Rajya Sabha Billionaires : రాజకీయాలంటే ప్రజాసేవ. ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసేందుకు రాజకీయాలు ఒక మార్గం… కానీ ఇదంతా గతం. ధనం మూలం ఇదం జగత్.. అన్న నానుడి ఇప్పటి రాజకీయాల్లో రాజ్యమేలుతోంది. డబ్బుంటేనే సీట్లు,ఓట్లు. లేకుంటే రాజకీయ పార్టీలు పట్టించుకోవు.. ప్రజలు ఆదరించారు. అందుకే ఇప్పుడు రాజకీయాలు, పదవులు ఖరీదైన వస్తువుగా మారిపోయాయి. చట్టసభలకు వెళ్తున్న వారంతా కోటీశ్వరులే.తాజాగా రాజ్యసభ సభ్యుల ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడైతే.. అందులో తెలుగు రాష్ట్రాల ఎంపీలే అపర కోటీశ్వరులుగా నిలవడం విశేషం.
రాజ్యసభకు ఎన్నికైన, నామినేట్ అయిన ఎంపీల ఎన్నికల అఫీడవిట్స్ను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషించింది. 203 మంది ఎంపీలు 25 మంది సగటు ఆస్తులను 80.93 కోట్లుగా ఉన్నట్లు నివేదించింది. 27 మంది ఎంపీలు కోటీశ్వరులు కాగా.. ఇందులో 11 మంది మన తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే కావడం విశేషం.
ఈ కోటీశ్వర ఎంపీల్లో.. టిఆర్ఎస్ సభ్యుడు బండి పార్థసారధి రికార్డు సృష్టించారు. ఆయన ఆస్తులు విలువ ఏకంగా 5300 కోట్లకు పై మాటే. 2577 కోట్ల ఆస్తులతో వైసిపి కి చెందిన అయోధ్య రామిరెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. సమాజ్ వాది పార్టీకి చెందిన జయాబచ్చన్ 1001 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 10 కోట్లకు పైగా ఆస్తులున్న ఎంపీలు 84 మంది ఉన్నారు. ఐదు నుంచి పది కోట్ల రూపాయల మధ్య ఉన్న ఎంపీలు మరో 33 మంది. ఒకటి నుంచి ఐదు కోట్ల లోపు ఆస్తి ఉన్నవారు 76 మంది. 3.79 లక్షల ఆస్తితో ఆప్ ఎంపీ బల్బీర్ సింగ్ అత్యంత పేదవారుగా నిలిచారు.
ఇక పార్టీలపరంగా చూస్తే రాజ్యసభలో అత్యధికంగా బిజెపిలో ఆరుగురు ఎంపీలు కోటీశ్వరులు, కాంగ్రెస్ లో నలుగురు, వైసీపీలో నలుగురు కోటీశ్వరులుగా నిలిచారు. మొత్తానికైతే రాజ్యసభలో రిచ్ పర్సన్స్ గా తెలుగు రాష్ట్రాల ఎంపీలు నిలవడం విశేషం.