https://oktelugu.com/

Narendra Modi : నన్ను క్షమించండి.. ప్రధాని నరేంద్ర మోడీ

జిడిపి 8 శాతానికి మించుతుందనే పలు అంతర్జాతీయ సంస్థలు లెక్కలు కడుతున్నాయని.. అదంతా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన సుస్థిర ప్రభుత్వం చలవ ఫలితమని మోడీ ప్రకటించారు.. కాగా మోడీని చూసేందుకు భారీగా జనం తరలి రావడంతో దన్ బాద్ ప్రాంతం కిక్కిరిసిపోయింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2024 / 08:33 PM IST
    Follow us on

    Narendra Modi : త్వరలో పార్లమెంట్ ఎన్నికలకు ప్రకటన వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపన చేస్తూనే.. పూర్తయిన పనులను ప్రారంభిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులను కూడా ప్రకటిస్తున్నారు. దీంతో అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పేరు మార్మోగిపోతోంది. సరిగ్గా పక్షం రోజుల క్రితం అరబ్ దేశాల పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి.. ఆ తర్వాత ఇండియాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇటీవల సుదర్శన్ సేతు ను ప్రారంభించిన ప్రధాని.. తమిళనాడులో బుధ, గురువారాల్లో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

    తమిళనాడు పర్యటన ముగించుకున్న తర్వాత ప్రధాని శుక్రవారం ఝార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించారు. ఆ రాష్ట్రంలోని దన్ బాద్ అనే ప్రాంతంలో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ఆయనను చూసేందుకు భారీగా బిజెపి కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. అశేష జనవాహిని హాజరు కావడంతో నరేంద్ర మోడీ వారిని ఉద్దేశించి మాట్లాడారు. “నన్ను చూసేందుకు వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. కాకపోతే మీలో ఐదు శాతం మంది మాత్రమే నీడలో ఉన్నారు. మిగతా 95 శాతం మంది ఎండలో నిలుచున్నారు. ఇది చూసేందుకు నాకు బాధగా ఉంది. అందుకే మీరంతా నన్ను క్షమించాలి” అని ప్రధాని అన్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగ నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ యువతి స్తంభం పైకి ఎక్కింది. స్పందించిన ప్రధానమంత్రి ఆమెను కిందికి దిగాలని కోరారు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అయింది.

    జార్ఖండ్లో శుక్రవారం పలు ప్రాంతాల్లో నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి ప్రతిబంధకంగా ప్రతిపక్షాల తీరు ఉందని.. వారు తమ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ఇండియా కూటమి ఏర్పాటు చేశారని.. కానీ అందులో ఎవరుంటారో, ఎవరు వెళ్తారు తెలియని పరిస్థితి నెలకొందని ప్రధాని ఎద్దేవా చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని.. గడిచిన 10 సంవత్సరాలలో అది నిరూపితమైందని ప్రధాని ప్రకటించారు. జిడిపి 8 శాతానికి మించుతుందనే పలు అంతర్జాతీయ సంస్థలు లెక్కలు కడుతున్నాయని.. అదంతా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన సుస్థిర ప్రభుత్వం చలవ ఫలితమని మోడీ ప్రకటించారు.. కాగా మోడీని చూసేందుకు భారీగా జనం తరలి రావడంతో దన్ బాద్ ప్రాంతం కిక్కిరిసిపోయింది.