https://oktelugu.com/

Raghuramakrishnam Raju : రఘురామకృష్ణం రాజుకు ఊహించని షాక్

తాజా పరిణామాల క్రమంలో తాను చంద్రబాబు వెంట అడుగు వేస్తానని రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు.కానీ బిజెపిని కాదని చంద్రబాబు రఘురామకృష్ణం రాజుకు అవకాశం ఇవ్వగలరా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికైతే బిజెపి నుంచి రఘురామకృష్ణం రాజుకు ఊహించని షాక్ తగిలింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 25, 2024 / 09:14 AM IST

    cbn raghurama

    Follow us on

    Raghuramakrishnam Raju : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాక్ ఇచ్చింది బిజెపి. ఆ పార్టీ ప్రకటించిన ఆరుగురు జాబితాలో రఘురామకృష్ణం రాజు పేరు లేదు. మరోసారి నరసాపురం సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేయడానికి రఘురామకృష్ణంరాజు ఆసక్తి చూపారు. కూటమిలో బిజెపికి ఈ సీటు దక్కడంతో అంత రఘురామకృష్ణంరాజుకు టికెట్ వస్తుందని భావించారు. నరసాపురం టికెట్ ఏ పార్టీకి ఇచ్చినా ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని చాలా సందర్భాల్లో రఘురామ చెప్పుకొచ్చారు. కానీ టికెట్ల ప్రకటన ముంగిట మాత్రం చతికిల పడ్డారు. ఆయన ఆశిస్తున్న నరసాపురం ఎంపీ టికెట్ను బిజెపి శ్రీనివాస్ వర్మకు కట్టబెట్టింది.

    గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున రఘురామరాజు పోటీ చేశారు. మంచి మెజారిటీతో గెలుపొందారు. అయితే ఎన్నికైన ఆరునెలలకే వైసీపీ నాయకత్వంతో విభేదించారు. రెబల్ గా మారారు. జగన్ సర్కార్ చర్యలను తప్పుపట్టారు. విపక్షాలతో చేతులు కలిపి మరి ప్రభుత్వానికి, వైసీపీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైసీపీకి టార్గెట్ అయ్యారు. సిఐడి కేసులను సైతం ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదు నుంచి తీసుకొచ్చి గుంటూరు కార్యాలయంలో విచారణ పేరిట చిత్రహింసలకు గురిచేసినట్లు రఘురామకృష్ణంరాజు స్వయంగా చెప్పుకొచ్చారు. అటు బిజెపికి దగ్గరగా వ్యవహరించారు. రఘురామరాజు పై వేటు వేయాలన్న ప్రయత్నాన్ని బిజెపి అగ్ర నేతలు అడ్డుకున్నారు. దీంతో రఘురామరాజుకు బిజెపి ప్రాధాన్యమిస్తుందని అంతా భావించారు. కానీ తాజా పరిణామాలతో అటువంటిదేమీ లేదని తేలిపోయింది.

    టిడిపి, జనసేన కూటమిలో బిజెపి కూడా ఉండాలని బలంగా కోరుకున్న వారిలో రఘురామకృష్ణంరాజు ముందంజలో ఉంటారు. ఆయన ఆ దిశగా ఢిల్లీలో ప్రయత్నాలు కూడా చేశారు. దీనిని పక్కన పెడితే తనకు కూటమి తరుపున.. అది కూడా బిజెపి తరఫున తప్పకుండా సీటు వస్తుందని బలంగా నమ్మారు. అయితే ఆయనకు బిజెపి హ్యాండ్ ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సహజంగానే ఇది వైసీపీకి సంతోషం కలిగించే విషయం. వైసీపీకి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న రఘురామకృష్ణం రాజును వైసిపి కట్టడి చేయాలని ప్రయత్నించింది. కానీ బిజెపి అడ్డుకుందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే బిజెపి రఘురామకృష్ణం రాజును పక్కన పెట్టడం వైసీపీకి ఎనలేని సంతోషం ఇస్తోంది.

    అయితే రఘురామకృష్ణం రాజు వైసీపీని విభేదించి చంద్రబాబుతో చేతులు కలిపారు. చంద్రబాబు నాయకత్వాన్ని జై కొట్టారు. బిజెపిని టిడిపికి దగ్గర చేసేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ తీరా ఆ మూడు పార్టీలు ఏకతాటి పైకి రాగా.. ఇప్పుడు రఘురామకృష్ణం రాజుకు చాన్స్ లేకుండా పోయింది. తాజా పరిణామాల క్రమంలో తాను చంద్రబాబు వెంట అడుగు వేస్తానని రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు.కానీ బిజెపిని కాదని చంద్రబాబు రఘురామకృష్ణం రాజుకు అవకాశం ఇవ్వగలరా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికైతే బిజెపి నుంచి రఘురామకృష్ణం రాజుకు ఊహించని షాక్ తగిలింది.