Revanth Reddy – Sharmila : కర్ణాటకలో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ ప్రభావం తెలంగాణలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో అధికార భారత రాష్ట్ర సమితి నుంచి నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు, భారత రాష్ట్ర సమితి నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బుధవారం నాడు హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి వీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్నడు చేరేది చెబుతారని వారి అనుచరులు వివరిస్తున్నారు. ఇదంతా జరుగుతుండగానే షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..
డీకే శివకుమార్ భేటీ
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా పనిచేసిన డీకే శివకుమార్.. వరుసగా ఇటీవల వైయస్ షర్మిల తో భేటీ అయ్యారు. అయితే దీనిపై షర్మిల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందున అభినందించేందుకే ఆయనను కలిశానని షర్మిల చెప్పుకొచ్చారు. మరోవైపు శివకుమార్ కూడా తనకు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉన్న నేపథ్యంలోనే షర్మిలను కలిశానని వివరించారు. అయితే డీకే శివకుమార్ షర్మిల పార్టీని కాంగ్రెస్లో కలిపేందుకు మధ్యవర్తిత్వం నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం షర్మిల తెలంగాణ రాష్ట్రంలో విడతలవారీగా పాదయాత్రలు నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీ ఆమెను పలుమార్లు అరెస్టు చేసింది. ఇది మీడియాలో వైరల్ గా మారింది. ఇక పార్టీకి సంబంధించి కూడా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇదంతా జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఇది తెలంగాణలో పార్టీ శ్రేణులకు ఒక బూస్ట్ ఇచ్చింది. ఇదే క్రమంలో షర్మిలను డీకే శివకుమార్ కలిశారు. అయితే ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని శివకుమార్ ఆమె ముందు ప్రతిపాదించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఇది కాస్త రేవంత్ రెడ్డి దాకా వెళ్ళింది..దీంతో ఆయన దీనిపై స్పందించారు.
అవకాశం లేదు
షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఆమె ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసుకోవాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ చేస్తే అక్కడ పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అంటున్నారు. ” షర్మిల ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహిళ. ఆమె ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తానంటే కుదరదు. ఒకవేళ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పటికీ ఆమె తన రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో ఆమెకు అవకాశం ఇవ్వం. ఇక్కడ పెత్తనం చెలాయిస్తానంటే ఒప్పుకోము.” రేవంత్ రెడ్డి తన అంతరంగీకుల వద్ద స్పష్టం చేశారు.. డీకే శివకుమార్ మాత్రం ఈ విలీనం అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ విషయం మీద ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ.. ప్రస్తుతానికయితే వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.