https://oktelugu.com/

Telangana Cinema Awards : ప్రజల పాటకు గౌరవం.. తెలంగాణలో సినిమా అవార్డులకు ఆ గొప్ప వ్యక్తి పేరు!

తెలంగాణ లెజెండ్, తెలంగాణ బ్రాండ్‌ పేరుతో ఎవరికి అవార్డు ఇచ్చినా అది గొప్ప అవకాశంగా భావించాలని కోరారు. సీఎం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రజల పాటకు దక్కిన గొప్ప గౌరవంగా గద్దర్‌ అభిమానులు అభివర్ణిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 31, 2024 11:00 pm
    Follow us on

    Telangana Cinema Awards : ప్రజాయుద్ధ నౌక గద్దర్‌కు ఆయన మరణానంతరం ఆయన కలలుకన్న తెలంగాణలో ప్రజల పాటకు అత్యున్నత నీరాజనాలు దక్కాయి. ఉమ్మడి రాష్ట్రంలో సినిమా అవార్డులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న నంది అవార్డుల స్థానంలో తెలంగాణ సర్కార్‌.. మా రాష్ట్రం, మా అవార్డులు, మా బ్రాండ్‌ అన్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గద్దర్‌ పేరిట సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గద్దర్‌ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో సీఎం ఈమేరకు ప్రకటన చేశారు. ఈ ఏడాది ఉగాది రోజున అవార్డులు ప్రదానం చేస్తామని, వచ్చే ఏడాది నుంచి గద్దర్‌ జయంతి రోజునే అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు. ‘ఇది నా శాసనం.. నా మాటే జీవో..’ అని సీఎం ప్రకటించారు. అంతే కాదు మెదక్‌ జిల్లాకు గద్దర్‌ పేరు పెడతామని, ట్యాంక్‌బండ్‌పై గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈమేరకు క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

    గతంలో నంది అవార్డులు..
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నటులకు నంది అవార్డులు ఇచ్చేవారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అవార్డుల ప్రధానోత్సవం నిలిచిపోయింది. ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ పేరిట, ప్రస్తుత సీఎం వైఎస్సార్‌ పేరిట అవార్డులు ఇచ్చుకుంటున్నారు. కానీ, తెలంగాణ కోసం పోరాడామని, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీని పటిష్టం చేశామని, అండగా నిలిచామని చెప్పుకున్న కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉన్నా సినిమా అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన మాత్రం చేయలేదు. సింహం పేరిట ఇస్తామని చెప్పినా.. అది కార్యరూపం దాల్చలేదు. కొత్త సీఎం రేవంత్‌రెడ్డి సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకున్నారు.

    సినిమాతోపాటు కవులు, కళాకారులకూ..
    గద్దర్‌ అవార్డులను ఒక్క సినిమా వాళ్లకే పరిమితం చేయలేదు. ఇక నుంచి కవులు, కళాకారులకు కూడా ఇవ్వనున్నారు. అందరూ గద్దర్‌ను స్మరించుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నటుల సీఎం ప్రకటించారు. తెలంగాణ లెజెండ్, తెలంగాణ బ్రాండ్‌ పేరుతో ఎవరికి అవార్డు ఇచ్చినా అది గొప్ప అవకాశంగా భావించాలని కోరారు. సీఎం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రజల పాటకు దక్కిన గొప్ప గౌరవంగా గద్దర్‌ అభిమానులు అభివర్ణిస్తున్నారు.