Homeఆంధ్రప్రదేశ్‌Konaseema District : ‘కోనసీమ’ ఎందుకు అంటుకుంది? ఈ గొడవలకు అసలు కారణం ఏంటి?

Konaseema District : ‘కోనసీమ’ ఎందుకు అంటుకుంది? ఈ గొడవలకు అసలు కారణం ఏంటి?

Konaseema District : ‘కోనసీమ’ అంటుకుంది.. ఆంధ్రా పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది పచ్చటి కోనసీమ. ఆ పేరు ఎప్పటి నుంచో ఒక బ్రాండ్ గా మారింది. ఆ అందాలన్నీ అరవిరిసి ప్రపంచవ్యాప్తంగా కోనసీమకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. అంతటి అందాల కోనసీమ జిల్లాగా మారడాన్ని అందరూ హర్షించారు. కానీ ఇప్పుడొక వర్గం మాత్రం జిల్లా పేరు మార్చగానే భగ్గుమంది. ఏకంగా మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టింది. ఆయన దళిత సామాజికవర్గానికి చెందిన మంత్రి కావడం.. ఆయన సూచనతోనే ‘కోనసీమ’ జిల్లా ‘అంబేద్కర్ కోనసీమ’ జిల్లాగా మారిందని ఆందోళనకారులు మంత్రి ఇంటిపై దాడి చేశారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలోని ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేసి ఇంటికే నిప్పటించారు. దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు అక్కడి నుంచి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే పరిస్థితి దారుణంగా మారింది..

-అంబేద్కర్ పేరు పెట్టడమే వివాదానికి కారణం
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన జరిగి నెలన్నరకు కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో కోనసీమ భగ్గుమంది. ఇదే వివాదానికి అసలు కారణమైంది. ముందుగా ‘కోనసీమ’ పెట్టి ఆతర్వాత ‘అంబేద్కర్ కోనసీమ’గా మార్చడంతో ఒక వర్గం వారు ఇది విజయంగా భావించి సంబరాలు చేయడం.. మిగతా వర్గాన్ని రెచ్చగొట్టినట్టైంది. అదే వివాదానికి అసలు కారణమైంది. కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో పలువురు బీసీలు, రాజులు, కాపు యువకులు కలిసి అమలాపురంలో ఆందోళనకు దిగారు. ‘కోనసీమ జిల్లా’ ముందు అంబేద్కర్ పేరును తీసేయాలని నినాదాలతో హోరెత్తించారు. అడ్డుకున్న పోలీసులపైకి రాళ్లతో దాడి చేశారు.దీంతో పలువురు పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి. మంత్రి విశ్వరూప్ ఇంటిని తగులబెట్టేశారు.

-కుల రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారా?
దేశంలో రిజర్వేషన్లకు ఆద్యుడు, బడుగు, బలహీనవర్గాలు, దళితులకు ఆశాదీపంగా అంబేద్కర్ ఉన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఇప్పుడు మనం రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం. దళిత సామాజికవర్గానికి ఆరాధ్యుడుగా అంబేద్కర్ మారిపోయారు. ప్రతి ఒక్కరూ ఆయనను తలుచుకుంటూ జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాలు అంబేద్కర్ కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పలు పథకాలు ప్రవేశపెట్టాయి. అయితే కొందరు మాత్రం దళిత వ్యతిరేక స్టాండ్ తీసుకొని కుల రాజకీయాలు ఎగదోయడం వల్లే ‘కోనసీమ’ ఆందోళనకు నాంది పలికిందని అంటున్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి ఓ వర్గం నుంచి పెద్ద ఎత్తున వినతులు వెళ్లాయి. ఇక దళిత సామాజికవర్గానికి చెందిన మంత్రులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో ప్రభుత్వం ‘అంబేద్కర్ కోనసీమ’గా పేరు మార్చాయి. అది ఇప్పుడు దళితేతరుల ఆగ్రహానికి కారణమైంది. కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కొందరు ఈ అగ్గిని రాజేశారు. కొందరు యువకులు అంబేద్కర్ పేరు పెట్టవద్దని ఆందోళనకు దిగారు. దీనికి బీసీలు, రాజులు, కాపులు ఏకం కావడంతో ఈ ఆందోళన పెచ్చరిల్లింది. అంబేద్కర్ ను కేవలం దళిత పక్షపాతిగానే చూస్తూ మిగత వర్గాల వారు భావించడం.. రెచ్చగొట్టడం వల్లే ఈ ఆందోళన చెలరేగిందని తెలిసింది.

-కోనసీమకు అంబేద్కర్ పేరు వద్దంటున్న మిగిలిన వర్గాలు
కోనసీమ అంటే పచ్చని ప్రకృతి రమణీయతకు మారుపేరు అని బీసీలు, కాపులు, రాజులు సహా దళితేతరులు అంటున్నారు. దాన్ని కూడా కులం కోణంలో మార్చి పేరు మార్చడాన్ని వారు తప్పుపడుతున్నారు. అంబేద్కర్ ను రాజ్యాంగ నిర్మాతగా గౌరవిస్తామని.. కానీ తమ కోనసీమకు ఆ పేరు వద్దంటున్నారు. ఇదే వివాదానికి ఆజ్యంపోసింది. ఇక అమలాపురం ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రబలంగా మెజార్టీగా ఉన్న దళితులు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం కాస్త ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఫైట్ కు దారితీసింది.

-వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయంతోనే సెగలు.. పొగలా?
అధికార వైసీపీ కోనసీమ జిల్లాను అలాగే ఉంచితే ఇంతటి ఉద్రిక్తతలు వచ్చేవి కావని మేధావులు అభిప్రాయపడుతున్నారు. దాన్ని పేరు మార్చడంతోనే మిగతా వర్గాలు ఆందోళనకు దారితీసిందంటున్నారు. వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ‘కోనసీమ’ను వాడుకోవడంపై మిగతా వర్గాలు భగ్గుమంటున్నాయి. దాన్ని ఒకవర్గం వారు విజయంగా పండుగ చేయడం మరో వర్గం పుండుమీద కారం చల్లినట్టైంది. ముఖ్యంగా ఓ వర్గం ప్రజలు స్వచ్ఛందంగా ఈ పేరును వ్యతిరేకిస్తూ రోడ్డెక్కడం.. మంత్రి ఇంటిని తగులబెట్టడంతో ఈ గొడవ పెద్దదైంది. ఈ గొడవకు ప్రతిపక్షాలు, ప్రత్యర్థి పార్టీల ప్రమేయం ఏమీ లేదని అక్కడి వారు చెబుతున్నారు. స్వచ్ఛందంగానే మిగిలిన దళితేతర యువకులు, ప్రజలు ముందుకొచ్చి ఈ ఆందోళన నిర్వహిస్తున్నారని అంటున్నారు.

-దళిత, దళితేతరుల మధ్య వైషమ్యాలు..
ఉత్తర భారతంలో ఇప్పటికీ దళితులు, దళితేతరుల మధ్య పొసగని కుల రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రాజకీయాలు ఏపీలోనూ దాపురించినట్టే ‘కోనసీమ’ జిల్లా వివాదం చూస్తే అర్థమవుతోంది. ఉత్తర భారతంలో దళితులను అగ్రవర్ణాలు అణిచివేయడం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఏపీలో ప్రబలంగా ఉన్న దళిత సామాజికవర్గం ‘కోనసీమ జిల్లా’ విషయంలో అప్పర్ హ్యాండ్ సాధించడాన్ని ఇక్కడి మిగిలిన వర్గాలు తట్టుకోలేకపోయాయి. ఆగ్రహంతో రోడ్డెక్కాయి. విధ్వంసాన్ని సృష్టించాయి. ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. సున్నితమైన, తేనెతెట్టులాంటి ‘కులాభిమానమే’ కోనసీమ జిల్లా వివాదం రగలడానికి ప్రధాన కారణమైంది. ఒక వర్గం వారు దీన్ని విజయంగా అభివర్ణించుకోవడం.. మిగిలిన వర్గాలు ఇది తమ అపజయంగా అన్వయించుకోవడమే ఈ వివాదానికి కారణమైంది. అదే ‘కోనసీమ’ అంటుకోవడానికి ఆజ్యం పోసింది.

ఇప్పటికైనా జిల్లాలు, వాటి పేర్ల విషయంలో రాజకీయాలను,కులాలను తీసుకురాకుండా వాటి ప్రాంతాల ఆధారంగా పేర్లు పెడితేనే ఈ సమస్యకు పరిష్కారం దక్కుతుంది. ఎవరినో సంతృప్తి పరచడానికి.. ఓటు బ్యాంకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఆగ్రహ‘జ్వాలాలే’ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Recommended videos

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular