PM Modi- Gujarat Riot Case: చర్యకు ఎప్పుడూ ప్రతి చర్య ఉంటుంది. బట్టర్ ఫ్లై థియరీ నుంచి న్యూటన్ సిద్ధాంతాల దాకా నిరూపించినవి ఇవే. ప్రస్తుతం ఈ సిద్ధాంతాలని ప్రధానమంత్రి మోదీ అమలు పరుస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో సిట్, మిగతా దర్యాప్తు సంస్థల ముందు మోడీ దోషిగా నిలబడాల్సి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. అంతేనా అమెరికాకు వెళ్లేందుకు కూడా వీసా నిరాకరించింది. అప్పట్లో గుజరాత్ అల్లర్లకు సంబంధించి జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతాల్వాడ్, జాకీయా జాఫ్రీ నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాధారాలు కూడా కోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత పలు సంస్థలు కూడా మోదీకి వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు చేశాయి. సొంత పార్టీలో కూడా మోడీకి వ్యతిరేకంగా ఓ వర్గం తయారైంది. గుజరాత్లో మోదీని గద్దె దించాలని, కేషు బాయ్ పటేల్ ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేసింది. అప్పట్లో మోదీకి ఎల్కే అద్వానీ అండగా నిలబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఓటమి అనేది లేకుండానే అప్రతిహతంగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు.

ఇప్పుడే ఎందుకు
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కరెంటు కోతలు, ఉద్యోగుల వేతనాలు పెంపుదల లేకపోవటం, పారిశ్రామిక ఉత్పత్తులు మందగించడం వంటి కారణాలతో అక్కడి ప్రభుత్వం ఓ వర్గం ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పైపెచ్చు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. మొన్నటికి మొన్న అగ్నిపథ్ పై తీసుకున్న నిర్ణయం కూడా గుజరాత్ లో అల్లర్లు చెలరేగడానికి కారణమైంది. ఇలాంటి తలనొప్పి లమధ్య మోదీకి కొంతమేరకు ఉపశమనం కలిగించేలా 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసులో సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. తీర్పు తమకు అనుకూలంగా రావడంతో వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి తీస్తా సెతాల్వాడ్, ఆమె నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ “సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీజ్”, మాజీ డిజిపి శ్రీ కుమార్, మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీని గద్దె దించేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని ఆరోపించారు. వీరి నిర్వాకం వల్ల 20 ఏళ్లుగా మోదీ తన కంఠంలో గరళాన్ని మోస్తున్నా రని ఆరోపించారు. అమిత్ షా ఆరోపణలు చేసిన వెంటనే గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం పోలీసులు తీస్తాను ముంబైలోని శాంతాక్రజ్ లో అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నే ఆశ్చర్యపరిచిన ‘అమ్మ’ సాయం
ఎందుకు ఉద్యమాలు చేసినట్టు
2002 గుజరాత్ అల్లర్ల దేశ చరిత్రలో ఒక నెత్తుటి అధ్యాయం. అల్లర్లలో వందలాది మంది కన్నుమూశారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. చాలామంది బతుకుజీవుడా అంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అప్పట్లో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఉండడంతో మోదీపై మిగతా ప్రభుత్వాలు దుమ్మెత్తిపోశాయి. ఈ క్రమంలో జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా, గుజరాత్ అల్లర్లలో కన్నుమూసిన కాంగ్రెస్ ఎంపి భార్య జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇదే క్రమంలో తీస్తా ఆధ్వర్యంలో సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అనే సంస్థ పురుడు పోసుకుంది. సంస్థ హోం శాఖ అనుమతి లేకుండానే వివిధ దేశాల నుంచి విరాళాలు సేకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పార్టీ తోనే గుజరాత్ అల్లర్ల సమయంలో ఉద్యమాలు నిర్వహించారని సమాచారం. ఈ సమయంలోనే బాధితుల తరపున వకాల్తా పుచ్చుకున్నారని వినికిడి. ఎప్పుడైతే తీస్తా ఈ అల్లర్ల విషయంలో తీస్తా అడుగుపెట్టారో అప్పుడే వివాదం మరింత ముదిరింది. వీరికి అప్పటి అధికారులు తోడు కావడంతో మోడీకి ముచ్చెమటలు పట్టాయి. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గుజరాత్ అల్లర్లు కూడా కారణమని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి.

ఎదిరించిన వారిని బెదిరిస్తున్నారా
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్యవాదులకు, ఉద్యమకారులకు, సామాజికవేత్తలకు, పాత్రికేయులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపణలు ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛ లో దేశం ర్యాంక్ అంతకంతకూ దిగజారిపోతుండమే పై ఆరోపణలకు ప్రబల నిదర్శనం. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరినీ కూడా మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే బిజెపిలో తనకు వ్యతిరేక వర్గాన్ని లేకుండా చేసుకున్నారు. తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చెలరేగిన అల్లర్లల్లో తనకు వ్యతిరేక వాణిని వినిపించిన తీస్తా, జాకియా జఫ్రీ, ఇతర అధికారులను మోడీ సరైన సమయం చూసుకొని ఇరుకున పెడుతున్నారు. మరోవైపు తనకు ఎన్నికల్లో కూడా లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. త్వరలో గుజరాత్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మోదీకి బలం చేకూర్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు పదేపదే గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తుండటంతో తాజా తీర్పుతో వారికి సరైన సమాధానం ఇచ్చినట్లయింది. విదేశాల నుంచి అక్రమంగా నిధులు సేకరించారని ఆరోపిస్తూ తీస్తా సంస్థపై 2015లో సిబిఐ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం అది కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు గుజరాత్ అల్లర్ల కేసులో దర్యాప్తు నిర్వహించిన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారి బీఎస్ శ్రీ కుమార్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించడంలో ఆయన దిట్ట అని ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ ఆరోపించడం గమనార్హం. కాగా 1994లో ఇస్రో గూడచార్యం కేసులో నంబి నారాయణన్, మాల్దీవులకు చెందిన రషీదా, ఫౌహియా అనే మహిళలు అరెస్ట్ అయ్యారు. కాగా వీరిలో నంబి నారాయణన్ కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. తనను అకారణంగా కేసులో ఇరికించి నందుకు నంబి నారాయణన్ పోలీసుల పైనే పోరాటం చేస్తున్నారు.
Also Read:Shiva Sena and TRS: ఆదిత్యఠాక్రేపై తిరుగుబాటు.. మరి కేటీఆర్ పై ఎప్పుడు?
[…] […]
[…] […]