Sankranti Speciality : సంక్రాంతి.. ఎన్నెన్నో విశిష్టతల సమాహారం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటాన్ని మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను వేర్వేరు రీతుల్లో జరుపుకుంటారు. తెలుగు వారికి సంక్రాంతి, తమిళ్ లకు పొంగల్ పేరు ఏదైనా పండగ ఒక్కటే. దీనికి ముందు వెనుక కాలాన్ని పుణ్యతమమని ధార్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మంచి పనికి కాలంతో పని లేదనే సిద్ధాంతాన్ని పక్కన పెడితే.. కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైందని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో అయితే తిల సంక్రాంతి గా చెప్పుకుంటారు. నువ్వులను దేవతలకు నివేదించి.. వాటిని పదార్థాలు, ప్రసాదాల్లో వినియోగిస్తారు. తెల్ల నువ్వులను, స్వీట్లను పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకునే సంప్రదాయం ఉంది. పంటలు చేతికొచ్చే సమయం ఇది. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. మానవ సంబంధాలతో పాటు ఆధ్యాత్మికత కలగలిపిన పండగే సంక్రాంతి. తెలుగు నాట సంక్రాంతి ఎన్నో కొంగొత్త ఆశలతో కొత్త పనులకు ఆహ్వానం పలుకుతుంది.
రంగవల్లుల శోభలో దివ్యత్వం, కళా నైపుణ్యం గోచరిస్తాయి. ప్రతి ఇంటి ముందు ఒక పత్రంగా, చుక్కలను కలుపుతూ చిత్రించే అద్భుతమైన ముగ్గులు కనిపిస్తాయి. స్నానం, దానం, పితృఆర్పన, జపతపాలు, దేవతార్చనలు సంక్రాంతి ముఖ్య విధులుగా శాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతి ప్రాధాన్యం ఉంది. సంక్రాంతి పుణ్యదినాన ఇచ్చే దానాలు ఎంతో గొప్ప వని శాస్త్రాలు చెబుతున్నాయి.
కనుమ పండుగ కు కూడా ఎంతో విశిష్టత వుంది. జంతు పూజ చేస్తారు. రైతులు తమ పాడి పశువులను, దొడ్లను శుభ్రంగా కడిగి, పూల తోరణాలు కట్టి, పశువులకు కుంకుమ బొట్లు పెట్టి.. వాటికి ప్రత్యేకమైన దాణా అందజేస్తారు. గోపూజ చేస్తారు. పంట చేల వద్ద కొంతమంది రైతులు రేగాకు, ఎముక, జిల్లేడు ఆకులను ఉంచి.. ఉదయాన్నే ఇంట్లో వండిన పులగాన్ని పంటలపై చల్లడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. పండుగ పర్వదినం తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఏపీలో నాలుగు రోజులు పాటు సాగుతుంది. ముక్కనుమతో ముగుస్తుంది.
#RajaSaab pic.twitter.com/Vvzj3YQGVx
— (@BheeshmaTalks) January 15, 2024