Rahul Gandhi AP tour : చాలా రోజుల తర్వాత ఏపీకి వస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi). గతంలో భారత జూడో యాత్రలో భాగంగా అనంతపురం, కర్నూలులో పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. అటు తరువాత ఏపీకి వచ్చింది లేదు. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాటానికి రాహుల్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో రాహుల్ రాలేదు. ఇప్పుడు అదే విశాఖలో మూడు రోజులపాటు రాహుల్ పర్యటించనున్నారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మరోసారి చర్చకు దారి తీసింది. రాహుల్ వస్తోంది స్టీల్ ప్లాంట్ పోరాటానికేనని ప్రచారం నడుస్తోంది. ఏపీలో ఏమంత యాక్టివ్ గా లేదు కాంగ్రెస్ పార్టీ. పార్టీ కార్యకలాపాలు కూడా లేవు. ఇటువంటి సమయంలో రాహుల్ వస్తుండడం ఎంత మాత్రం హాట్ టాపిక్ కావడం లేదు. కానీ స్టీల్ ప్లాంట్ పై పోరాటం కోసమే ఆయన వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* పూర్వ వైభవం దిశగా..
ఏపీలో ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్( Congress) పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంది. ఘనవిజయాలను సొంతం చేసుకుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో మంచి విజయాలను దక్కించుకుంది. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. ఆయన సోదరి షర్మిల కు పార్టీ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్. అయినా సరే గాడిలో పడలేదు. అయితే షర్మిలను మార్చి కొత్త నాయకత్వానికి అప్పగిస్తారని ప్రచారం సాగింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాహుల్ గాంధీ ఏపీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
* కాపు నేతకు పగ్గాలు..
ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు కాపులకు అందించడం ద్వారా పార్టీని పూర్వ వైభవం దిశగా తీసుకెళ్లాలని హై కమాండ్ భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో కాపు నేతలకు ప్రియాంక గాంధీ నేరుగా ఫోన్ చేసినట్లు ప్రచారం నడిచింది. ముఖ్యంగా వంగవీటి మోహన్రంగా కుమారుడు రాధాకృష్ణకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని కూడా టాక్ నడిచింది. పార్టీని బలోపేతం చేసేందుకే రాహుల్ గాంధీ ఏపీకి వస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆయన పర్యటన రాజకీయంగా కాదని.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రక్షణ కమిటీ సభ్యులు మూడు రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సందర్శించనున్నారు. అందుకోసమే ఆయన విశాఖ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు నుంచి మూడు రోజులపాటు పర్యటన కొనసాగనుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం చలనం లేదు. బహుశా అధికారిక కార్యక్రమం కావడం వల్లే కాంగ్రెస్ పార్టీ పెద్దగా హడావిడి చేస్తున్నట్లు లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
