Central Election Commission : మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోలేదు. స్థానిక మీడియాకు దాని గురించి తెలవదు. కాస్తో కూస్తో సోషల్ మీడియా నయం. అదే రకరకాల విశ్లేషణలు చేసింది. ఏం జరిగి ఉంటుంది? ఎందుకు జరిగి ఉంటుంది? ఎవరు చేసి ఉంటారు? ఇప్పుడే అంత అవసరం ఏమొచ్చింది? ఇలా రకరకాల కోణాల్లో వెతికి మరి సమాచారాన్ని సేకరించింది. అలాంటి సమాచారంలో వాస్తవాలను మాత్రమే గ్రహించి ఈ కథనం రూపంలో మీకు అందిస్తున్నాం. ఇంతకీ ఆ విషయం ఏంటంటే..
పార్లమెంట్ ఎన్నికలకు ముందు..
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు అనుకోని కుదుపు ఏర్పడింది. సీఈసీ కమిషనర్ అరుణ్ గోయల్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. మిగతా సమయంలో అంటే ఇది పెద్ద విషయం కాదు. కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు.. అది కూడా ఓ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయడం.. అది కూడా మరో మూడు సంవత్సరాల పదవీకాలం ఉండగానే.. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామా చేస్తే జరిగే ప్రమాదం ఏంటి? ఎంతోమంది అధికారులు ఉంటారు కదా.. ఆయన చేసే పనిని.. ఆయన స్థానంలోకి వచ్చిన మరో అధికారి చేస్తారు అని అనుకోవచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ లో ఒక అధికారి రాజీనామా చేశాడు అంటే దాని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. దాని వెనుక రాజకీయ ఎత్తుగడలు దాగి ఉంటాయి.
స్వయం ప్రతిపత్తి గల సంస్థ
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దేశంలో అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడం ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధి. దీనిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మరో ఇద్దరు కమిషనర్లు నడిపిస్తుంటారు.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను అపాయింట్ చేసే అథారిటీ కేవలం ఒక కమిటీకి మాత్రమే ఉంటుంది. ఆ కమిటీలో ప్రధాని, లోక్ సభ లో ప్రధాన ప్రతిపక్ష నాయకులు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఈ కమిటీ ఏకాభిప్రాయంగా నియమించిన వ్యక్తులే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లుగా పని చేస్తారు. ఇన్నాళ్లపాటు ఈ కమిటీలో పై ముగ్గురు సభ్యులు కీలకంగా ఉండేవారు. అయితే గత ఏడాది కీలక పరిణామం చోటుచేసుకుంది.
ముగ్గురు సభ్యుల కమిటీ
ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి ముగ్గురు సభ్యుల కమిటీలో ప్రధాన న్యాయమూర్తిని పక్కకు తప్పించి.. ఆ స్థానంలో కేంద్ర మంత్రిని తీసుకోవాలని ఒక బిల్లు తెరపైకి తీసుకొచ్చారు. అనేక వివాదాలు, విమర్శల మధ్య ఆ బిల్లు ఆమోదం పొందింది. ఆ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఇక కొత్త చట్ట ప్రకారం ప్రధానమంత్రి, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు, కేంద్రమంత్రి సీఈసీ, ఇతర కమిషనర్లను నియమించే అధికారం పొందారు. ఈ ప్రకారం పొలిటికల్ అడుగులకు అనుగుణంగానే సీఈసీ, ఇతర కమిషనర్లను నియమించుకునే అధికారం రాజకీయ పార్టీలకు దక్కింది.
రాజీవ్ కుమార్ మాత్రమే దిక్కయ్యారు
ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ కొనసాగుతున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరి ఎలక్షన్ కమిషనర్లు పనిచేస్తున్నారు. కాగా, గత నెలలో ఎలక్షన్ కమిషనర్ అనుప్ పాండే పదవి విరమణ చేశారు. అది మర్చిపోకముందే మరో కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి.. అది కూడా మూడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే రాజీనామా చేశారు. అటు ఒక కమిషనర్ పదవి విరమణ చేయటం, ఇటు మరో కమిషనర్ పదవికి రాజీనామా చేయడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కేవలం సీఈవో రాజీవ్ కుమార్ మాత్రమే దిక్కయ్యారు.
కొత్తగా నియమించాలంటే..
ఇప్పుడు కొత్తగా కమిషనర్లను నియమించాలంటే ఆ కమిటీ వారిని ఎంపిక చేయాలి. ఇక్కడ అధికార పార్టీకి ఎంతో వెసలుబాటు ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అంగీకరించక పోయినప్పటికీ ప్రధాని, కేంద్రమంత్రి ఓట్లతో కమిషనర్లను క్షమించుకోవచ్చు. ఒకవేళ ఆ ఇద్దరు కమిషనర్లను ఇప్పటికిప్పుడు నియమించిన పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల భారం మొత్తం ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ మీద పడుతుంది.. వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ముగ్గురి ఆధ్వర్యంలో నడవాలి. మొదటినుంచి జరుగుతోంది కూడా ఇదే. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అయినంత మాత్రాన ప్రత్యేక అధికారాలు ఉండవు. ఆయనతోపాటు కమిషనర్లకు కూడా ఒకే రకమైన అధికారాలు ఉంటాయి. కాకపోతే ఆ ఇద్దరు కమిషనర్లను సీఈసీ పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రస్తుత పరిణామాలు చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక్కరి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికిప్పుడు ఇద్దరు కమిషనర్లను నియమించే అవకాశం లేదు. ఆ నిర్ణయాన్ని మోడీ ఇప్పటికిప్పుడు తీసుకోలేడు. ఒకవేళ కొత్త కమిషనర్లను తీసుకునే అవకాశం ఉంటే.. ఎవరిని తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..సో పిల్లి మెడకు ఢిల్లీ గంటలు కట్టింది. కాకపోతే ఆ గంటలు ఎందుకు కట్టిందనేది ముంజేతి కంకణమే. అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత.