Ravindra Jadeja: ఎంతటి కుటుంబమైనా గొడవలు సహజం. అందుకే “ఇంటింటికి ఉన్నది మట్టిపోయ్యే” అనే సామెత పుట్టింది. ఇప్పుడు ఈ సామెత క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులకు నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. క్రికెటర్ రవీంద్ర జడేజా అంటే తెలియని వారు ఉండరు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ వర్థమాన క్రికెటర్ భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. బౌలింగ్లో మాత్రమే కాకుండా ఫీల్డింగ్, బ్యాటింగ్లో అదరగొట్టాడు.వికెట్ తీసినప్పుడు, ఫోర్ లేదా సిక్సర్ కొట్టినప్పుడు, క్యాచ్ లేదా రన్ అవుట్ చేసినప్పుడు గుజరాతి స్టైల్లో కరవాలాన్ని తిప్పినట్టు హావభావాలు పలికిస్తాడు. అలాంటి హావభావాలు అభిమానులను విపరీతంగా అలరించేవి. అలాంటి రవీంద్ర జడేజా రివాబా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్ది రోజులకే తన భర్త రవీంద్ర జడేజాతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు తీసుకుంది. తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రివాబా జడేజా తన సొంత కుటుంబం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి.
రివాబాను రవీంద్ర జడేజా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాల సభ్యుల అనుమతితో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. రవీంద్ర జడేజాది ఉమ్మడి కుటుంబం. పెళ్లయిన తర్వాత వేరు పడకుండా ఉమ్మడి కుటుంబంలోనే రవీంద్ర _రివాబా తమ దాంపత్య జీవనాన్ని ప్రారంభించారు. ఐతే రవీంద్ర _రివాబా తమ దాంపత్య జీవనం ప్రారంభించిన తర్వాత మూడు నెలలకే ఇంట్లో విభేదాలు వచ్చాయని రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ” నా కొడుకు క్రికెటర్ కాకపోయి ఉండి ఉంటే బాగుండేది. అప్పుడు ఆమెతో పెళ్లి జరిగి ఉండేది కాదు. పెళ్లి తర్వాత రవీంద్ర జడేజా ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. మా కుటుంబంలో సంబంధాలు దెబ్బతిన్నాయి. సమిష్టిగా ఉండే మా కుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయి. వీటన్నింటికీ కారణం రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా. వివాహం జరిగిన మూడు నెలల్లోనే ఇంట్లో విభేదాలు పొడజూపాయి” అని అనిరుధ్ సింగ్ వ్యాఖ్యానించారు.
అనిరుధ్ సింగ్ వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా కొన్ని సంఘటనలు జాతీయ మీడియాలో అనూహ్యంగా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రివాబా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రవీంద్ర జడేజా తండ్రి కనిపించలేదు. చివరికి ఆమె విజయం సాధించినప్పుడు కూడా ఆయన ఆనవాళ్లు కనిపించలేదు. ఈ వ్యవహారం గురించి తెలియని వారు అప్పట్లో దీని గురించి పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం కుటుంబంలో నెలకొన్న విభేదాలు వల్ల అనిరుద్ సింగ్ ఒంటరిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా రవీంద్ర జడేజా, అతడి భార్య రివాబా పై అనిరుధ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. దీనిపై అటు రవీంద్ర జడేజా, ఇటు అతడి భార్య రివాబా నోరు మెదపకపోవడం విశేషం.