https://oktelugu.com/

Producer Anil Sunkara : నిండా ముంచేశారు…. నిర్మాత అనిల్ సుంకర దారేది!

. ట్రెండ్ చూస్తుంటే భోళా శంకర్ రూ. 50 కోట్ల షేర్ వసూలు చేయడం కూడా కష్టమే. ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలతో అనిల్ సుంకర పెద్ద మొత్తంలో నష్టపోనున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్...

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2023 / 08:45 AM IST
    Follow us on

    Bhola Shankar – Anil Sunkara : రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో ఆ నిర్మాత మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇకపై సినిమాలు చేస్తారా లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. అనిల్ సుంకర పరిశ్రమకు వచ్చి పదేళ్లు దాటిపోయింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పలు హిట్ సినిమాలు తీశారు. దూకుడు, లెజెండ్, సరిలేరు నీకెవ్వరు వంటి భారీ బ్లాక్ బస్టర్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నుండి బయటకు వచ్చాక ఏ కే ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బ్యానర్ మీదే సినిమాలు నిర్మిస్తున్నారు.

    స్వతహాగా వ్యాపారవేత్త అయిన అనిల్ సుంకర సినిమాపై ఫ్యాషన్ తో నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. ఈయన దర్శకుడు కూడాను. యాక్షన్ త్రీడీ అనే కామెడీ మూవీకి దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్. దాంతో మరలా దర్శకత్వం వైపు పోలేదు. జయాపజయాలతో నెట్టుకొస్తున్న బ్యానర్ ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. నాలుగు నెలల వ్యవధిలో రెండు సినిమాలు దెబ్బతీశాయి.

    సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ దారుణ పరాజయం చూసింది. కనీసం రూ. 50 కోట్ల మార్కెట్ లేని అఖిల్ తో రూ. 70 కోట్లు బడ్జెట్ పెట్టి ఏజెంట్ తీశారు. అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాలేదు. బడ్జెట్ తడిసి మోపెడు అవుతుండటంతో హడావుడిగా పూర్తి చేసి వదిలారు. మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తో నడిచిన ఏజెంట్ కి కనీస వసూళ్లు రాలేదు. ఓటీటీతో ఎంతో కొంత వస్తుందనుకుంటే,అది కూడా లేదు. నెలలు గడుస్తున్నా ఏజెంట్ ఓటీటీకి నోచుకోలేదు.

    తాజాగా భోళా శంకర్ కోట్లలో నష్టం మిగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి. రూ. 80 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన భోళా శంకర్ ఫస్ట్ డే కేవలం రూ. 15 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. సెకండ్ డే వసూళ్లు మరింత డ్రాప్ అయ్యాయని సమాచారం. భోళా శంకర్ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 100 కోట్లు. ఓటీటీ డీల్ కూడా ఇంకా కుదరలేదట. సినిమా ఫలితం చూశాక ఓటీటీ సంస్థలు మంచి ధర ఇచ్చేందుకు ముందుకు రావు. ట్రెండ్ చూస్తుంటే భోళా శంకర్ రూ. 50 కోట్ల షేర్ వసూలు చేయడం కూడా కష్టమే. ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలతో అనిల్ సుంకర పెద్ద మొత్తంలో నష్టపోనున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్…