Congress Janagarjana : కర్ణాటక రాష్ట్రంలో సాధించిన విజయంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. కర్ణాటకలో సాధించిన విజయం తర్వాత ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారిపోయింది. అప్పటిదాకా అంతర్గత కుమ్ములాటలతో సతమతమైన పార్టీ ఒక్కసారిగా బలం సంపాదించుకుంది. ఎడ మొహం పెడ మొహం గా ఉండే సీనియర్లు ఒక్కతాటిపైకి వచ్చారు. ఇదే క్రమంలో కెసిఆర్ తీరును నిరసిస్తూ భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు బయటకు వచ్చారు. కర్ణాటకలో ఎలాగో విజయం సాధించడంతో వారు కూడా కాంగ్రెస్ ఫోల్డ్ లోకి వచ్చారు. రేవంత్ రెడ్డి చాకచక్యంగా వారిద్దరిని పార్టీలోకి లాగేసుకున్నారు.
ఎటు చూసినా సానుకూల పవనాలు కనిపిస్తుండడంతో జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేసుకున్నప్పటికీ.. అధికార పార్టీ విధించిన ఆంక్షలు వల్ల సుమారు రెండు లక్షలకు పైచిలుకు జనం సభకు వచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక ఇదే వేదికగా రాహుల్ గాంధీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణను కెసిఆర్ ఫ్యామిలీ సర్వ నాశనం చేస్తుందని ధ్వజమెత్తారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రాన్ని తన సొంత జాగిర్ధారుగా కెసిఆర్ అనుభవిస్తున్నారని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టును తన సొంత ఏటీఎం గా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ వేర్వేరు కాదని సంచలన ఆరోపణలు చేశారు.
గతంలో వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ.. ఈసారి చేయూత పథకాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కర్ణాటకలో మాదిరి ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు 4000 పింఛన్ ఇస్తామని ప్రకటించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారందరికీ పట్టా భూములు ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా జీవించేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మతాలవారీగా ప్రజలను విడగొట్టబోమని, శాంతి సౌబ్రాతృత్వాలను పెంపొందించేందుకు కృషి చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.