https://oktelugu.com/

Priyanka Gandhi: ఇందిరమ్మలా ప్రియాంక.. నాయనమ్మను తలపించే ప్రసంగం. జనాల దృష్టిలో పాత జ్ఞాపకాలు!

చాలా కాలంగా ప్రియాంకను రాజకీయ రంగప్రవేశం చేయించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నా.. కాంగ్రెస్‌ పగ్గాలు రాహుల్‌ చేతికి వచ్చాక, మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ నేతృత్వంలో విజయాలు సాధించిన తరువాతే ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 19, 2023 / 03:55 PM IST

    Priyanka Gandhi

    Follow us on

    Priyanka Gandhi: రూపురేఖలు.. ప్రసంగం.. జనాలతో మమేకం అవుతున్న తీరు.. భద్రతను సైతం పక్కన పెట్టి ప్రజల దరి చేరేందుకు చూపుతున్న ఆసక్తి… ఇందిరాగాంధీని తలపిస్తోంది కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ. చీరకట్టు మొదలుకొని పెద్దలకు నివాళ్లర్పించి ప్రచారాన్ని ప్రారంభించడం వరకూ ఆమె ప్రతీఅడుగూ నాయనమ్మ ఇందిరమ్మను తలపిస్తోందంటున్నారు ఆమె సభలకు హాజరైన ప్రముఖులు. రాజకీయవేత్తగా ప్రియాంక వాద్రా పరిణతి చెందడానికి ఇంకా సమయముందని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నా.. రాజకీయాల్లో ఆమెలోని సహజసిద్ధ నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ గెలపు కోసం పక్షం క్రితం బస్సుయాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రియాంక గాంధీ తర్వాత ఉత్తరాధి రాష్ట్రాలు అయిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఎక్కువగా ప్రచారం చేశారు. ప్రస్తుతం తెలంగాణపై దృష్టిపెట్టిన ప్రియాంక.. ఆదివారం నిర్మల్‌ జిల్లా ఖానాపూర్, ఆసిఫాబాద్‌లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలకు వచ్చిన జనం ప్రియాంకలో ఆమె నాయనమ్మ ఇందిరాగాంధీని చూసుకుని పాత జ్ఞాపకాలను గుర్త చేసుకుంటున్నారు.

    మూడేళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోలకి..
    చాలా కాలంగా ప్రియాంకను రాజకీయ రంగప్రవేశం చేయించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నా.. కాంగ్రెస్‌ పగ్గాలు రాహుల్‌ చేతికి వచ్చాక, మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ నేతృత్వంలో విజయాలు సాధించిన తరువాతే ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోవడం ఆమెకు రాజకీయాల్లో ఉన్న సానుకూలతను ప్రతిబింబిస్తున్నాయి. ప్రియాంక మాటలు ఆమె పరిణతి వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి.

    జనంతో మమేకం..
    ఎన్నికల ప్రచారానికి నిర్దేశించిన టైమ్‌ షెడ్యూల్‌ని ప్రియాంక వాద్రా ఎప్పుడూ పాటించలేదు. నిజానికి ఆమె జనంలోకి వెళ్లాక ఆమెను పట్టుకోవడం గగనమే. జనం మధ్యలోంచి దూసుకెళుతోన్న కారుని ఆమె ఏ క్షణంలోనైనా ఆపేసి కారు దిగి రోడ్డువారగా బారులుతీరిన జనంతో కరచాలనం చేస్తుంది. భద్రతాసిబ్బంది వారిస్తున్నా వినకుండా జనం మధ్యలోకి వెళ్లిపోతుంది. నిజానికి రాహుల్‌ కన్నా ప్రియాంక ఎంతమంది జనం మధ్యలో ఉన్నా ఎలాంటి ఇబ్బందీ లేకుండా కలగలిసిపోగలదు. అంతేకాదు. తన కారులోనే పార్టీ కార్యకర్తలను ఎక్కించుకుని ఒక నాయకురాలి సరసన కూర్చునే అవకాశంతో పరవశించిపోయిన వారి ముఖాల్లో ఆనందాన్ని ఆస్వాదించనూగలదు.

    ఇందిరమ్మ శైలిలో..
    ఎన్నికల ప్రచారంలో సైతం నాయనమ్మ చీరలనే ప్రియాంక కట్టుకుంటున్నారు. అయితే ఇందిరాగాంధీ కన్నా ప్రియాంక కాస్త పొడవు కావడంతో ఇందిరాగాంధీ కట్టిన చీరలు రెండింటిని కలిపి కుట్టించి ప్రియాంకా ధరిస్తోంది. ఎటువంటి దర్యాప్తులకూ భయపడనని స్పష్టం చేస్తోన్న ప్రియాంకా వాద్రా తను ఎక్కడున్నా పెదవులపై చిరునవ్వుని చెరగనివ్వకపోవడం ఆమె స్థైర్యాన్ని చెప్పకనే చెపుతోంది.

    అడ్డంకులు అధిగమిస్తూ..
    ప్రియాంకాలో ఎన్ని ప్రత్యేకతలున్నా తన దారిలో ఎదురైన అన్ని అడ్డంకులనూ దాటుకొని విజయతీరాలను చేరుకోవడం నల్లేరు మీద నడకైతే కాదు. ఇంత క్లిష్ట సమయంలో కాంగ్రెస్‌ను గట్టెక్కించడం కష్ట సాధ్యమే. దీర్ఘకాలిక ప్రణాళికతో తన ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టు కూడా ప్రియాంక కనిపిస్తోంది. ప్రియాంక ఎత్తుగడలు నాయనమ్మ ఇందిరమ్మను తలపిస్తున్నాయని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రియాంకకు ఉన్న ఛరిష్మా, కలిసిపోయే మనస్తత్వం కాంగ్రెస్‌ విజయానికి ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.

    ఖానాపూర్, ఆసిఫాబాద్‌లో సభలు..
    తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అన్న చెళ్లెలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ శ్రమిస్తున్నారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జునఖర్గే కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడం ఈసారి ఇదే తొలిసారి. గిరిజన నియోజకవర్గాలైన ఖానాపూర్, ఆసిఫాబాద్‌లో ఆదివారం నిర్వహించిన సభల్లో ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలకు వచ్చిన గిరిజనులు ప్రియాంక గాంధీలో ఇందిరమ్మను చూశారు. ఆమె మాట, నడవడిక, అభివాదం చేస్తున్న శైలి.. మాట తీరు పూర్తిగా ఇందిరమ్మలాగే ఉందని వ్యాఖ్యానించడం కనిపించింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంతో అన్నచెళ్లెలుతోపాటు ఖర్గే కృషి కాదనలేనిది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ కాంగ్రెస్‌ త్రయం ఏమేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.