా మంది అమాయకులు దానికి బలి అయ్యారు. ప్రభుత్వం ప్రజల్లో అవగాహన తేవాల్సి వచ్చింది. ప్రధానంగా లైంగిక సంబంధాలతో ఆ వ్యాధి వ్యాపిస్తుంది. దాంతో నిరోధ్ వాడండి అంటూ టీవీలు, రేడియోల్లో ప్రకటనలు చేశారు.
డబ్బులు ఖర్చు చేసి నిరోధ్ కొనరని భావించి ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఉచితంగా నిరోధులు అందుబాటులోకి తెచ్చారు. అయినా నిరోధ్ వాడటం అప్పట్లో ఒక వింత. సిగ్గుపడే వ్యవహారంగా ఉండేది. ఈ పాయింట్ ఆధారంగా తెరకెక్కినదే సర్కారు నౌకరి చిత్రం. కొల్లాపూర్ పంచాయితీలో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయ్ గా ఆకాష్ గోపరాజు కనిపిస్తున్నాడు.
సర్కారు నౌకరి అంటే ఆ ఊళ్ళోవాళ్లకు చాలా గౌరవం. ఆకాష్ తో పాటు ఆయన భార్యకు కూడా ఎనలేని గౌరవం ఇచ్చేవారు. ఆకాష్ హెచ్ ఐ వి వ్యాప్తిని కంట్రోల్ చేసే పని చేసే ఉద్యోగి. అందువల్ల నిరోధ్ వాడకం మీద జనాల్లో అవగాహన తెచ్చి ప్రోత్సహించాలి. నిరోధ్ అంటే ఏహ్య భావన కలిగిన గ్రామ ప్రజలు ఆకాష్ అంటే చీదరించుకుంటారు. అతని జాబ్ ని హేళన చేస్తారు.
ఒకప్పటి గౌరవం పోతుంది. పెళ్ళాంకి కూడా అవమానాలు. దాంతో జాబ్ మానేయాలని ఒత్తడి. చివరికి ఊరి నుండి కుటుంబాన్ని ఎలివేస్తారు. ఉద్యోగం అంటే బాధ్యత, ప్రజలకు సేవ చేయడం అని భావించిన హీరో… వాళ్లలో పరివర్తన ఎలా తెచ్చాడు. తిరిగి గౌరవడం ఎలా పొందాడు అనేది కథ. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జి. మోహన్ దర్శకత్వం వహించాడు. శాండిల్య పీసపాటి మ్యూజిక్ అందించారు. జనవరి 1న విడుదల కానుంది.