England Vs India : అశ్విన్ బౌలింగ్లో స్వీప్ షాటా? కొంచెం ఆలోచించుకోవాలి కదా..

అదే క్రమంలో కీపర్ ధృవ్ ఆ బంతిని రెప్పపాటులో అందుకున్నాడు. దీంతో 145 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రవిచంద్రన్ ఖాతాలో "5 వికెట్ హల్ " చేరింది.

Written By: NARESH, Updated On : February 25, 2024 5:57 pm
Follow us on

England Vs India : నాలుగో టెస్ట్ ఆదివారం ఆసక్తికర మలుపులు తిరిగింది. 7 వికెట్ల నష్టానికి 219 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 307 పరుగులకు ఆల్ అవుట్ అయింది. వికెట్ కీపర్ ధృవ్ పరుగులు చేసి భారత జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు. కులదీప్, ఆకాష్ తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయినప్పటికీ కోట్లాదిమంది భారతీయుల అభిమానాన్ని చూరగొన్నాడు. ధృవ్ ఆటతీరు వల్ల ఇంగ్లాండ్ ఆధిక్యం 46 పరుగులకు తగ్గింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు అశ్విన్, కులదీప్ ధాటికి విలవిలాడిపోయింది. 145 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. ఆ జట్టులో ఓపెనర్ క్రావ్ లే చేసిన 60 పరుగులే అత్యధిక స్కోర్ కావడం విశేషం.

మైదానం అనూహ్యంగా టర్న్ కావడంతో ఆదివారం బౌలర్లు పండగ చేసుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు మూడు వికెట్లు నేల కూల్చితే.. భారత బౌలర్లు 10 వికెట్లు పడగొట్టారు.. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టు టాప్ ఆర్డర్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లను వణికించాడు. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసి తన వంతు పాత్ర పోషించాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును రూట్, క్రావ్ లే ఆదుకునే ప్రయత్నం చేశారు. మూడో వికెట్ కు 46 పరుగులు జోడించారు. రూట్ అవుట్ కావడంతో క్రావ్ లే బెయిర్ స్టో తో కలిసి నాలుగో వికెట్ కు 55 పరుగులు జోడించి.. ఇంగ్లాండ్ జట్టును కాపాడే ప్రయత్నం చేశారు. ఈ దశలో కులదీప్ బౌలింగ్లో క్రావ్ లే క్లీన్ బోల్డ్ అయ్యాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులు. తర్వాత 35 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లాండ్ జట్టు మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. భారత్ ఎదుట 191 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.

మూడో రోజు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ తీసిన అండర్సన్ వికెట్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. అప్పటికి ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును కోలుకోకుండా చేశారు. ఈ నేపథ్యంలో అండర్సన్, బషీర్ ఆడుతున్నారు. ఇంగ్లాండ్ స్కోర్ 145 పరుగుల వద్ద ఉన్నప్పుడు రవిచంద్రన్ ను అశ్విన్ 53వ ఓవర్ వేయాలని కెప్టెన్ రోహిత్ శర్మ ఆదేశించడంతో అతడు బౌలింగ్ ప్రారంభించాడు. ఓవర్ నాలుగో బంతికి స్వీప్ ఆడాలని అండర్సన్ బ్యాట్ తిప్పాడు. కాకపోతే బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. అదే క్రమంలో కీపర్ ధృవ్ ఆ బంతిని రెప్పపాటులో అందుకున్నాడు. దీంతో 145 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రవిచంద్రన్ ఖాతాలో “5 వికెట్ హల్ ” చేరింది.

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో అండర్సన్ అవుట్ అయిన విధానానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. “ధృవ్ ఎంత బాగా ఒడిసిపట్టాడో.. మొత్తానికి రాంచి వేదిక అతడికి బాగా కలిసి వచ్చింది” అని అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “అశ్విన్ బౌలింగ్లో స్వీప్ షాటా? కొంచెం ఆలోచించుకోవాలి కదా..” అంటూ అండర్సన్ ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు.