PM Modi: మోడీ స్టైలే వేరు.. ఈ వయసులో నీట మునిగి పూజలు

సుదర్శన్ సేతును ప్రత్యేకమైన డిజైన్ లో రూపొందించారు. ఈ వంతెనకు ఇరువైపులా పుట్ పాత్ లు నిర్మించారు. కాలిబాటకు ఆనుకొని ఉన్న గోడలపై గీతా పద్యాలు రాసి, శ్రీకృష్ణుడి చిత్రాలు రూపొందించారు.

Written By: Suresh, Updated On : February 25, 2024 3:12 pm
Follow us on

PM Modi: సరిగ్గా నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ ప్రాంతంలో పర్యటించారు.. అక్కడి సముద్ర జలాల్లో స్కూబా డైవింగ్ చేశారు. “మీ తదుపరి ప్రయాణ జాబితాలలో ఈ ప్రాంతాన్ని కూడా చేర్చుకోండి” అని భారతీయులకు ట్విట్టర్ ఎక్స్ ద్వారా పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వెటకారంగా స్పందించారు. తర్వాత ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇప్పుడు మళ్లీ ప్రధానమంత్రి నీట మునిగారు. అది కూడా శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ద్వారక నగరంలో.. అక్కడ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతంగా పర్యటించారు. వేల కోట్ల విలువైన అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నీటిలో మునిగి … ఆ జలాలలో ద్వారకా నగరానికి పూజలు చేశారు. నరేంద్ర మోడీ తాను నీటిలో మునిగి పూజలు చేసిన ఫోటోలను ట్విట్టర్ ఎక్స్ ద్వారా పంచుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకను కలుపుతూ ప్రభుత్వం తీగల వంతెన నిర్మించింది. దీని పొడవు దాదాపు రెండున్నర కిలోమీటర్లు. దీనిని దేశంలోనే అతిపెద్ద తీగల వంతెనగా చెబుతున్నారు.. దీనికి సుదర్శన్ సేతు అని నామకరణం చేశారు. దీనిని ఆదివారం ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంతెన పై కలియతిరిగారు. వంతెన పైనుంచి నీటిలో ఉన్న బోట్లలో, పడవల్లో ఉన్న ప్రజలకు అభివాదం చేశారు.

ఈ వంతెన ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి ద్వారా ఆలయాన్ని సందర్శించారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఎక్స్ లో ” నీటిలో మునిగి ఉన్న ద్వారక నగరంలో పూజలు చేయడం నాకు దక్కిన అత్యంత దివ్యమైన అనుభవం. నేను ఆధ్యాత్మిక వైభవం, కాలాతీత భక్తితో పురాతన యుగానికి అనుసంధానమయ్యాను. భగవాన్ శ్రీకృష్ణుడు మనందరినీ కరుణిస్తాడు. తన అనుగ్రహాన్ని మనపై ఉంచుతాడని” తన అనుభవాలు పంచుకున్నారు. ఆదివారం తన పర్యటనలో భాగంగా భేట్ ద్వారక ఆలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఆలయంలో పూజలు, దర్శనం అనంతరం ఉదయం 8: 25 నిమిషాలకు సుదర్శన్ సేతును దేశ ప్రజలకు అంకితం ఇచ్చారు. ఈ వంతెన నిర్మించక ముందు ఓఖా, భేట్ ద్వారకకు వెళ్లాలంటే పడవ మార్గమే శరణ్యం. ఈ వంతెన నిర్మాణంతో ప్రజల కష్టాలు తీరినట్టేనని కేంద్రం చెబుతోంది.

సుదర్శన్ సేతును ప్రత్యేకమైన డిజైన్ లో రూపొందించారు. ఈ వంతెనకు ఇరువైపులా పుట్ పాత్ లు నిర్మించారు. కాలిబాటకు ఆనుకొని ఉన్న గోడలపై గీతా పద్యాలు రాసి, శ్రీకృష్ణుడి చిత్రాలు రూపొందించారు..ఫుట్ పాత్ పై భాగంలో సౌర ప్యానల్స్ ఏర్పాటు చేశారు. ఇవి ఒక మెగావాట్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్.. ఫుట్ పాత్ పై ఏర్పాటుచేసిన దీపాలు వెలగడానికి ఉపయోగపడుతుంది. 2017లో ప్రధానమంత్రి ఈ వంతెనకు శంకుస్థాపన చేయగా… అప్పట్లో దీనికి సిగ్నేచర్ బ్రిడ్జి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సుదర్శన్ వంతెన గా మార్చారు. ఈ వంతెన నిర్మాణం వల్ల ద్వారక ప్రజలకు మాత్రమే కాకుండా.. లక్షద్వీప్ లో నివసించే 8,000 మందికిపైగా ప్రయోజనం కలుగుతుంది. కాగా, ఈ సుదర్శన్ సేతును కేంద్ర ప్రభుత్వం 979 కోట్లతో నిర్మించింది. దేశంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఆదివారం, సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటిస్తారు. 52,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.