Road Marriage In Kerala :మనుషుల పెళ్లి చూశాం.. చెట్ల పెళ్లి చూశాం.. కుక్కల పెళ్లి చూశాం.. కానీ ఇక్కడ రోడ్డుకు పెళ్లి చేశారు. అతిథులను ఆహ్వానించారు. కావాల్సి వారికి స్నాక్స్ అందించారు. బిర్యాని పెట్టి కడుపు నింపారు.. మనుషుల వివాహ వేడుకలో ఏం చేస్తారో అన్నీ చేశారు. కానీ ఇక్కడ వధూవరులు కనిపించరు. రోడ్డు మాత్రమే కనిపిస్తుంది. ఇలా రోడ్డుకు పెళ్లి చేయడమేంటి? ఇలా చేయడం వారు ఎప్పటి నుంచి ప్రారంభించుకున్నారు? రోడ్డుకు పెళ్లి చేసి ఏం చేశారు? అనే వివరాల్లోకి వెళితే..
కేరళలోని కొడియత్తూరు గ్రామం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఇక్కడ గ్రామస్థులంతా కలిసి రోడ్డుకు పెళ్లి చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే వీరు రోడ్డుకు పెళ్లి చేయడానికి ఒక పెద్ద కారణమే ఉంది. రోడ్డును విస్తరించడానికి అవసరమైన నిధుల సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమమానికి అతిథులను ఆహ్వానించి వారి నుంచి విరాళాలు సేకరించారు. ఈ నిధుల మొత్తాన్ని రోడ్డు నిర్మాణానికి ఉపయోగించనున్నారు.
ఈ గ్రామంలో 1980లో 1200 మీటర్ల పోడవు, 3.5 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా పెరిగింది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో గ్రామస్తులంతా కలిసి రోడ్డు నిర్మాణం చేయాలని అనుకున్నారు. ఇందు కోసం రోడ్డు నిర్మాణ ఖర్చులు, విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం అంతా కలిపి రూ.60 లక్షలు అవుతుందని అంచనా వేశారు. ముందుగా గ్రామస్థుల్లో 15 మంది లక్ష చొప్పున వసూలు చేశారు. మిగతా మొత్తాన్ని ఇలా రోడ్డుకు పెళ్లి చేసి విరాళాలు సేకరించాలని నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుకు పెళ్లి చేయడం ద్వారా వారికి రూ.10.4 లక్షలు సమకూరాయి.
కేరళలో ‘పనం పయట్టు’ అనే సాంప్రదాయం ఉంది. ఏదైనా ఒక పని కోసం నిధులు కావాలంటే ‘పనం పయట్టు’ను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో విదు భోజనాలు పెడుతారు. వచ్చిన వారికి రిటర్న్ గిప్ట్ ఇస్తారు. అయితే అతిథుల నుంచి విరాళాలు ఆశిస్తారు. 90వ దశకంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రాను రాను రుణాలు, తదితర మార్గాల ద్వారా నిధులు వస్తున్నాయి. దీంతో పనం పయట్టు అనే కార్యక్రమం మరుగున పడింది. ఇటీవల కొడియత్తూరు గ్రామంలో మరోసారి నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.