Independence Day 2023 : భారతదేశం.. ఇండియా – పాకిస్తాన్ గా విడిపోయిందని మాత్రమే అందరికీ తెలుసు. కానీ.. ఎవరు విడగొట్టారు? సరిహద్దులు ఎవరు గీశారు? దేశ విభజన జరిగినప్పుడు ఎంతటి మారణహోమం జరిగింది? అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఆ వివరాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.
భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఆంగ్లేయులు నిర్ణయానికి వచ్చారు. అయితే.. కేవలం స్వాతంత్రం ప్రకటించి వెళ్లిపోయే పరిస్థితి లేదు. తమ పాలన సజావుగా చేయడానికి అప్పటికే.. హిందూ-ముస్లింల పేరుతో దేశ ప్రజలను విడదీశారు ఆంగ్లేయులు. రెండు మతాలను రెచ్చగొట్టారు. ఆ ఫలితం.. స్వాతంత్రం ప్రకటించే నాటికి దారుణంగా పెరిగిపోయింది. మతాల పేరుతు చంపుకునే స్థాయికి వచ్చేశారు భారతీయులు. దీంతో.. భారత్ లో కలిసి ఉండలేమని, తమకు ప్రత్యేక దేశం కావాలని మెజారిటీ ముస్లింలు డిమాండ్ చేశారు. ఫలితంగా.. అనివార్యంగా దేశాన్ని విభజించాల్సి వచ్చింది.
మరి, విభజన ఎవరు చేపట్టాలి? ఎలా చేపట్టాలి? అన్నప్పుడు.. మధ్యేమార్గంగా బ్రిటన్ కు చెందిన ప్రముఖ లాయర్ సర్ సైరిల్ రాడ్ క్లిఫ్ ను ఇండియా రప్పించారు ఆంగ్లేయులు. ఈయనకు ఇద్దరు భారత న్యాయవాదులను, ఇద్దరు పాకిస్తాన్ న్యాయవాదులను సహాయకులుగా ఇచ్చారు. రెండు దేశాల మధ్య విభజన రేఖ గీయడానికి 1947 జూలై 8న ఢిల్లీలో అడుగు పెట్టారు రాడ్ క్లిఫ్. 1934లో జారీచేసిన గెజిట్ ఆధారంగా రాడ్ క్లిఫ్ రెండు దేశాల మధ్య సరిహద్దులు గీశారు.
అయితే.. దేశ విభజన అంటే.. మేజర్ గా ఇటు పంజాబ్ రాష్ట్రంలో, అటు బెంగాల్లో రాష్ట్రంలోనే జరిగింది. పంజాబ్ పైన ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ గా ఉంది. ఇటు బెంగాల్ పైన ఉన్నది బంగ్లాదేశ్ గా ఉన్నది. బంగ్లాదేశ్ తొలుత తూర్పు పాకిస్తాన్ గా ఉన్నది. ఆ తర్వాత పాక్ నుంచి విడిపోయి సొంత దేశంగా ఏర్పడింది.
ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే.. అప్పటి వరకు భారత్ గురించి రాడ్ క్లిఫ్ కు ఏమీ తెలియదు. ఇంకా చెప్పాలంటే.. పంజాబ్, బెంగాల్ ఎక్కడున్నాయో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి చేతుల్లో విభజన బాధ్యత పెట్టింది బ్రిటీష్ సర్కారు. ఇదేంటని అడిగితే.. ఆయనకు భారత్ తో సంబంధాలు లేవు కాబట్టే.. విభజన పక్షపాతం లేకుండా చేస్తారనే సూత్రం చెప్పారు ఆంగ్లేయులు.
ఆ విధంగా.. జులై 8 నుంచి.. ఆగస్టు 12లోపు కేవలం ఐదు వారాల్లో విభజన రేఖను పూర్తి చేశారు రాడ్ క్లిఫ్. స్వాతంత్రం ప్రకటించిన రెండు రోజుల తర్వాత.. అంటే 1947 ఆగస్టు 17న రెండు దేశాల మధ్య పరిహద్దులను ప్రకటించారు. అయితే.. విభజన సరిగా సరిగలేదని రెండు దేశాలకు చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో హిందూ-ముస్లిం మతాల మధ్య అల్లర్లు చెలరేగి లక్షలాది మంది చనిపోయారు. ధన, మాన ప్రాణాలు దోపిడీకి గురయ్యాయి.
ఈ విషయం తెలిసిన రాడ్ క్లిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కేవలం ఐదు వారాలు మాత్రమే సమయం ఇచ్చారని, అందువల్ల సరిగా విభజించలేకపోయానని చెప్పారు. కనీసం మూడేళ్ల సమయం ఇచ్చి ఉంటే.. మరింత మెరుగ్గా విభజించేందుకు ప్రయత్నించే వాడినని చెప్పారు. పాకిస్తాన్ లోని లాహోర్ ను తొలుత భారత్ కు కేటాయించానని, అయితే.. ఆ దేశంలో పెద్ద పట్టణం లేదన్న కారణంతో.. అటు కేటాయించాల్సి వచ్చిందని 1976లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాడ్ క్లిఫ్. పట్టణాలు, ఆస్తులు, అంతస్తులు మొదలు.. చివరకు బల్లాలు, కుర్చీలు, పుస్తకాలు కూడా.. పంచుకునే సమయంలో ఎన్నో గొడవలు చెలరేగాయి. ఆ విధంగా.. దేశ విభజన అనేది అతిపెద్ద చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.