Chandrababu On PK: ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. ఇండియాలో బహుళ ప్రాచుర్యం పొందింది ఈ పేరు. వృత్తి ఎన్నికల వ్యూహకర్త కాగా.. ఇటీవలే ఆయన రాజకీయ అవతారం ఎత్తారు. బీహార్ రాజకీయాల్లో ప్రవేశించారు. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే అదే పీకే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ట్రోల్ అవుతున్నారు. గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఈ ఎన్నికల్లో మాత్రం తనకు పని చేయాలని చంద్రబాబు పీకేను కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
గత ఎన్నికల ముందు వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నియమితులయ్యారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ పార్టీ కార్యకర్తల సమావేశంలోనే పీకే ను పరిచయం చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచడంలో ప్రశాంత్ కిషోర్ ది కీలక పాత్ర. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏపీ సమాజాన్ని కులాలు, మతాలు, ప్రాంతీయ వర్గాలుగా విభజించి.. జగన్ కు అధికారానికి దగ్గర చేయడంలో పీకే యాక్టివ్ రోల్ పోషించారు. అయితే ఇది టిడిపికి మింగుడు పడని విషయం. అప్పట్లో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను బీహార్ బందిపోటుగా, జగన్ అవినీతి టీంలో సభ్యుడని,ఏపీ అభివృద్ధి కాకుండా అడ్డుకునే దుర్మార్గుడుగా అభివర్ణించారు. టిడిపి కార్యకర్త నుంచి కీలక నాయకుడు వరకు అందరూ ప్రశాంత్ కిషోర్ ను ఒక శత్రువుగా చూశారు.
ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ కొద్దిరోజుల కిందట చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రత్యేక విమానంలో లోకేష్ వెంటబెట్టుకుని వచ్చి చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు మూడు గంటల పాటు వారి మధ్య చర్చ నడిచింది. అందరూ కలిసి భోజనం కూడా చేశారు. ఇది పొలిటికల్ గా సంచలనం సృష్టించింది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు వ్యూహ కర్తగా వ్యవహరిస్తారని ప్రచారం జరిగింది. అయితే కేవలం ఎన్నికల వరకు సలహాలు, సూచనలు అందిస్తారని మరో టాక్ నడిచింది. కానీ దీనిపై ఎటువంటి ప్రకటన రాలేదు. అటు చంద్రబాబు కానీ.. ఇటు ప్రశాంత్ కిషోర్ కానీ స్పందించలేదు. పీకే చంద్రబాబు వద్దకు వచ్చేసరికి వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఒక ఆందోళన మొదలైంది.
అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు పై ఒక రకమైన కామెంట్స్ చేశారు. ఓ జాతీయ మీడియా ఛానల్ కు పీకే ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ సమకాలీన రాజకీయాలపై మాట్లాడారు. ఈ క్రమంలో చంద్రబాబు నాడు చేసిన వ్యాఖ్యలను జర్నలిస్ట్ గుర్తు చేశారు. బీహార్ బందిపోటు నాయకుడు అంటూ చేసిన కామెంట్స్ పై ప్రశ్నించగా.. అదే బీహార్ బందిపోటు నాయకుడు చంద్రబాబుకు అక్కరకు వచ్చాడంటూ పీకే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ అదును చూసి చంద్రబాబును దెబ్బేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.