https://oktelugu.com/

Sankranthi : భిన్నత్వంలో ఏకత్వం.. సంక్రాంతి భారతం

నవరాత్రి ఉత్సవాలు, దుర్గాదేవి ఉత్సవాలు, సంక్రాంతి పండుగ, దీపావళి వేరువేరు పేర్లతో దేశం మొత్తం జరుపుకుంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : January 15, 2024 2:41 pm
    Follow us on

    Sankranthi :  పంటలన్నీ ఇంటికి వచ్చిన వేళ.. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన వేళ.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను మూడు లేదా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ఏపీకి పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలోనూ ఇదే తీరుగా పొంగల్ వేడుకలు జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ప్రాంతంతో పోలిస్తే ఆంధ్రాలో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. తొలిరోజు భోగి అని, ప్రతిరోజు సంక్రాంతి అని, మూడో రోజు కనుమని, నాలుగవ రోజు ముక్కనుమ అని వేడుకలు జరుపుకుంటారు. ఈ వేడుకలన్నీరోజులు ఇళ్ళన్నీ ఎంతో సందడిగా ఉంటాయి. బంధుమిత్రుల రాకతో కళ కళలాడుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే ఇతర రాష్ట్రాల్లోనూ సంక్రాంతి వేడుకలను వివిధ పేర్లతో పిలుచుకుంటూ వేడుకలు జరుపుకుంటారు.

    తమిళనాడు రాష్ట్రంలో పొంగల్, అస్సాం లో మాగ్ బిహూ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో మకర్ సక్రాట్, జమ్మూ కాశ్మీర్లో శిశుర్ సంక్రాట్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పోశు సంక్రాంతి, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మాగీ, లోహారీ గా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఉత్తరాయన్ గా, ఒడిశా రాష్ట్రంలో మకర్ సంక్రాంతి, కర్ణాటక రాష్ట్రంలో మకర సంక్రమణ, కేరళ రాష్ట్రంలో మకర విలక్కు అనే పేరుతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. అయితే అన్ని ప్రాంతాల్లో పంటలన్నీ చేతికి రావడంతో రైతులు ప్రత్యేకంగా వంటకాలు తయారు చేసుకుని భుజిస్తారు. తెలుగు రాష్ట్రాలలో కోడిపందాలు, తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు, ఉత్తరాది రాష్ట్రాలలో కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిపందాలు భారీగా జరుగుతుంటాయి. కోట్లల్లో పందాలు నడుస్తూ ఉంటాయి.. కోడిపందాలతో పాటు గుండాట, లోనా బయట, జూదం వంటి ఆటలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.

    ఇక ఇతర రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా జరుగుతూ ఉంటాయి. అస్సాం రాష్ట్రంలో జరిగే సంక్రాంతి వేడుకల్లో అక్కడి ప్రజలు నదికి వెళ్లి పుణ్యస్నానాలు చేస్తారు. అనంతరం నువ్వులు, నెయ్యి, బెల్లంతో ప్రత్యేక వంటకాన్ని తయారుచేసి ఆరగిస్తారు. బెంగాల్లో ప్రత్యేకంగా స్వీట్లు తయారు చేస్తారు. పేదలకు దానధర్మాలు చేస్తుంటారు.. తమిళనాడు రాష్ట్రంలో పొంగల్ సందర్భంగా ప్రత్యేకంగా పాయసం వండుకుంటారు. కుటుంబ సభ్యులు మొత్తం సంప్రదాయ దుస్తుల్లో స్థానిక దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు. కేరళ రాష్ట్రంలోనూ ఇదే తీరుగా వేడుకలు జరుపుకుంటారు. కాకపోతే అక్కడ కొబ్బరి నూనెతో ప్రత్యేకమైన వంటకాలు తయారు చేసుకుంటారు. పంజాబ్ రాష్ట్రంలో అయితే మక్కీకా రోటి అనే ప్రత్యేక వంటకాన్ని తయారు చేసుకుంటారు.. పన్నీర్ తో కూరలు వండుకొని అందులో ముంచుకుని మక్కీగా రోటిని ఆస్వాదిస్తూ తింటారు. రాజస్థాన్ రాష్ట్రంలో పతంగులు ఎగరవేసి సంబరాలు జరుపుకుంటారు. ఇక జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో అయితే సాయంత్రం నదిలో దీపాలు వదిలిపెడతారు. కిచిడి వంటి ప్రత్యేక వంటకాన్ని తయారు చేసుకొని ఇంటిల్లిపాది ఒకే చోట కూర్చొని ఆరగిస్తూ ఉంటారు.

    ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అయితే పశువులను శుభ్రంగా కడిగి, కొమ్ములకు రంగులు రుద్ది, మెడలో బంతిపూల దండలు వేస్తారు. అనంతరం వాటిని పొలాల వద్దకు తీసుకెళ్లి.. స్థానికంగా చెరువులో లభ్యమయ్యే మట్టితో దేవుడిని తయారుచేసి.. దేవుడి ఎదుట కొత్త బియ్యంతో పరమాన్నం ఉండి.. ఆ పరమాన్నాన్ని ఆ పశువుల మీద చల్లుతారు. దీనివల్ల ఏడాది పాటు పశువులు ఎటువంటి రోగాలు లేకుండా ఉంటాయని రైతుల నమ్మిక. స్థూలంగా మనదేశంలో ఏదో ఒకచోట పండుగలు జరుగుతూనే ఉంటాయి. అయితే నవరాత్రి ఉత్సవాలు, దుర్గాదేవి ఉత్సవాలు, సంక్రాంతి పండుగ, దీపావళి వేరువేరు పేర్లతో దేశం మొత్తం జరుపుకుంటుంది.