India- Qatar: ఖతార్ నుంచి “ఆ ఎనిమిది మంది” విడుదల వెనుక పెద్ద కథ

డిసెంబర్ 1 2023న దుబాయ్ లో CoP28 సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఖతార్ దేశం నుంచి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

Written By: Suresh, Updated On : February 13, 2024 6:31 pm
Follow us on

India- Qatar: గూడచర్యం నెరుపుతున్నారని ఖతార్ దేశం భారత నావిక దళానికి చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. స్థానిక కోర్టు రెండు, మూడు విచారణల అనంతరం వారికి మరణశిక్ష విధించింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం రంగంలోకి దిగడంతో మరణశిక్షను రద్దు చేసింది. కానీ వారిని స్వదేశానికి తీసుకురావాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్లాన్. మరి దానికోసం ఏం చేయాలి? నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యల వల్ల ఖతార్ దేశం మనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆ దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు నిరసన వ్యక్తం చేసింది. ఆ సంఘటన వల్ల దౌత్యపరంగా ఆ దేశంతో మన దేశానికి సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అంతు పట్టలేదు. మరోవైపు ఖతార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తమ వారిని కాపాడాలని ఇక్కడున్న బంధువులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వినతుల మీద వినతులు సమర్పిస్తున్నారు. అయితే వారి విడుదలకు సంబంధించి నరేంద్ర మోడీ తీసుకున్న ఒక నిర్ణయం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పూర్తిగా మార్చేసింది.

డిసెంబర్ 1 2023న దుబాయ్ లో CoP28 సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఖతార్ దేశం నుంచి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖాతార్ షేక్ తమీమ్, నరేంద్ర మోడీ కలుసుకున్నారు. ఆ సమయంలో భారత నౌక దళ మాజీ అధికారుల ఉరిశిక్ష ప్రస్తావన వారి మధ్య వచ్చింది. ఆ సమయంలో నరేంద్ర మోడీ ప్రత్యేక విజ్ఞాపన మేరకు ఖాతార్ షేక్ తమీమ్ న్యాయపరంగా మీకు వెసలు బాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ను రంగంలోకి దింపారు. ఆయన పలుమార్లు ఖతార్ కు పర్యటనలు జరిపారు. ఆ 8 మంది భారత పౌరులను బయటికి తీసుకొచ్చేందుకు న్యాయపరంగా అన్ని మార్గాలను అన్వేషించారు.. అవి అలా జరుగుతుండగానే ఖతార్ దేశంతో వర్తక మార్గాన్ని ఎంచుకున్నారు. వాస్తవానికి దేశాల మధ్య వాణిజ్యమనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ద్రవీకృత సహజవాయువు సరఫరా కోసం భారత్ ఖతార్ పై ఆధారపడుతుంది. ఇదే వారి విడుదల లో కీలకపాత్ర పోషించింది.

గూడచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎనిమిది మంది విడుదలకు ముందు ప్రభుత్వం 2028 నుంచి 2048 వరకు ఖతార్ నుంచి ద్రవికృత సహజవాయువు సరఫరా కోసం 20 సంవత్సరాల పాటు ఒప్పందంపై సంతకం చేసింది. ఖతార్ దేశానికి చెందిన ఖతార్ ఎనర్జీ, భారతదేశానికి చెందిన పెట్రో నెట్ సంస్థలు ఈ ఒప్పందంపై ఫిబ్రవరిలో సంతకం చేశాయి. అంతకుముందు ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధంలో కొన్ని పరిణామాలలో ఖతార్ కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు బందీలుగా ఉంచిన ఇజ్రాయిల్ విడుదలలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈ యుద్ధంలో పరిస్థితులకు అనుగుణంగా భారత దేశం వ్యవహరించింది. ముందుగా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేసినప్పుడు.. ఇజ్రాయిల్ దేశానికి భారత్ సంఘీభావం తెలిపింది. పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్నప్పుడు ఐక్యరాజ్యసమితిలో కాల్పులు విరమించుకోవాలని కోరింది. . వ్యాపార ఒప్పందాలు, న్యాయపరంగా వ్యవహరించిన తీరు.. పాలస్తీనా, ఇజ్రాయిల్ యుద్ధంలో వేసిన ఎత్తుగడలు.. ఖతార్ ప్రభుత్వాన్ని ఆలోచింపచేసాయి. ఫలితంగా భారత నావికాదళ మాజీ అధికారుల విడుదలకు మార్గం సుగమం అయింది.

ఖతార్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జైలు నుంచి అక్కడి అధికారులు వారిని విడుదల చేశారు. ప్రత్యేక విమానం ద్వారా సోమవారం ఉదయం వారు ఖతార్ ఢిల్లీ చేరుకున్నారు.. 8 మంది నౌకాదళ మాజీ అధికారులకు గానూ ఏడుగురు ఇండియాకు చేరుకున్నారు. ఇందులో ఒకరు వైజాగ్ వాసి. ఎనిమిది మందిలో ఒకరైన పూర్ణేందు తివారి దహ్రా గ్లోబల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఖతార్ లోనే ఉన్నారు . ఇంకా కొన్ని న్యాయ సంబంధమైన సంప్రదింపుల తర్వాత ఆయన కూడా తిరిగి ఇండియాకు వస్తారని భారత దౌత్యాధికారులు తెలిపారు.

కాగా నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు వల్లే ఆ ఎనిమిది మంది భారత పౌరులు ఖతార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఒక దేశంతో మరొక దేశం నెరిపే సంబంధాల ఆధారంగానే దౌత్య విధానం ఆధారపడి ఉంటుంది. అప్పట్లో బీజేపీ నాయకురాలు నూపూర్ శర్మ ముస్లిం ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల ఖతార్ దేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయినప్పటికీ మోదీ తన చాకచక్యంతో దౌత్య సంబంధాన్ని కాపాడాడు. ఇరుదేశాల మధ్య వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. ఫలితంగా నాడు నిరసన తెలిపిన ఖతార్..నేడు భారతదేశానికి వ్యాపార భాగస్వామి అయిపోయింది. అంతేకాదు భారత పౌరులను ఎటువంటి షరతులు విధించకుండా జైలు నుంచి విడుదల చేసింది. అందుకే అంటారు బలమైన నాయకుడు చేతిలో దేశం ఎప్పుడైనా బలంగా ఉంటుందని..