America : బియ్యం కోసం అమెరికాలో ప్రవాసుల హాహాకారాలు

అమెరికాలోని డల్లాస్ లో పది కిలోల సోనా మసూరి బియ్యం 20 పౌండ్లకు పెరిగింది. ఒక కుటుంబానికి ఒక సంచి బియ్యాన్ని మాత్రమే విక్రయిస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 22, 2023 12:44 pm
Follow us on

America : అగ్రరాజ్యంలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులకు ఇష్టమైన ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడింది. బియ్యం దొరకక అవస్థలు పడుతున్నారు. షాపుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటుచేశారు. దీంతో అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల కుటుంబాల్లో వృద్ధులు, చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్నారు. రొట్టెలు, జంక్ ఫుడ్స్ తో కడుపు నింపుకుంటున్నారు. అయితే ఇంతటి దుర్భిక్షానికి ఇండియాయే  కారణం కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు నిలిపివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా బియ్యం కొరత ఏర్పడింది. ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.

పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బాస్మతి బియ్యం తప్ప మిగతా బియ్యం సరఫరా నిలిపివేసింది. దేశీయ మార్కెట్ లో తగినంత తెల్ల బియ్యం లభ్యత లేకపోవడం, ధరల స్థిరీకరణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రభావం ప్రపంచం యావత్ పై పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్న బియ్యంలో భారత్ దే సింహభాగం. చైనా తరువాత మనదే అగ్రస్థానం. మన దేశం నుంచి 40 శాతం ఎగుమతులు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఉన్నపళంగా బియ్యం సరఫరా నిలిచిపోవడంతో విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులకు అకాల కష్టం మొదలైంది.

అమెరికాకు ఎక్కువగా భారత్ నుంచే బియ్యం సరఫరా అవుతోంది. నాలుగు వాటాల్లో ఒక వాటా కంటే అధికం మన దేశం నుంచే జరుగుతోంది. ప్రధానంగా బాస్మతి బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తోంది. భారత్ నుంచి బియ్యం సరఫరాను నిలిపివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అమెరికాలోని డల్లాస్ లో పది కిలోల సోనా మసూరి బియ్యం 20 పౌండ్లకు పెరిగింది. ఒక కుటుంబానికి ఒక సంచి బియ్యాన్ని మాత్రమే విక్రయిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బియ్యాన్ని ఎక్కువగా వినియోగిస్తున్న అఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలపై విపరీతమైన ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.