https://oktelugu.com/

Hyderabad Police : రూ.700 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ పట్టేశారు.. మన హైదరాబాద్ పోలీసులను మెచ్చుకోవాల్సిందే

ఈ సైబర్‌ మోసాలన్నీ చైనా దుబాయ్‌ కేంద్రంగా చేస్తున్నారు. అక్కడి నుంచి ఆపరేట్‌ చేసే కొందరు కేటుగాళ్లు ఇక్కడ తమ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వారి ద్వారా మిగతా కథను నడిపిస్తున్నారు. స్థానిక భాషలు మాట్లాడుతూ నిండా ముంచుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 23, 2023 / 09:07 PM IST
    Follow us on

    Hyderabad Police : హైదరాబాద్‌లో కొత్తరకం ఉగ్రకోణం బయపడింది. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని తాత్కాలిక ఉద్యోగాల పేరుతో చైనీస్‌ నెట్‌వర్క్‌ లింక్స్‌తో వందల కోట్లు దోచేందుకు పన్నిన కుట్రను సైబర్‌ క్రైం పోలీసులు ఛేదించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 వేల మంది వీరిబారిన పడి లక్షల్లో నష్టపోయినట్లు గుర్తించారు. ఈ కొత్తరకం మోసం నుంచి వేల మందిని హైదరాబాద్‌ పోలీసులు కాపాడగలిగారు.

    – అదనపు ఆదాయం కోసం..
    ఈ మధ్య కాలంలో చేస్తున్న పనితోపాటు అదనపు ఆదాయం కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. పెరిగిపోతున్న ఖర్చులు కావచ్చు ఇంకా సంపాదించాలన్న ఆలోచన కావచ్చు.. ఇలాంటి వాళ్లే ఈ సైబర్‌ కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్లే ఈ సైబర్‌ మోసగాళ్ల వలలో చిక్కుతున్నారు.

    – టాస్క్‌ల పేరుతో లింక్స్‌..
    సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ సైబర్‌ మోసాలకు అడ్డాగా మారుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌, టెలిగ్రామ్‌ ద్వారా తమ మోసాలను స్టార్ట్ చేస్తున్నారు. టాస్క్ ఓరియెంటెడ్ జాబ్స్ అని చెప్పి మొదలు పెడతారు. మొదట్లో ఆన్‌లైన్‌లో టాస్క్‌ల పేరుతో ఈ సైబర్‌ నేరగాళ్లు కొన్ని లింక్‌లు పంపిస్తారు. అందర్నీ నమ్మించేందుకు మొదట్లో చిన్న చిన్న అమౌంట్లు వేస్తారు. నమ్మకాన్ని కలిగిస్తారు.

    – చిన్న ట్రిక్‌తో రూ.712 కోట్లు కొల్లగొట్టారు….
    అక్కడే నేరగాళ్లు తమ ట్రిక్‌ను ఉపయోగిస్తారు. ట్యాక్స్‌ ఇష్యూ రాకుండా ఉండేందుకని చెప్పి డమ్మీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అలా చేస్తే ట్యాక్స్ తక్కువ పడుతుందని కలరింగ్ ఇస్తారు. చేస్తున్న పనికి మరింత డబ్బులు రావాలంటే కొంత అమౌంట్ చెల్లించాలని చెప్తారు. అలా దాని కొంత అమౌంట్ తీసుకుంటారు. చేస్తున్న పనికి వచ్చే డబ్బులను వాళ్లు క్రియేట్ చేసిన డమ్మీ ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చూపుతారు. ఆ అకౌంట్‌లో అమౌంట్‌ ఉన్నట్లు కూడా చూపిస్తారు. అయితే దానిని డ్రా చేసుకోవాలంటే మాత్రం కొంత ట్యాక్స్ కట్టాలనో ఇంకొకటనో చెప్తారు. వీళ్ల మాయమాటలు నమ్మి దేశవ్యాప్తంగా 15 వేల మంది బాధితులు రూ.712 కోట్లు పోగొట్టుకున్నారు. అమాయకులే కాకుండా హైలెవల్ పొజిషన్‌లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కూడా వీరి బాధితులే.

    – చైనా, దుబాయ్‌ నుంచి..
    ఈ సైబర్‌ మోసాలన్నీ చైనా దుబాయ్‌ కేంద్రంగా చేస్తున్నారు. అక్కడి నుంచి ఆపరేట్‌ చేసే కొందరు కేటుగాళ్లు ఇక్కడ తమ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వారి ద్వారా మిగతా కథను నడిపిస్తున్నారు. స్థానిక భాషలు మాట్లాడుతూ నిండా ముంచుతున్నారు. షెల్ కంపెనీలు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్‌ చేసి.. వచ్చిన డబ్బును చైనా, దుబాయ్‌కు పంపిస్తున్నారు.

    – క్రిప్టో కరెన్సీగా మార్చి..
    శివకుమార్ అనే ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన సైబర్‌క్రైం పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. నిందితులకు చెందిన 48 అకౌంట్స్‌లో రూ.584 కోట్లు జమయ్యాయని గుర్తించారు. మరో రూ.128 కోట్లు ఇతర అకౌంట్స్‌లో డిపాజిట్‌ అయినట్లు నిర్ధారించారు. నకిలీ పత్రాలతో లక్నోలో 33 షెల్ అకౌంట్స్, 65 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఫ్రాడ్ చేసిన డబ్బును ఈ షెల్ కంపెనీలు, అకౌంట్స్‌లో డిపాజిట్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఫ్రాడ్ చేసిన డబ్బుని క్రిప్టో కరెన్సీగా ట్రాన్స్ఫర్ చేసుకుని దుబాయ్, చైనాలో విత్‌డ్రా చేసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన రాధిక మార్కెటింగ్ కంపెనీ పేరిట ఒక ఖాతా రిజిస్టర్ చేసినట్లు నిరా‍్ధరించారు.

    – ఉగ్రవాదులకు ట్రాన్స్‌ఫర్‌..
    చైనా, దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితులకు ఇండియాలో కొందరు ఏజెంట్లు సహకరిస్తున్నారు. ఇప్పుడు అలాంటి 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మునావర్, అరుల్‌దాస్, షమీర్‌ఖాన్, షా సుమైర్ ఉన్నారు. వీరు అహ్మదాబాద్‌కు చెందిన ప్రకాశ్‌, ముల్చంద్‌భాయ్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి, ముంబైకి చెందిన గగన్ సోనీ, పర్వేజ్ అలియాస్ గుడ్డు, నయీముద్దీన్ షేక్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని గుర్తించారు. వీరు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేసిన డబ్బుని క్రిప్టో కరెన్సీకి మార్చి ఆ క్రిప్టో కరెన్సీని హిజ్బుల్లాకి సంబంధించిన టెర్రర్ మాడ్యూల్‌కి ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. ఇక్కడ ఫ్రాడ్ చేసిన డబ్బును టెర్రరిస్టులకు ఫైనాన్స్ చేసే అవకాశం కూడా ఉందని తేల్చారు.

    – కొత్తరకం మోసం..
    ఇది పూర్తిగా కొత్తరకమైన మోసంగా కమిషనర్‌ సీవీ.ఆనంద్‌ తెలిపారు. ఇప్పటి వరకు చాలా రకాల సైబర్‌ మోసాలను చూశామని, కానీ ఇలా పార్ట్‌టైం జాబ్స్‌ పేరుతో ఎరవేసి డబ్బులు లాగడం ఇదే తొలిసారని వెల్లడించారు. ఇందుకు నకిలీ ఖతాలు ఓపెన్‌ చేయడం, వర్క్‌ చేసిన వారి నుంచే డబ్బులు కట్టించుకోవడం, ఆ డబ్బులను క్రిప్టో రూపంలోకి మారు‍్చకుని చైనాలో విత్‌డ్రా చేయడం ఈ వ్యవహారమంతా కొత్తరకమైందని వెల్లడించారు. యువత, నిరుద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ దందా దేశవ్యాప్తంగా జరుగుతుండగా.. హైదరాబాద్‌ పోలీసులు అత్యంత చాకచక్యంగా దీనిని ఛేదించారు. ముఖ్యంగా సైబర్‌క్రైం పోలీసులు చిన్న ఫిర్యాదు ఆధారంగా తీగ లాగితే డొంక కదిలింది. భారీ కుట్ర బయటపడింది.