Kantara vs RRR : వందల కోట్ల బడ్జెట్.. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ కోసమే 100 కోట్ల ఖర్చు.. భారీ సెట్టింగులు.. భారీ తారాగణం.. సినిమాకు కనీసం మూడు సంవత్సరాలు.. స్టార్ హీరోలు అంతా అంకితమైపోవాలి.. తీరా సినిమా హిట్ అయితే లాభాలే కానీ.. ఫ్లాప్ అయితే ఏంటి పరిస్థితి.. మూడేళ్ల సమయం .. కోట్ల డబ్బు వృథా.. రాజమౌళి తీసే భారీ సినిమాలు ప్రస్తుతానికైతే ఆయనకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. కానీ ఆయన పెట్టిన పెట్టుబడికి కేవలం 3 లేదా 4 రెట్లు మాత్రమే. ఆర్ఆర్ఆర్ కోసం 400 కోట్లు ఖర్చు చేసిన రాజమౌళికి వచ్చిన మొత్తం 1200 కోట్లు. అంటే మూడు రెట్ల ఆదాయం.. అయితే మూడేళ్ల సమయం మాత్రం వృథా అయ్యింది.

అదే కన్నడ చిత్రం కాంతారా కోసం అయిన ఖర్చు కేవలం 16 కోట్లు. అందులో నటించిన వారంతా లోకల్ కన్నడ నటులే. సినిమా నిర్మాత కొన్ని నెలల్లోనే పూర్తయ్యింది. కానీ వచ్చింది మాత్రం 400 కోట్లు. అంటే పెట్టిన పెట్టుబడికి 25 రెట్ల ఆదాయం.. కళ్లు చెదిరే లాభాలు. ఇందులో గ్రాఫిక్స్ కోసం కోట్లు పెట్టలేదు. నేచురల్ కథాంశాన్ని అంతే నేచురల్ గా బలమైన కథా, కథనంతో తీయడం. అదే హిట్ ఫార్ములా..
కానీ మన రాజమౌళి మాత్రం హంగులు, ఆర్భాటలకు పోయి డబ్బు, సమయం వృథా తీసిన సినిమా ఆర్ఆర్ఆర్ తో పోల్చితే ‘కాంతారా’ వందరెట్లు బెటర్ అని చెప్పొచ్చు. ఏమీ లేకున్నా అన్ని వందల కోట్లు వసూళ్లు సాధించింది. అందుకే ‘కాంతారా’ చూసి నిర్మాతలు, దర్శకుల ఆలోచనలు మారాలి అంటున్నారు జక్కన్న రాజమౌళి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాలంటే భారీ బడ్జెట్‌లు, స్టార్లు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.
కాంతారా రూ. 16 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. కాబట్టి, నికర లాభం చాలా పెద్దది, ఇది పెట్టుబడికి దాదాపు 25 రెట్లు. మరోవైపు రాజమౌళి యొక్క ఆర్ఆర్ఆర్ మరియు బాబుబలితో పోల్చినా కాంతారా సాధించిన ఫీట్ వసూళ్లు అనితరసాధ్యమైనది..
ఇది పక్కన పెడితే రాజమౌళి తను మునగడమే కాదు.. భారీ బడ్జెట్ పేరిట బాలీవుడ్ స్టార్లు కూడా ప్రయత్నించి చేతులు కాల్చుకునేలా చేస్తున్నాడు. బాహుబలి రిలీజ్ అయ్యాక ఆ ఊపులో 400 కోట్లు పెట్టి తీసిన అమీర్ ఖాన్-అమితాబ్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక రణ్ బీర్ తీసిన ‘షంషేరా’ కూడా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయ్యింది. సో రాజమౌళి మొదలుపెట్టిన భారీ బడ్జెట్ చిత్రాల వల్ల ఆయనకు లాభం లేదు. సినీ ఇండస్ట్రీకే లాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి తన సినిమాల బడ్జెట్‌ను ప్రతీసారి పెంచుతూనే ఉన్నాడు. సెట్స్‌పై భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. విదేశీ కంపెనీలు మరియు సాంకేతిక నిపుణులకు వీఎఫ్ఎక్స్ , సీజీఐలను అవుట్‌సోర్సింగ్ చేయడం వల్ల ఖర్చు తడిసి మోపడవుతోంది. పర్ ఫెక్ట్ గా రావాలని తీసిందే తీస్తూ కాలం వృథా చేస్తున్నాడు. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రమోషన్ల కోసం ఎక్కువ ఖర్చు చేయడం కూడా నిర్మాణ వ్యయం అదుపుతప్పడానికి కారణమైంది.
ఇంత చేసినా బ్రేక్‌ఈవెన్ అనేది చాలా కష్టతరమైన పనిగా మారింది. అయితే ఇవేమీ పాటించకుండా ‘కాంతారా’ అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగు సాంకేతిక నిపుణులు 20-25 కోట్ల బడ్జెట్‌తో మంచి గ్రాఫిక్స్‌తో కుర్రహీరో తేజ హీరోగా ‘హనుమాన్’ చిత్రాన్ని రూపొందించారు. కాంతారా, కేజీఎఫ్, బింబిసార చిత్రాలకు కూడా కావాల్సిన రీతిలో గ్రాఫిక్స్ ఉన్నాయి. అలాంటప్పుడు పెద్ద సినిమాలు గ్రాఫిక్స్‌పై వందల కోట్లు ఎందుకు తగలబెడుతున్నాయన్నది ప్రశ్న.
పొన్నియన్ సెల్వన్, బ్రహ్మాస్త్ర, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు గ్రాఫిక్స్‌పై వందల కోట్లు కొల్లగొట్టాయి. కానీ ఇప్పటికీ నిజమైన నివేదికలు చూస్తే.. పొన్నియన్ సెల్వన్ 1 తమిళనాడులో తప్ప భారతదేశంలో ఎక్కడా ఆడలేదని అందరికీ తెలుసు. బ్రహ్మాస్త్రం రిజల్ట్ కూడా ఇదే పరిస్థితి. బాహుబలి-ది బిగినింగ్ నిర్మాతలకు నష్టాన్ని తెచ్చిపెట్టిందని దిల్ రాజు స్వయంగా ఆలస్యంగా వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ భారతదేశంలో కూడా కొంతమంది పంపిణీదారులను నష్టాల్లోకి నెట్టింది. కానీ ఈ చిత్రాన్ని జపాన్‌లో ప్రదర్శించడం వల్ల, కేజీఎఫ్ 2 వంటి నిజమైన హిట్‌ల కంటే పెద్దదిగా కనిపించేలా మేకర్స్ మొత్తం కలెక్షన్‌కు కొత్త గణాంకాలను జోడిస్తున్నారు.
కాంతారా అనేది ఎప్పుడూ సాధ్యం కాని మాయాజాలం. దానిలో సంభావ్యత ఉన్నప్పటికీ అది పనిచేసింది. ప్రేక్షకులను మెప్పించి కలెక్షన్లు రాబట్టింది. కాంతారా , కార్తికేయ2 వంటి సినిమాల్లో సాధారణ హీరోలు అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగా ఆడాయి. ఆచార్యకి ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు కానీ అది భారీ డిజాస్టర్. కాబట్టి ఇమేజ్, ఫార్ములా, హై బడ్జెట్, రొటీన్ కంటెంట్ లాంటి పాత స్కూల్ పద్దతులతో సినిమాలు తీయడం నిర్మాతలను నట్టేట ముంచడమే అని రాజమౌళి లాంటి భారీ బడ్జెట్ దర్శకులు అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు కాంతారా, కార్తికేయ 2, దృశ్యం-2 వంటి చిత్రాలకు ప్రేక్షకులు తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తో, తక్కువ సమయంలో అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో సినిమాలు తీసే వాడు ఇప్పుడు నిజమైన పెద్ద డైరెక్టర్ గా చెప్పొచ్చు. రాజమౌళి దీనికి పూర్తి విరుద్ధం. అతను పెద్ద, భారీ ప్రాజెక్టులకు ప్రసిద్ధి చెందాడు. దక్షిణ భారతదేశంలో కూడా బ్రహ్మాస్త్ర లాంటి భారీ బడ్జెట్ ను సమర్పించాడు. కానీ ఇప్పటికీ ఆయన చేస్తున్నదానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాహుబలితో భారీ బడ్జెట్‌లను పరిచయం చేసింది ఆయనే. చేసే ప్రతి సినిమాకి పెద్ద మొత్తంలో సంపాదించాలనే దురాశతో హీరోల మైండ్‌సెట్‌ను చెడగొట్టాడన్న విమర్శ ఉంది. అయితే ఇప్పుడు కాంతారా ఫలితం చూసి ‘తక్కువ బడ్జెట్’ మంత్రం జపిస్తున్నాడు. కంటెంట్ బేస్ ఉంటే ఎంత చిన్న చిత్రమైనా ఆడుతుందన్న లాజిక్ ను మరిచి భారీ బడ్జెట్ కు రాజమౌళి బాటలు వేస్తున్నాడు. దీనివల్ల ఇప్పటికీ ఆయన మునగకున్నా హిందీ సహా కొందరు దక్షిణాది సినీ ప్రముఖులు నిండా మునిగారు. అందులో తమిళ దర్శకుడు ‘శంకర్’ కూడా ఉన్నారు. బాహుబలి చూసి ‘రోబో2’ను తీసి తొలి ప్లాప్ అందుకున్నాడు. అందుకే సినీ ఇండస్ట్రీ ఈ దుస్థితికి రాజమౌళినే కారణమని చెప్పొచ్చు.
-నరేశ్