Rishi Sunak : భారత దేశంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే. అందుకే మన దేశంలో రాజకీయా పార్టీలు ఎక్కువే. అగ్ర రాజ్యంలో మూడు నాలుగు పార్టీ మధ్యనే అధికారం చేతులు మారుతుంది. కానీ మన దేశంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు వేరు. దీంతో 76 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే పాలించింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన వారసులు కూడా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా.. రాజకీయాల్లోకి వచ్చేవారు.. వచ్చినా తలపడి నిలబడి.. ఎగిదేవారు చాలా తక్కువ. అయితే భారత రాజకీయాలు ఇలా ఉంటే.. విదేశాల్లో మాత్రం మన భారతీయులు అక్కడి రాజకీయాల్లో తమదైన శైలిలో రాణిస్తున్నారు. విదేశీయులు మెచ్చేలా రాజMీ యం చేస్తున్నారు. ప్రజల మద్దతుతో కీలక పదవులకు ఎన్నికవుతున్నారు.

200 ఏళ్లు బ్రిటిష్ పాలనలో..
ఏంతో చారిత్రక నేపథ్యం ఉన్న భారత దేశం.. రాచరిక పాలన అంతమయ్యాక.. 200 ఏళ్లు ఆంగ్లేయుల పాలనలో ఉంది. సుదీర్ఘ పోరాటం ఫలితంగా మన దేశానికి 76 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం లభించింది. సర్వస్వతంత్ర, గణతంత్ర రాజ్యంగా ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య పాలన అమలులోకి వచ్చింది. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు తదితర దిగ్గజాలు విశ్వ నేతలుగా పేరు తెచ్చుకున్నారు.
విదేశాలకు మనోళ్ల వలస..
బ్రిటిష్ పాలనలో, ఆ తర్వాత వృత్తి, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం.. ఎంతోమంది భారతీయులు ప్రపంచం నలుమూలలకూ వలస వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. అక్కడి చట్టసభలకు ఎన్నికై కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 200 ఏళ్లు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి 76 ఏళ్ల తర్వాత భారతీయ వ్యక్తి రిషి సునక్ ప్రధాని అయ్యాడు. ఈ నేపథ్యంలో విదేశీయులు మెచ్చిన మన నేతల గురించి తెలుసుకుందాం.
గోవా ‘చిన్నా’.. పోర్చుగల్ ప్రధాని..
పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంతోనియో కోస్తా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. న్యాయశాస్త్రం మీద మక్కువతో లా చదువుకున్నారు. ప్రధాని కాక మునుపు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తన పనితీరుతో అక్కడి సోషలిస్టు పార్టీలో మంచిపేరు తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించారు. కోస్తా తండ్రి గోవాకు చెందినవారు. తనను గోవాలో ముద్దుగా ‘బాబుష్’ (కొంకణి భాషలో ‘చిన్నా’ లాంటి ముద్దుపేరు) అని పిలిచేవారనీ, ఇప్పటికీ భారత్‌లోని మడ్‌గావ్‌లో తమకు బంధువులు ఉన్నారనీ చెబుతుంటారు ఆంతోనియో. పోర్చుగల్ ప్రధాని అయినా ప్రవాస భారతీయుడి హోదాను వదులుకోలేదు. 2017లో ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా భారత్‌కు వచ్చారు. తన తండ్రి నివసించిన ఇంటిని సందర్శించడంతోపాటు, బంధువులను కలిశారు. ఆ పర్యటనలో భాగంగా తండ్రి రాసిన రెండు పుస్తకాల ఇంగ్లిష్ అనువాదాలను ఆవిష్కరించారు.
గంగమ్మ భక్తుడు.. మారిషస్ అధినేత
భారత్‌తో తీరప్రాంత సరిహద్దు సంబంధాలు ఉన్న ద్వీపం దేశం మారిషస్. ఈ దేశ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపన్. ఈయన లాంకషైర్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి.. మంత్రి పదవిని చేపట్టారు. ఆ సమయంలో పేదరికాన్ని రూపు మాపేందుకు వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు. పృథ్వీరాజ్ పనితీరుకు బహుమతిగా దక్కిందే నేటి అధ్యక్ష పీఠం. నిజానికి మారిషస్‌లో 70 శాతం మంది భారత మూలాలున్న ప్రజలే. అందుకే ‘భారత్ మారిషస్ మధ్య ఉన్నది రాజకీయాలకు అతీతమైన భావోద్వేగ బంధం’ అంటారు పృథ్వీరాజ్. ఈయన పూర్వీకులు బిహార్, మహారాష్ట్ర, గుజరాత్ తదితర ప్రాంతాల్లో ఉండేవారు. ఇప్పటికీ ఆయన గంగను పూజిస్తారు. దీపావళి, మహాశివరాత్రి, వినాయక చవితి మొదలైన పండుగలను జరుపుకుంటారు. మారిషస్‌లో ఇప్పటికీ హిందీ, తమిళం, తెలుగు భాషలను మూడో భాష కింద బోధిస్తున్నారు. వందల ఏళ్ల క్రితం ఉపాధి కోసం పృథ్వీరాజ్‌సింగ్ పూర్వీకులు మారిషస్‌కు వలస వెళ్లారు. అయినా భారతీయ మూలాలను మాత్రం మర్చిపోలేదు మారిషస్ అధ్యక్షుడు.
మారిషస్ ప్రధాని భారతీయుడే..
మారిషస్ అధ్యక్షుడే కాదు, ప్రధానమంత్రి కూడా భారత సంతతికి చెందినవారే. ఆ ద్వీప దేశానికి ప్రవింద్ కుమార్ జగన్నాథ్ ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఈయన తండ్రి అనిరుధ్ జగన్నాథ్ ఆ దేశ ప్రధానిగా, అధ్యక్షుడిగా సేవలు అందించారు. వీరి పూర్వీకులు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం బలియా జిల్లా రస్‌డా ప్రాంతానికి చెందినవారు. దీంతో 2017లో ప్రవింద్ ప్రధాని అయ్యారనే వార్తతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాన్ని పుణికిపుచ్చుకున్నా మారిషస్ రాజకీయాల్లో బలమైన ముద్రవేశారు ప్రవింద్. చెరకు తోటలు, పంచదార పరిశ్రమలకు సంబంధించిన సంస్కరణలు, వ్యవసాయంలో హైడ్రోపోనిక్స్ లాంటి అధునాతన సాంకేతిక వినియోగం, సాధారణ వస్తువుల మీద పన్నుల తగ్గింపు, నిత్యావసరాల సబ్సిడీ పెంపులాంటి చర్యలు ప్రవింద్‌ను ప్రజల మనిషిని చేశాయి.
సురినామ్ అధ్యక్షుడు.. సంస్కృత అభిమాని
దక్షిణ అమెరికా దేశం సురినామ్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన చంద్రికాప్రసాద్ సంతోఖీ.. చాన్ సంతోఖీగా సుప్రసిద్ధులు. నెదర్లాండ్స్‌లో చదువుకున్న చాన్.. సురినామ్‌కు తిరిగి వచ్చాక పోలీస్ సర్వీసులో చేరారు. ఆ తర్వాత క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి పొందారు. అప్పట్లో దేశాధ్యక్షుడి హోదాలో నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్న డెసీ బౌటర్స్‌ను వివిధ కేసుల్లో దోషిగా నిర్ధారించి జైలుకు పంపించారు. ఆ తర్వాత దేశాధ్యక్ష రేసులో తనకు ఎదురు నిలిచేవాళ్లు కూడా లేకపోవడంతో ఎన్నిక ఏకపక్షమైంది. చాన్ తాతలు భారత్‌లోని ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందినవారు. చాన్ సురినామ్‌లోనే పుట్టి పెరిగినా ఇక్కడి హిందూ మూలాలను మాత్రం మరచిపోలేదు. దేశాధ్యక్షుడిగా సంస్కృతంలో ప్రమాణం చేశారు. ఆ సమయంలో వేద గ్రంథాలను చేతిలో పట్టుకున్నారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా నిలిచింది.
అమెరికా ఉపాధ్యక్షురాలుగా చెన్నై చిన్నది
ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా. అక్కడి రాజకీయాల్లో చెరగని ముద్రవేసి, ఆ దేశానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాదేవి హ్యారిస్ మనందరికీ సుపరిచితురాలే. లాయర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఆ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ తర్వాత డెమొక్రటిక్ పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలి స్థానంలో నిలిచి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారారు. కమల తండ్రి డొనాల్డ్ హ్యారిస్ ఆఫ్రికన్. ఆయన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. తమిళనాడుకు చెందిన కమల తల్లి శ్యామలా గోపాలన్ శాస్త్రవేత్త. రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి వివిధ పరిశోధనలు జరిపారు. పీహెచ్‌డీ పట్టా కూడా పొందారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో కమల తల్లి దగ్గరే పెరిగారు. అమెరికాలో ఉన్నా గుళ్లూ, గోపురాలకు తిరిగేవారు. మందిరానికి వెళ్లినప్పుడు పాటలు కూడా పాడేదాన్నని ఒక సందర్భంలో పేర్కొన్నారు. చిన్నతనంలో కమల తరచూ మద్రాసు వస్తూ ఉండేవారట. కమల తాత పీవీ.గోపాల¯Œ సివిల్ సర్వెంట్. ప్రజాస్వామ్యం, స్త్రీల హక్కులు తదితర అంశాల మీద ఆయన అభిప్రాయాల ప్రభావం తన మీద ఎంతగానో ఉందంటారు కమల.
కూలీగా వలస వెళ్లి.. అధినేత అయ్యాడు
దక్షిణ అమెరికా దేశం గయానా. కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానాగా పిలుస్తున్న ఈ దేశానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత అయిన ఇర్ఫాన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందు నీటి పారుదల, వాణిజ్య, పర్యాటక శాఖలకు మంత్రిగా పనిచేశారు. గయానాలోని చెరకు తోటల్లో పనిచేయడానికి దాదాపు వందేళ్ల క్రితం భారత్ నుంచి కూలీలను రవాణా చేశారు బ్రిటిష్‌వారు. అలా వలస వెళ్లిన భారత కుటుంబానికి చెందిన నాలుగో తరం వ్యక్తి ఇర్ఫాన్ అలీ. ఈయన ఢిల్లీ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ప్రస్తుతం గయానా మొత్తం జనాభాలో దాదాపు సగానికి పైగా భారతీయ మూలాలు ఉన్నవారే.
ఉపాధ్యక్షుడూ భారతీయుడే..
గయానా ఉపాధ్యక్ష పదవినీ భారత మూలాలున్న వ్యక్తే చేపట్టారు. ఆ దేశంలో అమిత ప్రజాభిమానాన్ని చూరగొన్న ఈ నాయకుడి పేరు భరత్ జగ్‌దేవ్. రెండేళ్లగా ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. అంతకుముందు ఆ దేశానికి పదేళ్లకుపైగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. కేవలం 35 సంవత్సరాల వయసులోనే దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పారు. ఈయన సారథ్యంలో వరుసగా ఐదేళ్లు దేశ ఆర్థిక రంగం ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. భరత్ జగ్‌దేవ్ తాత రామ్ జియావన్ 1912లో కూలీగా గయానాకు వలస వెళ్లారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీ జిల్లాలో ఉండే తన తాతల ఊరిని తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సందర్శించారు భరత్.
ఆఫ్రికా దేశానికీ అధ్యక్షుడు..
తూర్పు ఆఫ్రికాలోని దేశం సీషెల్స్ ఐదో అధ్యక్షుడు వేవెల్ రామ్‌కలావన్. ఈయన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తే. మొదట అక్కడి చర్చిలకు పాస్టర్‌గా వ్యవహరించారు. అలా కొనసాగుతూనే అక్కడి ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా మూడు దశాబ్దాలు పోరాడారు. చివరికి తన ఆలోచనలను ప్రజలకు పంచి వారి హృదయాలను గెలిచారు. దేశాధ్యక్షుడిగా నిలిచారు. రామ్‌కలావన్ తాత బిహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లా పర్సౌనీ గ్రామానికి చెందినవారు. అందుకే ఈయన అధ్యక్షుడు అయినప్పుడు భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ ‘సన్ ఆఫ్ ఇండియా’గా అభివర్ణించారు. భారత సంతతి వ్యక్తి సీషెల్స్ దేశానికి అధ్యక్షుడు కావడం వాళ్ల పూర్వికుల గ్రామానికే కాదు మొత్తం భారత్‌కే సంతోషకరం అన్నారు. రామ్‌కలవాన్ భారత్ వచ్చినప్పుడు తన స్వగ్రామాన్ని దర్శించారు.
వాచ్‌మెన్ కూతురు.. సింగపూర్ ప్రెసిడెంట్
హలీమా యాకోబ్ ప్రస్తుతం సింగపూర్ అధ్యక్షురాలు. పోరాటానికి ఈమె నిలువెత్తు రూపం. పడిలేచిన కెరటం అనేమాటకు సరైన ఉదాహరణ. నిరుపేద వలస కుటుంబంలో పుట్టిన ఆమె సింగపూర్ అధ్యక్ష పదవిని అధిరోహించారు. హలీమా తండ్రి భారత్ నుంచి సింగపూర్ వెళ్లి అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేసేవారు. ఆమెకు ఎనిమిదేళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయారు. అప్పటికి హలీమాకు తనకన్నా చిన్నవారైన నలుగురు తోబుట్టువులు ఉన్నారు. కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం కాలేజీ దగ్గర ఆహారం అమ్మడంలో అమ్మకు సాయపడేవారు. అలా కష్టపడుతూనే లా చదివారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎంపీగా ఎన్నికై యువజన మంత్రిగా, సాంఘిక, కుటుంబ వ్యవహారాల మంత్రిగా విభిన్న పదవుల్లో పనిచేశారు. ఆ తర్వాత సింగపూర్ దేశానికి మొదటి ‘మేడమ్ స్పీకర్’ అయ్యారు. అలా పని చేస్తున్నప్పుడే రెండు సందర్భాల్లో తన ప్రసంగంలో భాగంగా ఒక మంత్రి ‘మేడమ్ ప్రెసిడెంట్’ అని సంబోధించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అధికార పక్షం తమ అధ్యక్ష అభ్యర్థిగా హలీమా పేరును ప్రస్తావించడం, ఆమె సింగపూర్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలు కావడం చకచకా జరిగిపోయాయి.
ముంబయి వాసి.. ఐర్లాండ్ ప్రధాని..
లియో వరాడ్కర్ ఐర్లాండ్ దేశానికి ప్రధాని అయిన అతి చిన్న వయస్కుడు. ఈయన కూడా భారత సంతతి నేత. లియో తండ్రి అశోక్ వరాడ్కర్ ముంబయికి చెందినవారు. డాక్టర్ అయిన ఈయన 1960లో భారత్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) వలస వెళ్లారు. ఆ తర్వాత ఐర్లాండ్ దేశానికి మారిపోయారు. అక్కడే నర్సుగా పనిచేస్తున్న ఐర్లాండ్ జాతీయురాలైన మరియను పెళ్లి చేసుకున్నారు. వారికి లియో మూడో సంతానం. లియో తొలుత న్యాయశాస్త్రం చదవాలనుకున్నారు. కొంత అవగాహన వచ్చాక మెడిసిన్‌వైపు మళ్లారు. ముంబయిలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకుని కొంతకాలం డాక్టర్‌గా పనిచేశారు. అయితే విద్యార్థి దశ నుంచే లియోకి రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ. అక్కడి ప్రఖ్యాత ఫైన్‌గేల్ పార్టీ కోసం తొలినుంచీ పనిచేశారు. 20 ఏళ్ల వయసులోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాతి ఎన్నికల్లో గెలిచి రవాణా, పర్యాటకం, ఆరోగ్యం తదితర శాఖలకు మంత్రిగా పనిచేశారు. జనంతోపాటు పార్టీ సభ్యులకూ లియో పనితీరు నచ్చడంతో 38 ఏళ్ల వయసులోనే ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2020 దాకా ఆ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ఐర్లాండ్ ఉప ప్రధానిగా కొనసాగుతున్నారు.
కెనడా రక్షణ మంత్రి ఇండియనే..
కెనడా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో రక్షణ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి కీలక శాఖకు సెంట్రల్ మినిస్టర్‌గా ఎంపికై తన మార్కు పనితీరును చూపిస్తున్నారు భారత మూలాలు ఉన్న అనితా ఆనంద్. అనిత తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయులే. తండ్రి ఎస్‌వీ.ఆనంద్ సొంత రాష్ట్రం తమిళనాడు. కెనడాలో జనరల్ సర్జన్‌గా సేవలు అందించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమె తల్లి సరోజ్ అనస్తీషియా డాక్టర్. చదువంటే ఇష్టపడే అనిత ఆక్స్‌ఫర్డ్ సహా నాలుగు యూనివర్సిటీల నుంచి పొలిటికల్ సైన్స్, లా తదితర అంశాల్లో డిగ్రీలు పూర్తిచేశారు. తర్వాత ప్రొఫెసర్‌గా పనిచేశారు. లాయర్‌గానూ సేవలందించారు. ఆర్థిక విపణి నియంత్రణ, కార్పొరేట్ గవర్నెన్స్, షేర్ హోల్డర్ల హక్కులు తదితర అంశాలపై పరిశోధనలు చేశారు. ఆయా అంశాలకు సంబంధించిన నిపుణుల కమిటీలో సభ్యురాలిగా ఉండి ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి పౌరసేవల శాఖకు మంత్రిగా పనిచేశారు. కొవిడ్ సమయంలో ఆమె స్పందించిన తీరు ప్రజల్ని ఆకట్టుకుంది. అందరికీ వ్యాక్సిన్లు అందించేందుకు ఆమె అలుపెరగని పోరాటం చేశారు. కెనడాకు సరిపడా టీకాలు తీసుకువచ్చేందుకు ఆమె తన భారతీయ మూలాలను ఉపయోగించుకున్నారు. అప్పట్లో భారత్‌తో ఆమె జరిపిన దౌత్యం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత జరిగిన వివిధ పరిణామాలు ఆమెను అక్కడి అత్యంత కీలక పదవి అయిన రక్షణ మంత్రిగా నిలబెట్టాయి. అనిత భారత్‌తో కలిసి టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అనిత తాత వెల్లోర్ అన్నస్వామి సుందరం మహాత్మాగాంధీ సారథ్యంలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. గాంధీ, మదన్‌మోహన్ మాలవీయ తదితరులతో కలిసి బెనారస్ హిందూ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారు. అందుకే అనితకు భారత్ అంటే అమితమైన ప్రేమ.
బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్..
సూర్యుడు అస్తమించని దేశంగా ప్రసిద్ధిగాంచిన బ్రిటన్.. భారత దేశాన్ని 200 ఏళ్లు పాలించింది. అనేక శాంతియుత పోరాటాల తర్వాత 76 ఏళ్ల క్రితం మనకు ఆంగ్లేయులు స్వాతంత్రం ఇచ్చారు. మనను పాలించిన సామ్రాజ్యానికి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రిషి సునక్ ప్రధాని అయ్యారు. రిషి రిషి తల్లిదండ్రులు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. వీరు మొదట కెన్యాకు వలస వెళ్లారు. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లి స్థిరపడ్డారు. రిషి తండ్రి యశ్‌వీర్ బ్రిటన్‌లో వైద్యుడిగా పనిచేశారు. తల్లి ఉష మందుల షాపు నడిపేవారు. అక్కడే పుట్టిన రిషి.. యూకేలోనే చదువుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేశానని ఒక ఇంటర్యూలో చెప్పుకొన్నారు రిషి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్‌లో డిగ్రీ చేశారు. తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. చదువులో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే స్కాలర్‌షిప్ కూడా పొందారు. 2001లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్‌లో విశ్లేషకుడిగా పనిచేశారు. తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. అప్పటి నుంచి బ్రిటన్ ప్రభుత్వంలో పలు హోదాల్లో పనిచేశారు. ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్ సభలో భగవద్గీత మీద ప్రమాణం చేసి వార్తల్లో నిలిచారు. మొదటి నుంచీ బ్రిటన్ రాజకీయాల్లో కీలకవ్యక్తిగా ఉన్న రిషి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కుడిభుజంగా వ్యవహరించారు. జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంలో సెప్టెంబరులో జరిగిన ఎన్నిక కోసం కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. లిజ్ ట్రస్ స్వల్ప మెజారిటీలో ప్రధాని పదవి దక్కించుకున్నారు. కానీ కేవలం 45 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చడంలో విఫలమయ్యానని స్వయంగా తప్పుకున్నారు లిజ్ ట్రస్. దీంతో భారత సంతతికి చెందిన రిషి సునక్ తొలి బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ మూలాల నేతలు..
ఇలా అధ్యక్ష పదవుల్లోనే కాదు అమాత్యులుగానూ మనవాళ్లు అద్వితీయ ప్రతిభ చూపుతున్నారు. సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి బాలకృష్ణన్, అక్కడి హోం మినిస్టర్ షణ్ముగం, రవాణా శాఖామాత్యులు ఈశ్వరన్‌లాంటి వాళ్లే కాదు యూకే హోం మంత్రి ప్రీతి పటేల్, దక్షిణాఫ్రికా పరిశ్రమలు, వాణిజ్య శాఖామాత్యులు ఇబ్రహీం పటేల్ ఇలా ప్రపంచంలోని విభిన్న దేశాల్లో భారత మూలాలు ఉన్న మంత్రులూ, దాదాపు అదే హోదాలో ఉన్న ఆఫీసర్లూ వందల సంఖ్యలో ఉన్నారు. ఏదేశ చరిత్ర చూసినా పరపీడన పరాయణత్వమే కనిపిస్తుంది. కానీ పాతకాలాన్ని చరిత్ర పుస్తకాలకే పరిమితం చేస్తూ.. సరికొత్త అధ్యాయాల్ని సువర్ణాక్షరాలతో లిఖిస్తున్నారు భరతమాత ముద్దుబిడ్డలు. మన దేశాన్ని విడిచి పరాయిగడ్డ మీద కాలుమోపిన వీళ్లంతా తరువాతి తరాలను భారతజాతి సమైక్యత అంత దృఢంగా తీర్చిదిద్దారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా భారతమాత గొప్పదనాన్ని గొంతెత్తి చాటుతున్నారు.