Ramoji Rao: రామోజీరావు మీడియా మొగల్ మాత్రమే కాదు అంతకుమించి. ఇది పలు సందర్భాల్లో నిరూపితం అవుతూనే ఉంది. అంతటి కాకలు తీరిన అమిత్ షా కూడా ఆయన దగ్గరికే వెళ్తారు. ఆయన బంగారపు సింహాసనంలో కూర్చుంటే ఎదురుగా మామూలు సోఫాలో హోం శాఖ మంత్రిని కూర్చోబెట్టుకుని తన రాజసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంతటి రామోజీరావును జగన్ మోహన్ రెడ్డి ఈమధ్య మరింత చికాకు పెడుతున్నాడు. ఓ మార్గదర్శి కేసు కావచ్చు, సీతమ్మధార స్థల వివాదం కావచ్చు, డాల్ఫిన్ హోటల్స్ లో ఇతరత్రా విషయాలు కావచ్చు.. ఏవైనా సరే రామోజీరావును జైలు దాకా తీసుకుపోలేదు. ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చినా కెసిఆర్ అడ్డుపడ్డాడు. ఈ విషయాన్ని ఇటీవల కేటీఆర్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబేట్ లో చెప్పాడు. ఈ సంగతి అటు ఉంచితే ప్రస్తుతం ఒక కేసు కు సంబంధించి ఏకంగా సుప్రీంకోర్టు రామోజీరావుకు క్లీన్ చీట్ ఇవ్వడం ఆయన పవర్ ఏ పాటిదో చాటి చెబుతోంది.
కేసు కొట్టేశారు
సాధారణంగా ఒక కేసు కు సంబంధించి విచారణ లాంటివి జరగకుండానే కొట్టివేయడం అనేది జరగదు. రామోజీరావు విషయంలో అలానే జరిగింది. మార్గదర్శి లో తన తండ్రికి తెలియకుండానే షేర్లు తీసుకున్నారని యూరి రెడ్డి అనే వ్యక్తి ఆ మధ్య సిఐడి కి ఫిర్యాదు చేశాడు. సిఐడి అధికారులు ఈ కేసు ఆధారంగా హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ కేసు మీద స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ యూరి రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన స్టే మీద కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు మీరు వాపస్ తీసుకుంటారా? లేదా కొట్టివేయమంటారా అని యూరి రెడ్డిని అడిగింది. అలా ఎలా చేస్తారు అంటూ యూరి రెడ్డి అడిగితే అదంతా కుదరదు అని స్పష్టం చేసింది. దీంతో యూరీ రెడ్డి తరఫున లాయరు వాపస్ తీసుకుంటామని కోర్టుకు చెప్పారు. కానీ కోర్టు మాత్రం కేసును కొట్టి వేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. దీంతో యూరి రెడ్డి, అతడి తరఫు లాయర్ ఖిన్నులయ్యారు.
వ్యవస్థలు అలా ఉంటాయి మరి
ఇటీవల మార్గదర్శి మీద ఏపీ ప్రభుత్వం దాడులు చేసినప్పుడు.. రామోజీరావును ఉక్కపోతకు గురి చేసినప్పుడు జగన్ మీద ఒక సెక్షన్ ఆరోపణలు చేసింది. న్యాయ వ్యవస్థను కూడా తిట్టిపోసింది. తాజాగా సుప్రీంకోర్టు మార్గదర్శి షేర్ల వివాదానికి సంబంధించిన కేసును కొట్టి వేయడంతో ఒక్కసారిగా అదే న్యాయ వ్యవస్థను పొగడడం ప్రారంభించింది. కాదు సామాజిక మాధ్యమాలలో రామోజీరావు తీరును ఆకాశానికి ఎత్తడం మొదలుపెట్టింది. కానీ ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే రామోజీరావు అనే వ్యక్తి కేవలం మీడియా మొగల్ మాత్రమే కాదు అంతకుమించి. వ్యవస్థలను తనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో, విభేదాలు, వివాదాలు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలో బహుశా ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలియకపోవచ్చు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఈ స్థాయిలో ఆలోచిస్తున్నారంటే మామూలు విషయం కాదు. పైగా వరుసగా ఇబ్బంది పెడుతున్న కేసుల నుంచి ఆయన బయటపడుతున్నారంటే ఊహకే అందడం లేదు.