Maa Elections 2021: ‘మా’ ఎన్నికలు ఇప్పుడు ‘లోకల్’, నాన్ లోకల్ పైనే జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను అలా మార్చేసిన దైర్భాగ్యం కేవలం తెలుగు నటులకే దక్కింది. కోటా శ్రీనివాసరావు, రావు రమేశ్, జగపతిబాబు, సుమన్ లాంటి తెలుగు నటులు ఇప్పుడు తమిళం, మలయాళం, కన్నడలో నటిస్తున్నారు. నిజంగా నాన్ లోకల్ వాదాన్ని తెరపైకి తెస్తున్న సినీ ప్రముఖులు ఇప్పుడు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. ఈ దెబ్బకు మన తెలుగు నటులు కూడా ఇతర భాషల్లో నటించడానికి వీల్లేదు. ఈ భావనతో మన వాళ్లు కూడా ఇబ్బంది పడుతారన్న కనీస సృహ లేకుండా మాట్లాడుతున్నారు. మన తెలుగు నటులలాగా ఇతర భాషల వాళ్లు ఆలోచించడం లేదు. అందుకే తెలుగు నటులను ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. కానీ మన వాళ్లు మాత్రం ‘నాన్ లోకల్’ ఇష్యూను రాజేసి ఆ మంటల్లో చలికాచుకుంటున్నారు. నటులకు భాషతో ఏం సంబంధం అన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. కానీ ఈ సున్నితమైన అంశాన్ని తీసుకొచ్చి ‘మా’ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న వారికి దాంతో ఎంత నష్టం జరుగుతుందన్న కనీస అవగాహన లేకపోవడం మన దౌర్భాగ్యమనే చెప్పొచ్చు.

-పాజిటివ్ థింకింగ్ తో ప్రకాష్ రాజ్..
ప్రకాష్ రాజ్ ఎంతో సదుద్దేశంతో ‘మా’ ఎన్నికల బరిలో నిలిచారు. నిజానికి ఇతడు కర్ణాటకకు చెందిన నటుడు అయినా తెలుగు స్పష్టంగా నేర్చుకున్నాడు. తెలుగు నటుల కంటే కూడా బాగా మన భాష మాట్లాడగలడు. అంతేకాదు.. తెలంగాణలో రెండు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ ఫాంహౌస్ కట్టుకొని గ్రామస్థులతో కలిసిపోయి ఆ గ్రామ రూపురేఖలు మార్చేశాడు. తెలంగాణలో ఒక వ్యక్తిగా మెసులుతున్నాడు. పైగా దేశం గర్వించే గొప్ప నటుడు ప్రకాష్రాజ్. ఇన్నాళ్లు ‘మా’ బిల్డింగ్ అంటూ, కళాకారుల సాయం అంటూ వరుసగా గెలుస్తున్నా పాత సంఘం అధ్యక్షుడు ఆ హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు. ఈ క్రమంలోనే దీన్ని మార్చాలని ‘మా’ అసోసియేషన్ ఎన్నికలకు ఒక పాజిటివ్ థింకింగ్ తో ప్రకాష్ రాజ్ వచ్చాడు. అందరికీ సహాయపడేందుకు.. మా బిల్డింగ్ సహా అన్నింటిని పూర్తి చేయాలనే మంచి తలంపుతో ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో అడుగుపెట్టాడు. ఒక ప్రణాళిక రెడీ చేసుకొని మరీ టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు,నటులను కలిసి తన ఆలోచన ధోరణిని పంచుకున్నాడు. దీంతో మెగా స్టార్ చిరంజీవి , నాగబాబు, శ్రీకాంత్ లాంటి వారు ప్రకాష్ తో కలిసారు. మొదట వ్యతిరేకించిన జీవిత, హేమ, బండ్ల గణేష్ లాంటి వారు కూడా ప్రకాష్ రాజ్ సేవా గుణానికి మెచ్చి అతడితో చేరారు.‘మా’కు దిక్సూచిగా నిలవాలని ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో నిలబడ్డారు. ఇండస్ట్రీలోని ఫేస్ వాల్యూ కలిగిన వారంతా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోనే ఉన్నారు.
-నెగెటివ్ ఆలోచనతో వచ్చిన విష్ణు?
ప్రకాష్ రాజ్ బరిలో నిలవగానే సినీ ప్రముఖులు, ప్రముఖ హీరోలు, బుల్లితెర నటీనటులు అంతా ఆయన వెంట నడిచారు. మెజార్టీ సినీ ప్రముఖులంతా కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ వెంట ఉన్నారు. ఆయన కార్యవర్గంలోని వారంతా హేమాహేమీలే.. కానీ కేవలం ‘ప్రకాష్ రాజ్’ నాన్ లోకల్ అన్న నినాదంతో ఇక్కడి వాడు కాదంటూ ఒక నెగెటివ్ ప్రచారాన్ని సృష్టించి మంచు విష్ణు ఈ ఎన్నికల బరిలో నిలిచాడు. ఒక్క నాన్ లోకల్ ఇష్యూను పట్టుకొనే విష్ణు ఎన్నికల్లోకి నానా యాగీ చేస్తున్నాడు. అదే పట్టుకొని వేలాడుతున్నాడు. అంతే తప్ప తాను ‘మా’ కోసం ఇది చేస్తాను.. ఇలా పాటు పడుతాను అని ఎక్కడా చెప్పడం లేదు. ప్రణాళిక లేదు.. వ్యూహాలు లేవు.. గుడ్దెద్దు చేల్లో బడ్డట్టు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా మాత్రమే బరిలో నిలుస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
-విష్ణుకు ‘నాన్ లోకలే’ ప్రధాన ఎజెండానా?
రెండు మూడు రోజులుగా నటుడు రవిబాబు, రాజీవ్ కనకాల, సీవీఎల్ లాంటి మంచు విష్ణు తరుపున వకాల్తా పుచ్చుకొని ‘నాన్ లోకల్ ’ ఇష్యూను హైలెట్ చేస్తున్నారు. మన సంఘానికి మన వాళ్లలో ఒక్కడూ సరిపోడా? అన్న విష ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ ఒక్క ఆరోపణను మాత్రమే ప్రకాష్ పై చేస్తున్నారు. ఇక వేరే ఏ అలిగేషన్ ను కూడా ఆయనపై మోపడానికి విష్ణు వర్గానికి లేకుండాపోయింది. ఇప్పుడు ఏకంగా సినీ ఆర్టిస్టులను మా కులానికి వారికే ఓటేయాలని.. లేదంటే మీకు సినిమా అవకాశాలు ఇవ్వము అంటూ దర్శకులు బెదిరిస్తున్నట్టు ‘ఆర్ఎక్స్ 100 ’ దర్శకుడు అజయ్ భూపతి ట్వీట్ చేసి బాంబు పేల్చారు. ఇలా అవకాశాల పేరుతోనూ తమ కులపోడికి.. తెలుగోడికి ఓటు వేయాలని బెదిరిస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. ఓటేయకపోతే అసలు మీకు అవకాశాలు ఇవ్వమని బెదిరించడం దారుణమనే చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో శ్రీకాంత్, జీవిత, హేమ లాంటి వారు ఎందరో మంచి ఉద్దేశం ఇండస్ట్రీ కోసం పాటు పడేందుకు కూటమిగా ఏర్పడ్డారు.కానీ విష్ణు ప్యానెల్ లోని విష్ణు, నరేశ్ లు బురద జల్లడమే ధ్యేయంగా.. అభాసుపాలు చేయడం.. వివాదాలతో రచ్చ రేపడం.. బెదిరిస్తూ ఓట్ల కోసం కుట్రలు చేస్తున్న వైనం టాలీవుడ్ పరువును గంగ పాలు చేస్తోంది.
-తెలుగు విశ్వవ్యాప్తం.. లోకల్ ఏంటి?
మారుతున్న ఈ కాలంలో ‘బాహుబలి’ లాంటి తెలుగు చిత్రం ప్రపంచవ్యాప్తంగా అందరి మనసు చూరగొన్న ఒక విశ్వసినిమాగా మారింది. ఓటీటీ సంస్కృతి వచ్చాక సినిమాకి భాషతో పని లేకుండా పోయింది. ప్రపంచంలో ఏ భాషా చిత్రాన్ని అయినా తెలుగు వాళ్ళు చూసి ఆనందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ ఆయన పై వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నాలు చేయడం, అందుకు తగ్గట్టుగానే కొందరు నటులు దానికి వత్తాసు పలకడం నిజంగా దౌర్భాగ్యమనే చెప్పొచ్చు. బాహుబలిలో తెలుగువారే కదా తమిళ నటులు నాజర్, సత్యరాజ్ తోపాటు కన్నడ హీరో సుదీప్ నటించారు. మలయాళీలు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాను చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లోనూ హిందీ నటులు అజయ్ దేవ్ గణ్, ఆలియా భట్ చేస్తున్నారు. ఇంత అందరూ కలిసిపోయి సినీ ఇండస్ట్రీని నిలబెడుతున్న వేళ తెలుగునాట మాత్రం‘నాన్ లోకల్’ అంటూ ప్రకాష్ రాజ్ ను పక్కనపెట్టి మిగతా ఇండస్ట్రీ దృష్టిలో టాలీవుడ్ ను మంచు విష్ణు ప్యానల్ చెడుగా చూపించబోతోందా? నష్టం చేస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ‘నాన్ లోకల్’ అన్న పదమే తప్పు అని అంటున్నారు. లోకల్ నాన్ లోకల్ స్టాండ్ తీసుకొచ్చిన మంచు విష్ణు ప్యానెల్ ఇప్పుడు తెలుగు కళాకారులకు ఇతర భాషల్లో అవకాశాలకు గండికొడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే విష్ణు ప్యానెల్ పై తెలుగు అగ్ర నటులు సైతం ఆగ్రహంగా ఉన్నారట.. ఓడించాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్నారని తెలిసింది. అందరి అవకాశాలు పోగొడుతూ బెదిరిస్తున్న విష్ణు ప్యానెల్ ను ఓడించేందుకు అగ్రహీరోలు,ఇతర భాషల్లో నటించే సీనియర్ తెలుగు నటీనటులు ఏకం అయినట్టు తెలుస్తోంది.
-ప్రకాష్ రాజ్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం?
ప్రకాష్ రాజ్ వెంట ఇప్పుడు టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నుంచి నాగార్జున, బడా నిర్మాతలు తెలుగులోని ప్రముఖ సినీ నటీనటులు అంతా ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఇక మంచు విష్ణు వెంట నరేశ్, రవిబాబు, రాజీవ్ కనకాల లాంటి ఫేడ్ అవుట్ అయిన నటీనటులు మాత్రమే నిలబడ్డారు. అగ్ర తారలంతా కలిసి చేస్తున్న ఈ సమరంలో అన్యాయంగా వ్యవహరిస్తున్న మంచు విష్ణు ఓడిపోవడం ఖాయమంటున్నారు. విద్వేశాలు రెచ్చగొడుతూ ‘అభివృద్ధి’ నినాదాన్ని పక్కనపెట్టి కేవలం ఈ నాన్ లోకల్ ఇష్యూతో రచ్చ చేస్తున్న విష్ణుకు ఓటమి ఎదురుకావడం ఖాయమంటున్నారు. మంచి పని కోసం ముందుకొస్తున్న ప్రకాష్ రాజ్ ను గెలిపించేందుకు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఏకమైందట.. అందులోంచి విష్ణును ఏరిపాయేడానికి అందరూ కంకణం కట్టుకొని పనిచేస్తున్నారట.. మరి ఈ ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలుపు ఖాయమా? ఎంత మెజార్టీతో గెలుస్తాడన్నది వేచిచూడాలి.