
Ranga Maarthaanda Teaser Review: లోతైన భావాలు, బలమైన భావోద్వేగాలకు కృష్ణవంశీ సినిమాలు పెట్టింది పేరు. ఆయన మొదటి చిత్రం గులాబీ తోనే తన మార్క్ క్రియేట్ చేశారు. ఆయన తెరకెక్కించిన అంతఃపురం ఇంటెన్స్ డ్రామాగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. విమర్శకులు ఆ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆ స్థాయి చిత్రం కృష్ణవంశీ నుండి మరలా రాలేదు. రంగమార్తాండ మూవీతో ప్రేక్షకులకు ఆ కోరిక తీరనున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషానికి పైగా ఉన్న టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో పరిచయం చేసింది.
రంగమార్తాండ టీజర్లో నటులు కనిపించడం లేదు. కేవలం పాత్రలు మాత్రమే. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, శివాత్మికలు పోషించిన ప్రతి పాత్రకు ఒక ప్రాధాన్యత, కథలో భాగంగా నడిపారని అనిపిస్తుంది. ముఖ్యంగా బ్రహ్మానందంలో ఎన్నడూ చూడని కోణం ఆవిష్కృతం కానుంది. ఆయన కామెడీ పాత్రలకు మించి ఒక సీరియస్, ఎమోషనల్ రోల్ చేయగలరని నిరూపించుకుంటారు. కృష్ణవంశీ ఆయనతో ఏదో పెద్ద ప్రయోగమే చేశారు.

రంగస్థల నటుడిగా గౌరవ సత్కారాలు అందుకున్న ప్రకాష్ రాజ్ జీవితంలో ఏం జరిగింది. ఆయనతో ముడిపడి ఉన్నవారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి. ఈ నటసామ్రాట్ కి దుర్భర పరిస్థితి ఎందుకు వచ్చిందనేది… మొత్తంగా రంగమార్తాండ స్టోరీ కావచ్చు. ఆల్రెడీ ఈ చిత్ర ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఫిల్మ్ క్రిటిక్స్, చిత్ర ప్రముఖులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. గుండెలు బరువెక్కించే చిత్రమంటూ కితాబు ఇస్తున్నారు. చిరంజీవి వాయిస్ ఓవర్ తో మొదలై ముగిసిన టీజర్ అద్భుతంగా ఉంది.

దర్శకుడు కృష్ణవంశీకి ఇది కమ్ బ్యాక్ మూవీ అవుతుందనిపిస్తుంది. కాగా రంగమార్తాండ మరాఠీ చిత్రం నటసామ్రాట్ చిత్ర రీమేక్. అక్కడ ఇది ఘన విజయం సాధించింది. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటుండగా విడుదలకు సిద్ధమైంది. సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించారు. 2017లో కృష్ణవంశీ నక్షత్రం టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఇన్నేళ్ల గ్యాప్ అనంతరం రంగమార్తాండ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.