HomeతెలంగాణRevanth Reddy: ఏడాది ప్రస్థానం: కాంగ్రెస్ ను ఏకం చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఏడాదిలో...

Revanth Reddy: ఏడాది ప్రస్థానం: కాంగ్రెస్ ను ఏకం చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఏడాదిలో ఏం చేశాడు?

Revanth Reddy: ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. పడితే పెద్ద పదవినే పట్టాలి. ఒక సాధారణ మండల నాయకుడిగా టీఆర్ఎస్ లో మొదలైన రేవంత్ రెడ్డి ప్రస్థానం.. ఆ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో టీడీపీలోకి మారేలా చేసింది. ఆ తర్వాత చంద్రబాబుకు సన్నిహితుడిగా ఆయన మదిని దోచి.. ఆయనకు నమ్మినబంటుగా పార్టీలో ఎదిగేవరకూ వెళ్లింది. ఒకనాక దశలో టీడీపీ తెలంగాణ బాధ్యతలు రేవంత్ రెడ్డికి వచ్చాయి. అనంతరం తెలుగుదేశం తెలంగాణలో అంతర్థానంతో రేవంత్ రెడ్డి పార్టీ మారాల్సి వచ్చింది. తనకు బద్ధ శత్రువైన కేసీఆర్ ను వ్యతిరేకించే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో చేరారు. అందులో అధిష్టానం అభిమానం చూరగొని ఏకంగా పీసీసీ చీఫ్ అయ్యారు. కాలం కలిసి వస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి ‘సీఎం’గా కూడా కావచ్చు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతోంది. ఈ సంవత్సరంలో ఆయన ఎలా నడుచుకున్నారు..? ఎలాంటి వివాదాలు ఎదుర్కొన్నారన్న దానిపై స్పెషల్ ఫోకస్..

Revanth Reddy
Revanth Reddy

ప్రత్యేక రాష్ట్రం తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దీనావస్థకు చేరింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన హస్తం ఇక తెలంగాణలో కనుమరుగవుతుందా..? అని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందారు. కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతో కొంతమందిని ప్రజలు గెలిపించారు. కానీ వారు ‘హ్యాండిచ్చి’ టీఆర్ఎస్ లో చేరడంతో పార్టీలో ముఖ్య నాయకులు లేకుండా పోయారు. ఈ తరుణంలో ఉన్నవాళ్లు సైతం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. అప్పటి వరకు టీడీపీలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఇక ఆ పార్టీలో మనుగడ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా ఓడి.. ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ కండువాపై గెలిచారు. మొదట్లో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేరికపై చాలా మంది వ్యతిరేకించారు. కానీ ఆయన దూకుడుకు అధిష్టానం ఫిదా అయింది. దీంతోనే పార్టీ రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది.

కాంగ్రెస్ కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో రేవంత్ రెడ్డిని అధిష్టానం 2021 జూన్ 26న టీపీసీసీ చీఫ్ గా ప్రకటించింది. అయితే మంచి రోజు చూసుకున్న ఆయన జూలై 7న (నేటికి సరిగ్గా ఏడాదికి) బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే దూకుడు స్వభావమున్న రేవంత్ టీపీసీసీ చీఫ్ గా మారిన తరువాత మరింత స్పీడ్ పెంచారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దళిత, గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ప్రజల్లోకి వెళ్లారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ లో ‘గిరిజన దండోరా’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ తరువాత టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోనూ బహిరంగ సభ పెట్టి టీఆర్ఎస్ లో గుబులు పుట్టించారు. అప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్న కాంగ్రెస్ కేడర్లో ఈ సభలతో ఒక్కసారిగా ఊపు తెచ్చినట్లయింది.

Revanth Reddy
Revanth Reddy

ఇక అంతటితో ఆగకుండా.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను పలు రకాలుగా నిరసనల ద్వారా తెలిపారు. ప్రజలను ప్రభుత్వం ఎలా వంచిస్తుందో చూడండి అంటూ జిల్లాల వ్యాప్తంగా నిరసనలు చేయించారు. రైతులు దొడ్డు రకం ధాన్యం వేయవద్దని.. సన్నరకాలు సాగు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినప్పుడు… ఆయన ఫాం హౌస్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. అయితే పోలీసులు రేవంత్ ను మధ్యలోనే అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినా తన చాకచక్యంతో సీఎం కేసీఆర్ కు సంబంధించిన పంట సాగు ఫొటోలను చిత్రీకరించి బయటపెట్టాడు. కేసీఆర్ తెలంగాణ రైతులను వరి వేయవద్దని తాను వేసిన మోసాన్ని బయటపెట్టారు.

దుబ్బాకలో గెలిచి..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన బీజేపీ ఓ వైపు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి చేరుకుంది. అప్పటికీ రేవంత్ పీసీసీ చీఫ్ కాకున్నా.. ఆ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పోరాటాలు చేయించారు. ఇక కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ ను తెలంగాణకు రప్పించి వరంగల్ లో రైతు డిక్లరేషన్ సభను పెట్టించారు. ఆ తరువాత కూడా రచ్చబండ పేరుతో గ్రామాల్లో తిరుగుతూ నేతల చేత ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమాకం అయిన తరువాత టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ దాటేస్తుందా..? అనే స్థితికి తీసుకొచ్చాడు.

Also Read: TVS Ronin 2022: గంటకు 120 కి.మీ.ల వేగం..అడ్వాన్స్ ఫీచర్స్: మార్కెట్లోకి TVS రోనిన్..

అయితే రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ యూత్ లో ఫుల్ జోష్ పెరిగింది. కానీ సీనియర్లలో మాత్రం ఇప్పటికీ అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. ఆయన చేస్తున్న కొన్ని పనులు తమకు నచ్చడం లేదని కొందరు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆలస్యం చేశారని, అంతేకాకుండా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో సీనియర్ల మన్ననలు పొందినా ఆ తరువాత తన తీరుతో వారిలో అసంతృప్తి లేకుండా చేయలేకపోయారు. తమను కాదని ఒంటరిగా ముందుకు వెళ్లడం భావ్యం కాదని కొందరు సీనియర్లు ఇప్పటికీ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు.

ఇటీవల రేవంత్ రెడ్డి ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మిని కాంగ్రెస్ లోకి వచ్చేట్లు చేశారు. అలాగే భూపాల పల్లిలోని ముఖ్య నేతలను తిరిగి పార్టీలోకి రప్పించారు. హైదరాబాద్ లోని పీజేఆర్ కూతురు విజయారెడ్డిని కాంగ్రెస్ లోకి రప్పించారు. ఇటీవల ఓ మేయర్ కూడా కాంగ్రెస్ లోకి రావడం ప్లస్ పాయింట్ గా మారింది. కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా టీఆర్ఎస్ లోని అసంతృప్తులు.. మాజీ కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తిరిగి రప్పిస్తున్నారు. ఈ ఊపు చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో రేవంత్ దూకుడు పనిచేస్తుందని కొందరు భావిస్తుండగా.. మరికొందరు సీనియర్లు మాత్రం తీవ్ర అసంతృప్తితో కొనసాగుతున్నారు. అయితే ఎన్నికల సమయానికి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహం రచిస్తాడో చూడాలి.

Also Read: Sreeleela: రాఘవేంద్రరావు రుణాన్ని తీర్చుకోలేదట.. కుర్ర భామ కొత్త కబుర్లు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular