https://oktelugu.com/

RK Kothapaluku: రేవంత్ తన మనిషి.. ఆర్కే అలానే రాస్తాడు

తాజాగా రాసిన కొత్తపలుకులో రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటి సందేశాన్ని రాధాకృష్ణ ప్రవచించాడు. ఓటుకు నోటు కేసు లో రేవంత్ రెడ్డి ప్రమేయం ఏమీ లేదని.. అదంతా కేసిఆర్ కుట్ర అని రాధాకృష్ణ తేల్చాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 10, 2023 / 08:59 AM IST

    RK Kothapaluku

    Follow us on

    RK Kothapaluku: ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్ తిరగేస్తుంటే బ్యానర్ వార్త కనిపించింది. అది ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసింది. గతంలో రాసే కొత్తపలుకు నాలుగో పేజీకి మాత్రమే పరిమితమయ్యేది. కానీ గత కొంతకాలం నుంచి ఫస్ట్ పేజీలో బ్యానర్ స్థాయిలో ప్రజెంట్ చేస్తున్నారు. సరే అది ఆయన పేపర్ ఆయన ఇష్టం. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. గత ప్రభుత్వాల మీద తన అవసరాల ఆధారంగా రాసిన రాధాకృష్ణ.. ఈ రోజు మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా లైన్ మార్చాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు క్యాంపు నుంచి వచ్చిన వాడే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాధాకృష్ణకు అత్యంత అవసరమైన క్యారెక్టర్. అదే సమయంలో రేవంత్ రెడ్డికి కూడా ఒక బలమైన మీడియా అవసరం. ఉభయ అవసరాలు ఉన్నాయి కాబట్టే ఆర్కే పిలిచిన వెంటనే రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఆ మధ్య ఎన్నికల ముందు ఒక గంట పాటు ఇంటర్వ్యూ చేసినట్టున్నాడు.. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తానని రాధాకృష్ణకు రేవంత్ రెడ్డి మాట కూడా ఇచ్చాడు. చూడాలి మరి ఆ ఇంటర్వ్యూలో రాధాకృష్ణ రేవంత్ రెడ్డిని ఏం అడుగుతాడో…

    తాజాగా రాసిన కొత్తపలుకులో రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటి సందేశాన్ని రాధాకృష్ణ ప్రవచించాడు. ఓటుకు నోటు కేసు లో రేవంత్ రెడ్డి ప్రమేయం ఏమీ లేదని.. అదంతా కేసిఆర్ కుట్ర అని రాధాకృష్ణ తేల్చాడు. చివరికి కూతురి పెళ్లికి కూడా ఒక గంట కంటే ఎక్కువ సమయం ఉండకుండా చేశాడని, అందువల్లే రేవంత్ రెడ్డిలో కెసిఆర్ పై కసి దాగి ఉందని రాశాడు. ఆ కసికి, కెసిఆర్ అహంకారం కూడా తోడుకావడంతో రేవంత్ రెడ్డి ప్రజలకు వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యిందని రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు. అదే ఆయనను ముఖ్యమంత్రిని చేసిందని చెప్పుకొచ్చాడు. సరే ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి లో ఉన్న కసి కంటే అతడిలో ఉన్న పోరాట పటిమ చూసే ఓటర్లు అతడి నాయకత్వాన్ని కోరుకున్నారు.. కానీ రేవంత్ రెడ్డిలో ఈ గుణం ఆర్కే కు కనిపించలేదా? కానీ చివర్లో మాత్రం రేవంత్ రెడ్డి చాలా లోతైన మనిషని ఆర్కే కితాబు ఇవ్వడం విశేషం..

    అయితే ఈ వ్యాస పరంపరలో ఆర్థిక కొన్ని విషయాలు కూడా చెప్పేశాడు. పేరు ప్రస్తావించకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా కొంతమంది వ్యక్తులు రెండు రోజులపాటు తీరిక లేకుండా పని చేశారని చెప్పుకొచ్చాడు. అయితే ఆర్కే ఇక్కడ మర్చిపోయిన విషయం ఒకటి ఉంది.. రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీరిలో చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. రేవంత్ రెడ్డి రాక కంటే ముందు వారు ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉన్నారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి పదవి విషయంలో పైరవీలు ఎందుకు చేసుకోకూడదు? ఆర్థికంగా రేవంత్ రెడ్డి తో సరితూగలేరు కాబట్టి వారు వెనుకబడిపోయారు. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. రేవంత్ రెడ్డి పదే పదే తమ పార్టీలో సీఎం అయ్యే అభ్యర్థులు చాలామంది ఉన్నారని చెప్పినప్పుడు.. ఆర్కే మాత్రం ఇలా రాయడం ఏమిటో? కెసిఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలిచారని.. ఏమాత్రం అవకాశం ఉన్నా వారు ఆయన క్యాంపులోకి వెళ్లిపోతారని, కెసిఆర్ రేవంత్ ప్రభుత్వాన్ని పడగొడతాడని, రాధాకృష్ణ ఏకంగా హెచ్చరిక జారీ చేశాడు.. అయితే వారందరికీ కాంగ్రెస్ పార్టీ అనేక సర్వేలు చేసిన తర్వాతనే టికెట్లు కేటాయించింది. అలాంటప్పుడు వారిపై రాధాకృష్ణ కోవర్టు లు అని ఎలా ముద్ర వేస్తాడు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటే వాళ్లంతా కేసిఆర్ కోవర్ట్ లేనా? చివరిగా టికెట్ కేటాయింపులో, సీనియర్లకు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి పెద్దగా పట్టు విడుపులకు పోలేదని, నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి లాగా ఉండలేదని వ్యాఖ్యానించాడు. వాస్తవానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సహజంగా ఆయనకు పార్టీపై పట్టు ఎక్కువగా ఉండేది. టిడిపి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి కూడా అదే స్థాయిలో గౌరవం దక్కాలంటే ఎలా?! పైగా టికెట్లు మొత్తం తను అనుకున్న వారికే ఇస్తే ఇక పార్టీలో ప్రజాస్వామ్యం ఏముంటుంది? ఇక పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆర్కే కితాబిచ్చారు. కానీ ఇక్కడే ఆయన ఇల్లు అలకగానే పండగ కాదనే సామెతను మర్చిపోయారు. పనిలో పనిగా రేవంత్ సీఎం కావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని తెల్చేశారు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాధాకృష్ణ కాబట్టి తన ఫస్ట్ పేజీలో ప్రియార్టీ ఇస్తున్నారు. అదే జగన్ కు కేసీఆర్ అంటే ఇష్టం కాబట్టి ఎన్నికలకు ముందు నాగార్జునసాగర్ డ్యాం వివాదానికి తెరలేపాడు. ఎవరి ఆసక్తులు వారికి ఉన్నప్పుడు.. ప్రత్యేకంగా జగన్ విషయాన్ని ఆర్కే ప్రస్తావించడం దేనికో?! పాపం ఆర్కే.. ఇక్కడ కూడా చంద్రబాబు కు మైలేజ్ తెచ్చే ప్రయత్నమేనా?!