https://oktelugu.com/

Namaste Telangana : అధికారం పోయింది.. తొలిసారి ‘నమస్తే’లో జీతం ఆగింది!

అరకొర వేతనాలే ఇచ్చారు. కాకుంటే ప్రతీనెల ఠంచన్‌గా చెల్లించారు. కానీ ఇప్పుడు ఓటమిని సాకుగా చూపి వేతనాల చెల్లింపులో జాప్యం చేయడం ఆ సంస్థ మనుగడపైనే ప్రభావం చూపుతుందని పలువురు పేర్కొంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2024 / 04:14 PM IST
    Follow us on

    Namaste Telangana : ముందుగ మురిస్తే పండుగ కాదంటారు.. అధికారం ఉన్నప్పుడు రాజసం ప్రదర్శించి.. పోయాక విలపిస్తే ఎవ్వరికి సానుభూతి రాదు. ఇప్పుడు బీఆర్ఎస్ కు.. దాని పత్రిక నమస్తే తెలంగాణకు ఇదే ఫలితం కనిపిస్తోంది. సానుభూతి దక్కకపోగా చేస్తున్న పనులకు విమర్శలు వచ్చిపడుతున్నాయి.. నెలరోజులకే ఇంతటి దీన స్థితికి దిగజారిపోయారా? అని జర్నలిస్టుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

    నమస్తే తెలంగాణ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రారంభమైన దినపత్రిక. బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌)కు ఉద్యమ సమయంలో అండగా నిలిచింది. రెండు సార్లు ఆ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడంలోనూ కీలకపాత్ర పోషించింది. ఇందుకు పత్రికలో పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగి కారణం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విషయాన్ని గుర్తించిన కేసీఆర్‌ ప్రతీ ఉద్యోగికి బోనస్‌ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలో ఉన్నన్ని రోజులు వేతనాలు భారీగా పెంచుతూ వచ్చారు. బోనస్‌లు చెల్లించారు. కానీ, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయింది. నెల రోజులు కూడా గడవ లేదు. అప్పుడే వేతనాలు నిలపివేసే పరిస్థితి ఏర్పడింది. పత్రిక ప్రారంభించిన నాటి నుంచి ప్రతీనెల 31 లేదా ఒకటో తేదీన వేతనాలు చెల్లించే నమస్తే తెలంగాణ యాజమాన్యం ఈసారి 2వ తారీఖు వచ్చినా వేతనాలు చెల్లించలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

    ఉద్యోగుల కుదింపు..
    ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నమస్తే తెలంగాణ యాజమాన్యం కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు తగ్గించాలని అన్ని ఎడిషన్లకు సమాచారం పంపించింది. తెలంగాణ వ్యాప్తంగా 2 వేల మందిని తొలగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంతోనే ఉద్యోగులు ఎప్పుడు తమకు తొలగింపు లేఖ వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంత మందిని తొలగించారని తెలుస్తోంది. ఈ క్రమంలో వేతనాల చెల్లింపు జాప్యం చేయడం ఉద్యోగాల్లో ఆందోళనను మరింత పెంచింది.

    ఓటమి ప్రభావం పత్రికపై..
    నమస్తే తెలంగాణ పత్రికపై బీఆర్‌ఎస్‌ ఓటమి ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. అధికారంలో ఉన్న సమయంలో ఓ వెలుగు వెలిగిన పత్రిక అధికారం కోల్పోవడంతోనే చతికిల పడడం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తున్నారు. డెస్క్‌లో మార్పులు చేస్తున్నారు. అనవసర వ్యయాలను తగ్గించారు. అధికారంలో ఉన్నప్పుడు సర్క్యులేషన్‌ ఉన్నట్లు చూపేందుకు ఫ్రీ కాపీలు వేసేవారు. ఇప్పుడు అవన్నీ నిలిపివేశారు.

    వేతనాలకు ఇబ్బంది..
    అధికారం కోల్పోయిన మొదటి నెలకే నమస్తే తెలంగాణ యాజమాన్యం ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించే సంస్థ.. డిసెంబర్‌ నెల వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదు. దాదాపు 12 ఏళ్ల ప్రస్థానంలో సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం ఇదే మొదటిసారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ఓడిపోవడంతో ఇంతలా పరిస్థితి ఏర్పడడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుౖడైనా ఉద్యోగులకు మంచి వేతనాలు ఇచ్చారా అంటే అదీ లేదు. అరకొర వేతనాలే ఇచ్చారు. కాకుంటే ప్రతీనెల ఠంచన్‌గా చెల్లించారు. కానీ ఇప్పుడు ఓటమిని సాకుగా చూపి వేతనాల చెల్లింపులో జాప్యం చేయడం ఆ సంస్థ మనుగడపైనే ప్రభావం చూపుతుందని పలువురు పేర్కొంటున్నారు.