KCR Ganesh : తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రొటోకాల్ ప్రకారం.. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని కేసీఆర్ ను ఎవ్వరికి కలువనివ్వరు. సామాన్యులకు కేసీఆర్ కనపడరన్న విమర్శ చాలా రోజులుగా తెలంగాణ ప్రజల్లో ఉంది. ఇంతకుముందు సీఎంలను నేరుగా కలిసిన చరిత్ర ప్రజలకు ఉంది. ఎందుకో కానీ కేసీఆర్ దర్శనభాగ్యం ప్రజలకు ఇప్పటికీ కలవడం లేదు. అంతటి కఠిన ప్రొటోకాల్ ను కేసీఆర్ పాటిస్తాడన్న విమర్శ ఉంది.
స్థానిక ప్రజలను కేసీఆర్ ఎందుకు కలవరన్న ప్రశ్న చాలా రోజులుగా ఉంది. వారి సమస్యలను ఎందుకు తీర్చరని చాలామంది అడుగుతుంటారు. దీనికి సమాధానాన్ని ఓసారి కేటీఆర్ బయటపెట్టారు. ‘ఒక గ్రామస్థాయి సమస్య సీఎం వద్దకు వచ్చిందంటే ఇంత మంది అధికారులు, వ్యవస్థ వేస్ట్ అని.. ఆ సమస్యలు తనవద్దకు రాకుండా క్షేత్రస్థాయిలోనే పరిష్కారం అవ్వాలని.. అందుకే ఆయన ప్రజలను నేరుగా కలవకుండా ప్రజలకు అన్ని సమస్యలను తీర్చేలా కింది స్థాయి నుంచి పటిష్టం చేశారని’ కేటీఆర్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని చెప్పినా కూడా ప్రజలను నేరుగా కలిసిన సీఎంలే చరిత్రలో నిలిచారు. కలవని వారి ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు ఈ ప్రొటోకాల్ కేసీఆర్ కే కాదు.. ఆయన ఇంట్లో పెట్టి ఆయన కొలిచిన గణేషుడికి కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్ వినాయకుడా మజాకా అన్నట్టుగా అధికారులు ఏర్పాట్లు చేసి ప్రొటోకాల్ ప్రకారం నిమజ్జనం చేయడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.
ప్రోటోకాల్ లో వచ్చిన కేసీఆర్ వినాయకుడిని చూసి అందరూ అవాక్కయ్యారు. కెసిఆర్ ప్రతిష్టించిన వినాయకుడు కు భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేసి తమ స్వామిభక్తిని ప్రదర్శించారు. ప్రత్యేక కాన్వాయ్ మధ్య హుసేన్ సాగర్ కు తరలించి పోలీసులు నిమర్జనం చేశారు.
పోలీస్ ఎస్కార్ట్ తో ట్యాంక్ బండ్ వచ్చిన సీఎం క్యాంప్ ఆఫీస్ గణేశుడిని క్రేన్ నంబర్ 3 వద్ద క్యాంప్ ఆఫీస్ సిబ్బంది, పూజారి టీం నిమజ్జనం పూర్తి చేశారు.