Sankranthi Pandem Kollu : పిస్తా, బాదం, జీడిపప్పు, మటన్ కీమా.. నమ్మండి ఇది కోళ్ళ మెనూ

పందెపు రాయుళ్ళకు ప్రత్యేకంగా వెతుక్కోకుండా ఏ జాతి కోడి పుంజు కావాలంటే అవి అందుబాటులో ఉండటంతో మరింత హుషారుగా ఉన్నారు.

Written By: NARESH, Updated On : January 5, 2024 4:53 pm
Follow us on

Sankranthi Pandem Kollu : శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజు ఉదయం నానబెట్టిన బాదం పప్పులు తింటారు. కొంచెం స్తోమత ఉన్నవారు పిస్తాను లాగిస్తారు. ఇంకాస్త డబ్బులు ఉన్నవారు జీడిపప్పుని కూడా అందులో కలుపుకుంటారు. పుట్టిన 20 రోజుల నుంచి ఇలాంటివి తింటూ ఉంటే..అవి ప్రతిరోజు మెనూ లో ఉండి ఉంటే.. ఎవరో ఆ అదృష్టవంతులు.. పెట్టి పుట్టి ఉంటారు అనుకుంటున్నారా.. మీరు అనుకుంటున్నది నిజమే.. కాకపోతే వారు మనుషులు కాదు. జంతువులు.. జంతువులకు బాదం, పిస్తా పెట్టడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది..

సంక్రాంతి పండుగ అనగానే చాలామందికి కోడిపందాలు గుర్తుకొస్తాయి. అయితే ఈ కోడిపందాల మీద కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. మరి ఆ స్థాయిలో లావాదేవీలు జరిగినప్పుడు పోట్లాడే కోళ్లు కూడా చాలా బలిష్టంగా ఉండాలి. పోరాడే సత్తువని కలిగి ఉండాలి. మరి అలాంటి కోళ్లకు ఎలాంటి ఆహారం ఇస్తారంటే.. పందెంలో కాళ్లు దువ్వే కోడి పుంజులకు జీడిపప్పు, బాదం పప్పు, మటన్‌ కీమా, రాగి సంగటి, ప్రత్యేకించి ఎంచుకున్న దాణాను ప్రతి రోజు ఓ క్రమపద్దతిలో కోడి పుంజులకు ఆహారంగా అందిస్తుంటారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన నీటి తొట్టెలు (స్మిమ్మింగ్‌పూల్‌)లో కోడి పుంజులను రోజు పది నుంచి 15 నిమిషాల పాటు ఈత కొట్టిస్తుంటారు. ఒళ్ళంతా గట్టిపడేలా ప్రత్యేకంగా వామ్‌ అప్‌ చేయిస్తుంటారు. వ్యాధులు సోకకుండా వ్యాక్సిన్‌లు, మందులను వాడుతుంటారు. చిన్న పిల్లలకంటే ఎంతో అల్లారు ముద్గుగా, ప్రత్యేకించి సిద్ధం చేసిన ఆహారాన్ని అందిస్తూ, అప్పడప్పుడు కోళ్ళను ఎగిరిస్తూ శిక్షణను సహితం అందిస్తుంటారు.

ఒక్కో కోడి రూ. లక్షపైమాటే..

ఇలా పెంచిన కోడి పుంజును ఒక్కో దానిని లక్ష నుంచి లక్షన్నర రూపాయలకుపైగా పలుకుతుంది. కోడి పుంజు సైజు, జాతి, పెంచిన విధానం బట్టి కూదా కోడి పుంజుకు ధర పలుకుతంది. కొన్ని కోడిపుంజులు రూ.50 వేల నుంచి లక్ష మధ్య కూడా ఉంటాయి. ఎక్కువ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఈ ప్రాంతానికి వచ్చి కోడి పుంజులను కొనుగోలు చేసుకొని వెళుతుంటారు. ఒక్కో కోడి పుంజును ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు పలు రకాల ఆహారపదార్థాలను అందించి పెంచుతారు. ఒక్కో కోడి పుంజును పెంచడానికి రూ.25 నుంచు 40 వేల మధ్య ఖర్చు అవుతుంది. ఆహార పదార్థాలతో పాటు సీసీ కెమెరాలు, విద్యుత్‌ దీపాలు, కోడి పుంజులకు ప్రత్యేకంగా ఒక్కో దానికి వేరువేరుగా పెన్షింగ్‌ కంచెలు ఏర్పాటు చేస్తారు. కొన్ని పెంపకం కేంద్రాలలో జాతి కోడి పుంజులను, కోడి పి మట్టలను సైతం తెచ్చి , వాటిని క్రాస్‌ చేయించి గుడ్డు పెట్టించి, పిల్లలను పెంచుతారు. ఇది నిరంతర శ్రమ. ఏడాదంతా కష్టపడితే సంక్రాంతి సీజన్‌లో మాత్రమే వీరికి మంచి డిమాండ్‌ ఏర్పడుతుంది.

ప్రత్యేక జాతులు..

కోడి పందెం వేసే సమయంలో ఒక్కో సమయంలో ఒక్కో జాతి పందెం పొడుస్తుందని, ఒక్కో జాతికోడిపైనా ఒక్కో జాతి పుంజును వేస్తేనే పందెం పొడుస్తుందని పందెపురాయుళ్ళు ఎంపిక చేసుకున్న జాతి, రంగు కోళ్ళను పందానికి దింపుతారు. కోడి పుంజుల్లో డేగ, కాకి, పచ్చకాకి, సేత్రు, నెమలి, కేతు, పింగళ వంటి జాతుల కోడి పుంజులు వుంటాయి. పుంజుల్లో రంగులు, ఈకలు, ప్రత్యేక లక్షణాలను బట్టి ఇవి ఏ జాతికి చెందిన కోడి పుంజో పందెపు రాయుళ్ళు గుర్తు పడతారు. ఎదుటి కోడి జాతిని బట్టి ఏ జాతి పుంజును పందానికి దింపాలో నిర్ణయించుకుంటారు..

కోట్లల్లో లావాదేవీలు..

సంక్రాంతి సమీపిస్తుండటంతో కోడి పుంజులను పెంచుతున్న నిర్వాహకులు కోడి పుంజులను సిద్దం చేస్తున్నారు. ఒక్కో కోడి పుంజును కనీసం లక్ష రూపాయలకు విక్రయిస్తున్నారు. 100 నుండి 300 వరకు కోడి పుంజును పెంచేవారికి కనీసం కోట్లల్లోనే ఆదాయం లభిస్తుంది. ఈ పుంజులను పందాలు వేయడం ద్వారా మరి కొన్ని కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. పందెపు రాయుళ్ళకు ప్రత్యేకంగా వెతుక్కోకుండా ఏ జాతి కోడి పుంజు కావాలంటే అవి అందుబాటులో ఉండటంతో మరింత హుషారుగా ఉన్నారు.