https://oktelugu.com/

Rinku Singh: లాస్ట్‌ బాల్‌ సిక్స్‌ కొట్టి ఇండియాను గెలిపించిన రింకూసింగ్‌.. కానీ ఆ సిక్స్‌ లెక్కలోకిరాలేదు.. కారణం ఇదే!

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ గురువారం విశాఖపట్నంలోని డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఉత్కంఠభరిత విజయం సాధించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 24, 2023 / 11:30 AM IST

    Rinku Singh

    Follow us on

    Rinku Singh: వన్డే వరల్డ్‌ కప్‌లో ఘోర ఓటమి తర్వాత భారత్‌కు ఊరటనిచ్చే విజయం లభించింది. ఫైనల్‌లో తలపడిన ఆస్ట్రేలియాపైనే టీ20 మ్యాచ్‌లో భారత్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ కొట్టింది. ఓడించిన జట్టుపైనే గెలవడం భారత క్రికెటర్లకు మంచి కిక్‌ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో లాస్ట్‌బాల్‌కు కొట్టిన సిక్స్‌ అభిమానులను థ్రిల్‌ చేసింది. కానీ, ఆ సిక్స్‌ లెక్కలోకి రాకపోవడమే నిరాశపర్చింది. కానీ విజయం మన సొంతం కావడంతో ఆనందం నింపింది.

    విశాఖ వేదికగా మొదలైన టీ20 సిరీస్‌..
    భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ గురువారం విశాఖపట్నంలోని డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఉత్కంఠభరిత విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని మరొక బంతి మిగిలి ఉండగానే భారత్‌ గెలిచింది. సీన్‌ అబ్బాట్‌ వేసిన చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమవ్వగా అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్‌ సింగ్‌లు వరుసగా ఔటవ్వడం ఉత్కంఠను రేపింది. భారత్‌ గెలుపుపై సందేహాలు వ్యక్తమయ్యాయి.

    రింకూ మ్యాజిక్‌..
    అయితే చివరి బంతి వరకు క్రీజ్‌లో ఉన్న రింకూసింగ్‌.. లాస్ట్‌ బాల్‌కు మ్యాజిక్‌ చేశాడు. 1 పరుగు అవసరమవ్వగా భారీ సిక్సర్‌ కొట్టి టీమిండియాకి విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో అభిమానుల అరుపులు, కేకలతో విశాఖపట్నం స్టేడియం మోతెక్కిపోయింది. అయితే టీమిండియాని గెలిపించిన రింకూ చివరి సిక్సర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. సిక్సర్‌ కొట్టిన బంతి ‘నో బాల్‌’గా అంపైర్లు నిర్ధారించారు. కావాల్సిన ఒక్క పరుగు నో బాల్‌ రూపంలో రావడంతో భారత్‌ విజయం సాధించింది. దీంతో రింకూ కొట్టిన సిక్సర్‌ను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. నో బాల్‌ కారణంగా రింకూ కష్టపడి కొట్టిన భారీ సిక్సర్‌ లెక్కలోకి రాకుండా పోయింది.

    కావాలనే వేశాడా..?
    ఇది చూసిన ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆబాట్‌ కావాలనే నోబాల్‌ వేశాడా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రింకూ భారీ షాట్‌ ఆడేస్తాడని తెలిసి ఆబాట్‌ ఇలా చేశాడా? అంటున్నారు. అయితే రింకూ కనుక ఆ షాట్‌ మిస్‌ అయితే మ్యాచ్‌ డ్రా అయ్యేది. కాబట్టి ఆబాట్‌ అలా చేయాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీసులో రింకూ సింగ్‌.. భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. తను ఆడిన తొలి మ్యాచులోనే 21 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచులో 15 బంతుల్లోనే 37 పరుగులతో రాణించాడు. ఇలా పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా తరఫున ఫినిషర్‌గా మారుతున్నాడీ కుర్ర ప్లేయర్‌.

    ఐపీఎల్‌లో అద్భుతం..
    ఈ ఏడాది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఐపీఎల్‌లో చెలరేగిన రింకూ సింగ్‌.. కొన్ని అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడాడు. దీంతో అతనికి టీమిండియా పిలుపు దక్కింది. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న అతను.. భారత్‌ తరఫున మ్యాచులను అద్భుతంగా ఫినిష్‌ చేస్తూ దూసుకెళ్తున్నాడు.

    2 వికెట్ల తేడాతో విజయం..
    ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జోస్‌ ఇంగ్లిష్‌ 110 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేసింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. అయితే చివరి ఓవర్‌లో హైడ్రామా నడిచింది. అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, అర్‌‡్షదీప్‌ సింగ్‌ వరుసగా ఔటవ్వడం నాటకీయంగా మారింది. అయితే క్రీజులో రింకూ ఉండడంతో భారత్‌ విజయం సాధించింది. 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్‌ హాఫ్‌ సెంచరీలతో రాణించి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ భారత్‌ 1–0తో ఆధిక్యంలో ఉంది. 42 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డ్‌ దక్కింది.