Russia-Ukraine war.. US dual stance?: ఉమ్మడి శత్రువైన రష్యాను యుద్ధం ఆపేయమని గట్టిగా అడగలేని పరిస్థితి అమెరికాది.. దానిపై యుద్ధానికి దిగలేని దుస్థితి. కేవలం ఆర్థిక ఆంక్షలు వేసి.. ఆ దేశం నుంచి వచ్చే గ్యాస్ కు మాత్రం అడ్డుచెప్పలేని పరిస్థితి. రష్యా నుంచి అన్నీ బంద్ చేస్తే అంతో ఇంతో పరిస్థితి తేలికపడుతుంది. కానీ ఇప్పుడు అమెరికా, పశ్చి మ దేశాలు రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటూ మరో వైపు ఆంక్షలు అంటూ టైట్ చేస్తున్న వైనం విమర్శలకు తావిస్తోంది.

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంతో ప్రపంచ అప్రమత్తమైంది. ముఖ్యంగా పశ్చిమ దేశాలు ఈ యుద్ధాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. చివరికీ ఏం జరుగుతోందనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. కానీ రష్యాను విలన్ చేస్తూ యుద్ధం ఆపాలని నినదిస్తున్నారు. యూరప్ లోని దేశాధినేతలే కాకుండా సాధారణ పౌరులు సైతం ఈ యుద్ధం ఆపాలని రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ఉంటుందని ఇప్పటికే ఆ దేశాధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. అంతేకాకుండా ఉక్రెయిన్ కు నేరుగా బలగాల సాయం చేయడం కాకుండా.. రష్యాను ఆర్థికంగా నష్టం చేకూర్చే పనులు చేపడుతున్నామని చెబుతున్నారు. కానీ రష్యా నుంచి వచ్చే గ్యాస్ విషయంలో మాత్రం ఈ ఆంక్షల పరిధిలోకి రానట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎనిమిది రోజులుగా యుద్ధం జరుగుతున్నా.. రష్యా నుంచి యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా కొనసాగుతూనే ఉంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంలో ఓ ప్రకటన జారీ చేశారు. ఇందులో రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేశామని, దీంతో ముందు ముందు ఆ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రపంచంలో అత్యధిక లాభాలు ఆర్జించాలనుకున్నవారికి ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. అయితే ఇప్పటికే యూరోపియన్ దేశాలు ఈ చర్యలు తీసుకోవడంతో ఈ ప్రభావం రష్యాలో కనిపిస్తుందని పశ్చిమ దేశాలకు చెందిన మీడియా చూపిస్తోంది. రష్యాలో డబ్బుల కోసం ప్రజలు ఏటీంల ముందు బారులు తీరుతున్నారని చెప్పింది. అయితే అసలు విషయం ఏంటనేది మాత్రం తెలియరావడం లేదు. ఎందుకంటే ఆ దేశంలో మీడియాపై ఇప్పటికే ఆంక్షలు విధించారు.
రష్యాపై ఆంక్షల విషయంలో అమెరికా ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి గ్యాస్ సరఫరా ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి వచ్చే గ్యాస్ విషయంలో అమెరికా ఎలాంటి నిషేధం ప్రకటించలేదని సమాచారం. యుద్ధం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు రష్యాకు చెందిన గజ్ ప్రోమ్ అనే కంపెనీ వెల్లడించింది. దీంతో గ్యాస్ విషయంలో రష్యాపై ఆంక్షలను అమెరికా ఎందుకు విధించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు రష్యాతో వచ్చిన విభేదాల కారణంగా ఉక్రెయిన్ 2014లోనే గ్యాస్ తీసుకోవడం ఆపేసింది. కానీ పశ్చిమ దేశాలు మాత్రం ఈ గ్యాస్ ను నిరంతరం తీసుకుంటున్నాయి. అదీకూడా పైప్ లైన్ ద్వారా. ప్రపంచంలో చమురు ఉత్పత్తి దేశాల్లో రష్యా రెండో అతిపెద్ద దేశం. రష్యా నుంచి గ్యాస్ తీసుకోవడం ఆపేస్తే యూరప్లోని చాలా దేశాల్లో హీటింగ్ సిస్టమ్ ఆగిపోతుంది. దీంతో వాతావరణంలో చలి పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా విమానాలు, కార్లు, ఇతర వాహనాలకు గ్యాస్ అందకుండా పోతుంది. ఇక పెట్రో ఉత్పత్తులను ఖతార్ దేశం కంటే రష్యా నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఆ విషయంలో రష్యాపై ఆంక్షలు విధించలేదని తెలుస్తోంది.
ఒకవేళ అన్నీ కాదని రష్యాపై గ్యాస్ విషయంలో ఆంక్షలు విధిస్తే ఇరు వైపులా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఎగుమతులు లేక రష్యా.. అవసరానికి అందక పశ్చిమ దేశాలకు నష్టం జరగుతుంది. అయితే ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో తాము రష్యాకు వ్యతిరేకంగా అన్ని ఆంక్షలు విధిస్తున్నామని చెప్పినప్పటికీ గ్యాస్ విషయంలో మాత్రం ఎందుకు ఆంక్షలు విధించడం లేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ యుద్ధం మొత్తంలో రష్యా విలన్ అయినా కొన్ని అవసరాలకు రష్యా కాదంటే పశ్చిమ దేశాలే విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే పుతిన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.