
The situation of AP Dalits : ఏపీలో దగాకు గురయ్యామన్న ఆవేదన దళితుల్లో వ్యక్తమవుతోంది.. జగన్ అధికారంలోకి వస్తే తమకు తిరుగులేదని భావించిన వర్గంలో అసంతృప్తి బయటపడుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి వారిని ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో సక్సెస్ అయిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వదిలేశాడని వారంతా ఆరోపిస్తున్నారు. దళితులపై దమనకాండను ఎలుగెత్తి చాటుతున్నారు. దళితులపై హత్యలు, వారిపై నేరాలు, అణచివేతలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల బనాయింవు, వేధింపులు.. ఇలా ఒకటేమిటి ఎన్నో దురాగతాలను ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. దళితులపై కక్ష కట్టారా అన్న రేంజ్ లో వెలుగుచూస్తున్న ఘటనలకు అధికార పార్టీ నేతలే బాధ్యులు అని కొందరు దళిత యువకులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల మెప్పుకోసం.. కోరిన చోట పోస్టింగుల కోసం పోలీసులు సైతం దళితులపై దుశ్చర్యలకు తెగబడుతున్నారని అంటున్నారు. తప్పులను ప్రశ్నిస్తే దాడి, ప్రతిఘటిస్తే దౌర్జన్యం, నిలదీస్తే హత్య అన్నట్లు 45 నెలల వైసీపీ ఏలుబడిలో అకృత్యాలు పెరిగిపోయాయని దళితవర్గం విమర్శలు కురిపిస్తోంది.. ఈ పరిణామాల మధ్యనే సొంత రాష్ట్రానికి రావాలంటే భయం వేస్తోందని అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రకటించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి తరుణంలో జగన్ కు హార్ట్ కోర్ అభిమానికి ఒకరు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు ఒకటి తెగ వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది. దళితుల మనోవ్యధను తెలియజేస్తోంది.
-అడుగడుగునా జరిగిన దురాగతాలు…
నీ అభిమానులంతా చచ్చి శవాలౌతుంటే – నీకు ఓటేయడానికి ఎవరు మిగిలుంటారు జగనన్నా? అంటూ ప్రశ్నిస్తూ ప్రారంభమైన ఆవేదన.. ఎమ్మెల్యే ఉండవల్లి సస్పెన్షన్ ఎపిసోడ్ వరకూ ప్రస్తావించి అడుగడుగనా అధికార పార్టీ దురాగతాలను ప్రశ్నించడం కనిపించింది. తెనాలిలో – మన ప్రభుత్వం వచ్చి రాగానే పార్టీ కోసం ఒళ్ళు హూనం చేసుకుని పని చేసిన పమిడిపాటి కోటయ్యను, సింగంపల్లిలో.. ఇంకేముంది రాజన్న రాజ్యం వచ్చేసింది అని ఆనందపడుతున్న సమయంలో మామిడి పళ్లు దొంగిలించాడని బిక్కి శీనుని, . పాయకరావుపేటలో -వడ్లమూరి నాగేంద్రను దారుణంగా హత్య చేసినా వారి కుటుంబాలకు న్యాయం జరగలేదు. హోం మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలోని మలకపల్లిలో గెడ్డం శ్రీను, పోచవరంలో ఎఫ్రాయిము అనే కుర్రాడ్ని, కిర్లంపూడిలో పకోడీలు చల్లగా ఉన్నాయని తన స్కార్పియో తో ఢీకొట్టి పదో తరగతి విద్యార్థిని చంపినా నిందితులపై చర్యలు లేవు. ఇలా నీ అభిమానులంతా చనిపోతుంటే ఎవరన్నా నీకు ఓటేస్తారు? విశాఖలో మన పార్టీ నాయకుడే దళితుడిని పోలీసుల సమక్షంలో గుండు గీకి ఏమి పీకుతర్రా మీరు అని ప్రశ్నించడం నిజం కాదా? కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని అంతర్జాతీయ గజదొంగలాగా బట్టలు ఊడదీసి, కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డుమీద కొట్టుకుంటూ తీసుకుపోవడం నిజం కాదా? చీరాలలో మాస్కు పెట్టుకోలేదు అనే నెపంతో మన పార్టీ కార్యకర్త కిరణ్ కుమార్ ని పోలీసులు తల పగలగొట్టి చంపి – జీపు నుండి దూకాడని బొంకడం నిజం కాదా? చిత్తూరులో ప్రభుత్వ అలసత్వంపై ప్రశ్నించిన దళిత జడ్జి రామకృష్ణను పోలీసుల సమక్షంలో కొట్టుకుంటూ తీసుకువెళ్లడం వాస్తవం కాదా? ’ ఆ దళిత యువకుడు సంఘటనల వెనుకున్న నిజాలతో ప్రశ్నించిన ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-అంబేడ్కర్ కు అవమానాలు..
మా జాతిని అవమానించావ్ జగనన్న అంటూ ఆ యువకుడు లేఖలో పలు ఉదాహరణలు వెల్లడించాడు. ‘‘ బాపట్లలో అప్పటిదాకా #అంబేద్కర్ విగ్రహాలకు పాలభిషేకలు చేసి పూలదండలు వేసినోళ్లు.. ప్రభుత్వంలోకి రాగానే విగ్రహాలు తీసేసినా నోరు మెదపలేదని లేఖలో యువకుడు ప్రశ్నించాడు.. రావులపాలెం దగ్గరలో అంబేడ్కర్ విగ్రహాలను చెత్తబుట్టలో పడేసిన వారిపై చర్యలు లేవు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టారని గొడవ చేసి, హింసకు పాల్పడినా కఠిన చర్యలకు ఉపక్రమించలేదు. కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసినా కఠిన చర్యలు లేవు. తానే చంపానని చెప్పినా కేసు ఫైల్ చేయలేదు. చార్జిషీట్ అనుకూలంగా వేసి బెయిల్ పై తీసుకొచ్చి విజయోత్సవాలు చేసింది నిజం కాదా? రాజనగరం నియోజక వర్గంలో మునికూడలి గ్రామంలో దొంగ ఇసుక లారీ లను అడ్డుకున్నాడని ఇండుగమల్లి ప్రసాద్ ను పోలీస్టేషన్ కు పిలిచి దారుణంగా కొట్టి శిరోముండనం చేయడం నిజం కాదా?’’ అని యువకుడు లేఖలో నిలదీశాడు.
-ఒక్కసారి ఆలోచించుకో జగనన్నా
ఒక్కసారి ఆలోచించుకో జగనన్నా అంటూ జగన్ పాలనపై యువకుడు సంధించిన ఈ లేఖలో మరికొన్ని అంశాలు వైసీపీకి మేలుకొలుపుగా ఉన్నాయి.. ‘‘రాజకీయాల్లో ఇవన్నీ మాములే కదా అని సర్దుకున్నాం. దాడులు ఏ ప్రభుత్వంలోనైనా ఉంటాయని మనసుకు చెప్పకున్నాం. రాజన్న ప్రభుత్వం కదా న్యాయం జరుగుతుందని భావించాం. న్యాయం చేయలేదు సరికదా.. రాజ్యంగం కల్పించిన హక్కులు, రాజ్యంగబద్ధ రాయితీలు, పథకాలను దూరం చేశావు. మా కడుపు మీద కొట్టావ్ జగనన్న.. మా నోటికాడ కూడు లాగేసుకున్నావ్. మా పథకాలు రద్దు చేశావ్. మా నిధులు మళ్లించేశావ్. మా దేవుడు అంబేద్కర్ పేరుని తీసేసి – నీ పేరుతో కానుకలు అన్నావు. మా కార్పొరేషన్లకు నిధులు ఇవ్వడం దండగ అన్నావు. ఇప్పటికే చాలా ఇచ్చేసాం అని బొంకావ్. నీకు ఓటు వేసినందుకు మాకు దక్కిన గౌరవానికి పొరుగు పార్టీ వాళ్ళు మొహం మీద ఉమ్మేస్తున్నా… సర్లే అని తుడుచుకుని నిన్నే వెనకేసుకొచ్చాం. ఎప్పటికైనా మా జగనన్న మాకు న్యాయం చేస్తాడని ఆశించాం. మార్పు లేదు సరికదా.. రోజురోజుకూ ఆకృత్యాలు పెరుగుతునే ఉన్నాయి. అందుకే తమ ఆర్తనాదాలను వినిపిస్తున్నాం. నిజం చెప్పు జగనన్నా.. ఇవన్నీ నీకు తెలియవా? లేకుంటే తెలిసినా నటిస్తున్నావా? ఇలా చంపుకుంటూ పోతే నీకు ఓటు ఎవరు వేస్తారన్నా.. ఒక్కసారి ఆలోచించుకో జగనన్నా’’ అంటూ ప్రశ్నిస్తూ పెట్టిన సోషల్ మీడియాలో దళిత యువకుడు పెట్టిన పోస్టు ఇప్పుడు షేక్ చేస్తోంది. వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంది. ముఖ్యంగా దళితులను ఆలోచింపజేస్తోంది. వారి బాధను వెళ్లగక్కుతోంది.