Roshni Nadar Remains richest Indian woman : ఆడది అంటే అబల కాదు.. సబల అని నిరూపిస్తున్నారు. జనాభాలో సగం ఉన్న మహిళలు.. అవకాశాలు అందిపుచ్చుకోవడంలోనూ.. లక్ష్యాలు సాధించడంలోనూ ముందుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. దేశంలోనూ ఒక మహిళ రాష్ట్రపతిగా ఎదిగారంటే వారి శక్తిని అంచనా వేసుకోవచ్చు. దేశంలో ఉద్యోగాలు సంపాదించడంలోనూ.. విద్య, ఉపాధిలోనూ మహిళలు దూసుకెళుతున్నారు. ఇక వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలో టాప్ 100 ధనవంతులైన మహిళల జాబితాను ‘హురన్’ సంస్థ విడుదల చేసింది. అందులోని టాప్ `10లో చోటుదక్కించుకున్న వారు ఎవరు? వారి సంపద ఎంతనో తెలుసుకుందాం..

హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోషిని నాడార్ మల్హోత్రా దేశంలో నంబర్ 1 ధనవంతురాలిగా ఎదిగారు. దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళ రోషిని కావడం విశేషం. 2021 నాటికి ఆమె నికర విలువ 54 శాతం పెరిగి రూ. 84,330 కోట్లకు చేరుకుని భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్-హురున్ జాబితా ప్రకారం.. ఒక దశాబ్దం క్రితం అందం పెంచే ఉత్పత్తుల బ్రాండ్ ‘నైకా’ను ప్రారంభించి తన బ్యాంకింగ్ కెరీర్‌ను విడిచిపెట్టిన ఫల్గుణి నాయర్ దేశంలోనే అత్యంత సంపదనపరులైన మహిళల్లో రెండో స్థానంలో నిలిచారు. రూ. 57,520 కోట్ల నికర విలువతో రెండో మహిళగా అవతరించారు. 59 ఏళ్ల నాయర్ ఈ సంవత్సరంలో తన సంపదలో 963 శాతం పెంచుకోగలిగింది.
బయోకాన్‌కి చెందిన కిరణ్ మజుందార్-షా మూడో స్థానంలో ఉన్నారు. ఈమె సంపద 21 శాతం క్షీణించింది. రూ. 29,030 కోట్ల సంపదతో దేశంలో మూడవ అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. గతంలో కంటే ఒక ర్యాంక్ దిగజారారు.
ఈ జాబితాలో దివీస్ లేబొరేటరీస్‌కు చెందిన నీలిమా మోటపర్తి రూ. 28,180 కోట్లు సంపదతో 4వ స్థానంలో నిలిచారు. జోహోకు చెందిన రాధా వెంబు (రూ. 26,620 కోట్లు)తో 5వ స్థానంలో.. యుఎస్‌వికి చెందిన లీనా గాంధీ తివారీ (రూ. 24,280 కోట్లు)తో 6వ స్థానంలో ఉన్నారు.
-థర్మాక్స్‌కు చెందిన అను అగా మరియు మెహెర్ పుదుంజీ (రూ. 14,530 కోట్లు) సంపాదనతో 7వ స్థానంలో నిలిచారు.
– న్యూ కన్‌ఫ్లూయెంట్‌కు చెందిన నేహా నార్ఖేడ్ (రూ. 13,380 కోట్లు)తో 8వ స్థానంలో.. డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్‌కు చెందిన వందనా లాల్ (రూ. 6,810 కోట్లు)తో 9వ స్థానంలో.., హీరో ఫిన్‌కార్ప్ యొక్క రేణు ముంజాల్ 620 కోట్లుతో 10వ స్థానంలో టాప్ 10 లో నిలిచారు.
100 మంది మహిళల జాబితాలో కేవలం భారతీయ మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ 100 మంది మహిళల సంచిత సంపద ఒక సంవత్సరంలో 53 శాతం పెరిగి 2020లో రూ. 2.72 లక్షల కోట్ల నుండి 2021లో రూ. 4.16 లక్షల కోట్లకు చేరుకుంది మరియు. వీరందరి సంపాదన ఇప్పుడు భారతదేశ జిడిపిలో 2 శాతాన్ని ఆక్రమించడం విశేషం.
టాప్ 100లో చేరడానికి మహిళా వ్యాపారవేత్తల సంపద కటాఫ్ అంతకుముందు రూ. 100 కోట్ల ఉండగా.. ఈసారి రూ. 300 కోట్లకు పెంచారు. టాప్ 10 కటాఫ్ రూ. 6,620 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 10 శాతం అధికం కావడం విశేషం.
ఈ 100 మంది జాబితాలో అత్యధికంగా ఢిల్లీ నుంచి 25 మంది, ముంబయి (21), హైదరాబాద్ (12 మంది) ఉన్నారు. రంగాల వారీగా చూస్తే.. భారతదేశంలోని టాప్ 100 మంది సంపన్న మహిళల్లో ఫార్మాస్యూటికల్స్ రంగంలో 12 మందితో ఉండడం విశేషం. ఆరోగ్య సంరక్షణలో 11 మంది.. కన్స్యూమర్ గూడ్స్ తొమ్మిది మంది మహిళలు ఉన్నారు.
అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ కంపెనీకి చెందిన నలుగురు ఈ జాబితాలో ఉన్నారు. ఒకే కంపెనీ ద్వారా అత్యధిక మంది మహిళలున్న సంస్థగా అపోలో నిలిచింది. దాని తర్వాత మెట్రో షూస్, దేవీ సీ ఫుడ్స్‌లు ఒక్కొక్కటి రెండు స్థానాలు దక్కించుకున్నాయి.
భోపాల్‌కు చెందిన జెట్‌సెట్‌గోకు చెందిన కనికా టేక్రివాల్ (33 సంవత్సరాలు) రూ.420 కోట్లతో జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలుగా నిలిచింది..
ఈ జాబితాలో సగటు వయస్సు 53 నుంచి 55 ఏళ్లకు పెరిగింది. దాదాపు 25 మంది కొత్త ముఖాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2021 జాబితాలోని మహిళల సగటు సంపద దాదాపు రూ.4,170 కోట్లు కాగా. గత ఎడిషన్‌లో 2,725 కోట్లు ఉంది.
అలాగే, 25 మంది మహిళా వ్యాపారవేత్తలు ఉన్న ఢిల్లీ నగరం ఈ జాబితాలో ముంబైని అధిగమించింది. ఈ జాబితాలో ముగ్గురు ప్రొఫెషనల్ మేనేజర్లు కూడా ఉన్నారు. పెప్సికోతో రూ. 5,040 కోట్ల సంపద కలిగి ఉన్న ఇంద్రా నూయి, హెచ్.డీఎఫ్.సీకి చెందిన రేణు సుద్ కర్నాడ్ రూ. 870 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన శాంతి ఏకాంబరం రూ. 320కోట్లతో జాబితాలో చోటు సంపాదించారు.