Sankranti Rumor: అపోహలు ప్రజల్లోకి వెళ్ళినంత వేగంగా.. నిజాలు వెళ్ళవు. నిజం చెప్పులేసుకొని బయలుదేరి వెళ్లే లోపే.. అబద్ధం ఊరూ వాడా ప్రచారం చేస్తుందంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటువంటి అపోహ ఒకటి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దాని ప్రభావంతో గాజులు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.ఏ గాజుల షాపు చూసినా మహిళల రద్దీ కనిపిస్తోంది. సాధారణంగా పండుగ పూట ఈ తరహా రద్దీ ఉంటుంది గానీ.. పండుగకు ముందే గాజుల విక్రయాలు భారీగా పెరగడం వెనుక ఒక కారణం ఉంది. ఎక్కడ పుట్టిందో తెలియదు గానీ రెండు రాష్ట్రాలకు ఇది కుదిపేస్తోంది.
సంక్రాంతికి ఒక కుమారుడు ఉన్న తల్లి.. ఇద్దరు కుమారులు ఉన్న మహిళ వద్ద డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఇప్పటికే పల్లెలు, పట్టణాల్లో విస్తరించింది . ఇంకేముంది ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్దకు.. ఒక్క కొడుకు ఉన్న తల్లులు పరుగు పెడుతున్నారు. వారి వద్ద డబ్బులు తీసుకుని గాజులు వేసుకుంటున్నారు. ఎటువంటి హాని తలపెట్టవద్దని భగవంతుని కోరుతున్నారు.ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందని.. అందుకోసమే ఒక్క కొడుకు ఉన్న మహిళలు.. ఇద్దరు కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బులు తీసుకోవాలని.. ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలని ప్రచారం జరుగుతోంది. అది కూడా సంక్రాంతి లోపే పూర్తిచేయాలని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రతి ఇంటా ఉండడంతో ఈ వార్త వైరల్ గా మారింది. అందరిలో ఒక రకమైన భయం రేపుతోంది. దీంతో తమకు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. విద్యావంతులు సైతం ఈ కీడు భయంతో దీనినే అనుసరిస్తుండడం విశేషం. మరోవైపు ఎటువంటి కీడు లేదని.. ఇది దుష్ప్రచారం మాత్రమేనని.. గాజులు ధరించినంత మాత్రాన ఏ కీడు పోదని వేద పండితులు, పురోహితులు చెబుతున్నారు. ఇలాంటి మాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఉత్త ప్రచారంతో గాజుల షాపుల నిర్వాహకులకు మాత్రం వ్యాపారం దండిగా సాగుతోంది.