Tirumala : చిరుతల దాడుల వెనుక ఎర్రచందనం దోపిడీ?

అడవులను గుప్పెట పెట్టుకుంటున్న క్రమంలో స్మగ్లర్లు అడవుల్లో తుపాకులు, మారణ ఆయుధాలతో సంచరిస్తుండడంతో ఏనుగులు, వన్యప్రాణులు అక్కడి నుంచి పారిపోతున్నాయి.

Written By: NARESH, Updated On : August 16, 2023 12:38 pm
Follow us on

Tirumala : అంతర్యామినే చరబట్టారు. ఆ దేవుడినే ‘క్యాష్’ చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చాక సహజ వనరులపై పడ్డారన్న ఆరోపణలున్నాయి. కావేవీ దోపిడీకి అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఇప్పటికే ఇసుక, మైనింగ్, ఖనిజాల దోపిడీ జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేవదేవుడు కొలువైన శేషాచలం కొండలను వదలడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చిరుతల దాడుల వెనుక కోణాన్ని అందరూ ఒకవైపే చూస్తున్నారు. కానీ ఎర్రచందనం దొపిడీ ముఠాలు శేషాచలాన్ని ఆక్రమించడంతోనే చిరుతల జనావాసాల్లోకి వస్తున్నాయన్న సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. 

కలియుగ ప్రత్యక్ష దైవం, శేషాచల అడవుల్లో ఏడు కొండలపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్ష మంది తిరుమలకు వస్తుంటారు. వేల మంది నడక దారిలో ఏడుకొండలు ఎక్కుతుంటారు. తిరుమల కనుమదారిలో గతంలో తరచూ ఏనుగులు ప్రత్యక్షమయ్యేవి. కానీ అవి భక్తులకు ఎలాంటి హాని తలపెట్టలేదు. కానీ కొన్ని రోజులుగా క్రూర మృగాలు భక్తుల నడకదారిలోకి వస్తున్నాయి. భక్తులపై దాడిచేస్తున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఇద్దరు చిన్నపిల్లలపై చిరుత పులులు దాడిచేశాయి. ఓ బాలుడు చిరు దాడి నుంచి బయటపడగా, చిన్నారి లక్షితను చిరుత చంపేసింది. ఈ దారిలో ఐదు చిరుతలు తిరుగుతున్నట్లు అధికారులు ఫ్లాష్‌ కెమెరాల సహాయంతో గుర్తించారు. ఇక ఎలుగు బంట్లు కూడా ఈ మార్గంలో తిరుగుతూ భక్తులను హడలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనిది చిరుతలు ఇలా ఎందుకు అడవి దాటి కనిపిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు భక్తుల నడకదారిలోకి వస్తున్నాయో తెలుసుకుందాం.

‘ఎర్ర’ దొంగలే కారణం..
తిరుమల నడక దారిలోకి చిరుతలు, వన్యప్రాణులు ప్రవేశించడం వెనుక అసలు కారణం ఎర్రచందనం స్మగ్లింగ్‌. శేషాచల అడవుల్లో విచ్చలవిడిగా పేలుళ్లు జరుపుతుండటంతో వన్యప్రాణులు భయంతో జన సంచారం ఉన్న ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అధికారులు, పాలకులు ఈ అంశంపై దృష్టిపెట్టకుండా భక్తులపై ఆంక్షలు విధిస్తున్నారు.

విలువైన ఎర్రచందనం…
ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం వృక్షాలు శేషాచల అడవుల్లోనే విస్తారంగా ఉన్నాయి. దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ లో తప్ప మరెక్కడా పెరగదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమే పెరుగుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవులలో మాత్రమే ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగుతాయి. ఈ చెట్టు కలపతో చేసే వాయిద్యాన్ని జపాన్‌లో సంగీత సాధనం గా ఉపయోగిస్తారు. ఆ సంగీత సాధనం ప్రతీ ఇంటిలో ఉండటం వాళ్ల ఆచారం. దీని కలప పొట్టుని కలర్‌ ఏజెంట్‌గా వాడతారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కలప ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. అయినా దీనికి చాలా విలువ ఉండటంతో స్మగ్లర్లు రహస్యంగా దేశం దాటిస్తున్నారు. విదేశాలలో అత్యధిక విలువ వున్నందున ప్రాణాలకు తెగించి ఈ కలపను దొంగ రవాణా చేసి ఇతర దేశాలకు తరలించి కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు స్మగలర్లు.

ప్రాణాలకు తెగించి..
ఎర్రచందనం వృక్షాలు దట్టమైన అడవిలో క్రూర మృగాల స్థావరాలు ఉన్న ప్రాంతంలో ఉన్నాయి. అయినా స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన కూలీలతో ఎర్రచందనం చెట్లు నరికించి దుంగలు సిద్ధం చేయిస్తున్నారు. ఇందుకోసం వారికి భారీగా కూలి ఇస్తున్నారు. దీంతో కూలీలు ప్రాణాలకు తెగిస్తున్నారు. క్రూర మృగాలతో పోరాడుతున్నారు. స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తున్న అటవీశాఖ సిబ్బందిపై దాడిచేస్తున్నారు. చంపిన సందర్భాలు ఊడా ఉన్నాయి.

అలజడితో అడవి దాటుతున్న వన్యప్రాణులు..
శేషాచలం అడవులను ఎర్రచందనం ఖజానాగా పేర్కొంటారు. రోజూ టన్నుల కొద్దీ నరికి తరలించేస్తున్నా తరిగిపోని సంపద ఈ అడవుల్లో దాగి ఉంది. దశాబ్దాలుగా సాగుతున్న ఎర్ర చందనం అక్రమ నరికివేత వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లుగా ఊపందుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్‌ పేరుకే తప్ప క్రియాశీలంగా లేవు. అడవుల్లో కూంబింగ్, స్మగ్లర్లపై దాడులు, వెంటాడి పట్టుకోవడం వంటి చర్యలు దాదాపుగా లేవు. వాహనాలు అదుపు తప్పి తిరగబడి ఎర్రచందనం బయటపడితేనో, చెక్‌పోస్టుల్లో దొరికిపోతేనో మాత్రమే చందనం దుంగలు దొరికాయని లెక్కలు చెబుతున్నారు. దుంగలు దొరికినా దొంగలు మాత్రం దొరకరు. అరుదుగా దొంగలూ పట్టుబడ్డా, బలహీనమైన కేసులతో బయటపడి మళ్లీ అడవిబాట పడుతున్నారు. ఈ విధంగా శేషాచలంలో స్మగ్లర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. వారి కార్యకలాపాలకు అడ్డూ అదుపూ లేదు. విచ్చలవిడిగా చందనం చెట్లు నరికి పోగులుపెడుతున్నారు.

‘ఎర్ర‘ దొంగల అరాచకాలు..
అడవులను గుప్పెట పెట్టుకుంటున్న క్రమంలో స్మగ్లర్లు అడవుల్లో తుపాకులు, మారణ ఆయుధాలతో సంచరిస్తుండడంతో ఏనుగులు, వన్యప్రాణులు అక్కడి నుంచి పారిపోతున్నాయి. ఈ స్మగ్లర్లే  బెదరగొడుతున్నారు. తమ స్మగ్లింగ్‌కు అడ్డుపడుతాయనే భయంతో అలజడి సృష్టిస్తున్నారు. ఏనుగులు, క్రూర మృగాలు తారసపడితే భీకర శబ్దాలు చేసి తరమడం, తుపాకులతో శబ్దాలు చేయడం. రాళ్లు విసరడం, నిప్పు రాజేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. దీంతో జంతువులు అడవి దాటి పరుగులు తీస్తున్నాయని చెబుతున్నారు. ఎర్రచందరనం దుంగలతో పాటూ వన్యప్రాణుల మాంసం, చర్మం కూడా స్మగ్లర్లకు ఆదాయ మార్గంగా మారిందంటున్నారు. వేటాడేస్తున్నారు.

వన్యప్రాణుల స్థావరాల్లోకి ఎర్ర దొంగలు..
దట్టమైన అడవుల్లో ఉండే వన్యప్రాణుల స్థావరాల్లోకి ఎర్రదొంగలు వెళ్తుండడంతో వాటి ప్రశాంతకు భంగం కలుగుతోంది. దీంతో అక్కడి నుంచి బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతకాలంగా ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు తిరుమల ఘాట్‌ వైపు, కరకంబాడి, కల్యాణి డ్యామ్, తిరుచానూరు సమీపంలోని శిల్పారామం వరకు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏకంగా అలిపిరి వద్దకొచ్చి.. అక్కడి నుంచి తిరుపతిలోకి వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే అటు శ్రీవారి భక్తుల్లో భయం మొదలైంది. ఇప్పటికైనా పాలకులు భక్తులపై ఆంక్షల గురించి కాకుండా.. అడవిలో అలజడిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎర్రదొంగలను పట్టుకుంటే అడవిని జంతువులకు వదిలేస్తే అవి తిరుమల భక్తులకు హాని తలపెట్టుకుంటా వాటి మానాన అవి ఉంటాయి.