PM Modi On Bharat: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న జీ20 సమావేశాలకు రాష్ట్రపతి పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో భారత్ అని ముద్రించడంతో మొదలైన దేశం పేరు మార్పు చర్చ.. తాజాగా కీలక దశకు చేరుకుంది. దేశవ్యాప్తంగా పేరు మార్పుపై చర్చ జరిగేలా చేసిన ప్రధాని నరేంద్రమోదీ.. తాజాగా ఇండియా పేరు మాప్పు తప్పదు అన్న సంకేతం ఇచ్చారు. జీ20 సదస్సులో ప్రధాని మోదీ కూర్చున్న చోట నేమ్ ప్లేట్‌పై భారత్ అని రాసుండడం ద్వారా పేరు మార్పు తప్పదని క్లారిటీ ఇచ్చారు.
సదస్సును ప్రారంభించిన మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జీ20 సదస్సుని శనివారం(సెప్టెంబర్ 9న) ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొరాకోలో భూకంప విపత్తులో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవాళ్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ కష్టకాలంలో మొరాకో దేశానికి ఎలాంటి సాయమైనా అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
నేమ్ ప్లేట్‌పై అందరి దృష్టి..
మోదీ కూర్చున్న స్థానంలో ముందు నేమ్‌ప్లేట్ ఆసక్తికరంగా మారింది. దానిపై ఇండియాకు బదులుగా భారత్ అని రాసుంది. పేరు మార్పుపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై ఆ పేరు కనిపించింది. విపక్షాలు దీనిపై ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండి పడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో భారత్ అని కనిపించడం వల్ల కేంద్రం అందుకు సిద్ధంగానే ఉందని సంకేతాలిచ్చినట్లయింది.
ప్రత్యేక సమావేశాల్లో పేరు మార్పు బిల్లు
ఈ నెలాఖరులో జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు భారతదేశానికి భారత్‌గా పేరు మార్చడానికి బిల్లు పెడతారనేందుకు నేమ్ ప్లేట్ సంకేతమని పలువురు భావిస్తున్నారు. విదేశీ ప్రతినిధుల కోసం ఉద్దేశించిన జీ20 బుక్‌లెట్‌లో కూడా ‘భారత్’ అని ముద్రించారు. ‘భారత్, ప్రజాస్వామ్యానికి తల్లి‘. ‘భారత్ అనేది దేశం యొక్క అధికారిక పేరు. ఇది 1946–48 చర్చల్లో కూడా రాజ్యాంగంలో ప్రస్తావించబడింది’ అని బుక్‌లెట్ పేర్కొంది.