https://oktelugu.com/

TSRTC Merge In Govt: టీఎస్‌ఆర్టీసీ విలీనంపై ప్లాన్‌–బి.. కేసీఆర్‌ కొత్త ఎత్తు!

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ ఆమోదం కోసం నోట్‌ పంపించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 5, 2023 / 12:44 PM IST

    TSRTC Merge In Govt

    Follow us on

    TSRTC Merge In Govt: తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం ఇంతకాలం దాచి ఉంచిన అస్త్రశస్త్రాలను సీఎం కేసీఆర్‌ బయటకు తీసి ప్రయోగిస్తున్నారు. వాటిలో టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ఒకటి. 2019లో 52 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఇదే కేసీఆర్‌ వారిపట్ల కఠినంగా, నిర్దయగా వ్యవహరించారు. సమ్మె కొనసాగిస్తే టీఎస్‌ఆర్టీసీని మూసివేస్తానని, అప్పుడు కార్మికులు అందరూ రోడ్లపై అడుక్కుతినాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. కార్మికులు అందరూ బేషరతుగా సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే అందరూ ‘సెల్ఫ్‌ డిస్‌మిస్‌’ అయిన్నట్లు పరిగణిస్తామని హెచ్చరించారు. దాదాపు రెండు నెలల సమ్మెతో టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి.

    35 మంది మృతి..
    సమ్మె, ప్రభుత్వ నిరంకుశ వైఖరి కారణంగా కొందరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా మరికొందరు గుండెపోటుతో మరణించారు. సుమారు 35 మంది కార్మికులు సమ్మె సమయంలో మరణించారు. అయినా కేసీఆర్‌ మనసు కరుగలేదు. బేషరతుగా సమ్మె విరమించాల్సిందే తప్ప వారి ఒక్క డిమాండ్‌కు కూడా తలోగ్గేది లేదని తేల్చిచెప్పారు. కార్మికుల కుటుంబాల పరిస్థితి నానాటికీ దయనీయంగా మారడంతో గత్యంతరం లేక బేషరతుగా సమ్మె విరమించి విధులలో చేరారు.

    యూనియన్ల రద్దు..
    ఆర్టీసీలో సమ్మె చేయడానికి యూనియన్లే కారణమని భావించిన కేసీఆర్‌.. కార్మికులు సమ్మె విరమించిన తర్వాత యూనియన్లు ఉండరాదని నిషేధం విధించారు. కార్మికుల హక్కులను కూడా కాలరాశారు. ప్రశ్నించే హక్కు లేకుండా చేశారు. సమస్యలు చెప్పుకోవడానికి డిపోల వారీగా కమిటీలు ఏర్పాటు చేశారు. కానీ ఆ కమిటీలు నామమాత్రంగా మారియి.

    నేడు విలీనం హడావుడి..
    నాడు ఆర్టీసీని బొందపెట్టాలని చూసిన ఇదే కేసీఆర్‌.. నేడు కార్మికులపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. వీలీనం అనేది నాడు దిక్కుమలిన డిమాండ్‌ అన్న కేసీఆర్‌ ఇప్పుడు అదే జపిస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 43 వేలమంది ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా పరిగణించాలని నిర్ణయించడంతో వారు ఆయనను దేవుడిలా భావిస్తున్నారు. తనను అసహ్యించుకొన్న వారిచేతే పాలాభిషేకాలు చేయించుకోగల నేర్పరి అయిన కేసీఆర్‌.. విలీనంతో కార్మికులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.

    అసెంబ్లీలో బిల్లుకు గవర్నర్‌కు నోట్‌..
    ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ ఆమోదం కోసం నోట్‌ పంపించారు. నోట్‌ పంపి∙24 గంటలు గడవక ముందే.. గవర్నర్‌ బిల్లు ఆపాలని చూస్తున్నారని ప్రచారం మొదలు పెట్టించారు. అసెంబ్లీలోనే మంత్రులతో గవర్నర్‌పై ఆరోపణలు చేయించారు. కార్మికులను రెచ్చగొట్టారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అంతర్గతంగా రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చారు.

    ప్లాన్‌–ఏ ఫెయిల్‌ అయితే..
    గవర్నర్‌ బిల్లును ఆమోదిస్తే వెంటనే అసెంబ్లీలో పెట్టి ఆర్టీసీ కార్మికులతో తన ఫొటోకు పాలాభిషేకాలు చేయించుకోవలన్నాది కేసీఆర్‌ ప్లాన్‌–ఏ. ప్లాన్‌ ఏ ఉన్నప్పుడు ప్లాన్‌–బి కూడా ఉంటుంది కదా. గవర్నర్‌ బిల్లు ఆమోదించకుండా జాప్యం చేస్తే.. బిల్లు ఆమోదంపై మెలికలు పెడితే.. ప్లాన్‌–బి అమలు చేయాలని గులాబీ బాస్‌ భావిస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ కార్మికుల చేత ఆమెకు వ్యతిరేకంగా శనివారం ఉదయం 2 గంటల సేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహింపజేయడం. వారు డిపోల నుంచి బస్సులు బయటకుతీయకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆవిధంగా టీఎస్‌ఆర్టీసీ కార్మికుల, ప్రజల ఆగ్రహాన్ని గవర్నర్‌పైకి మళ్లించడమే ప్లాన్‌–బి. పనిలో పనిగా కాంగ్రెస్, బీజేపీవైపు పక్క చూపులు చూస్తున్న ప్రజలందరినీ మళ్లీ ఏదో ఓ సెంటిమెంటుతో బందించి త్వరలో జరుగబోయే ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ పార్టీకే ఓట్లు వేసేలా చేసుకోవడమే అంతిమ లక్ష్యం.

    ఆర్డినెన్స్‌పై ఆలోచన..
    ఇక ఆర్టీసీ కార్మికులపై సడెన్‌గా ప్రేమ పుట్టుకొచ్చిన కేసీఆర్‌ తాజాగా బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలను ఒకరోజు పొడిగించారు. వాస్తవంగా శనివారంతో సమావేశాలు ముగియాలి. కానీ బిల్లు కోసమే అన్నట్లు ఆదివారం కూడా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయినా గవర్నర్‌ బిల్లుకు ఆమోదం తెలుపకపోతే.. అది తమకు మరింత కలిసి వస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులను మరింత రెచ్చగొట్టడంతోపాటు.. కార్మికులకు ఫేవర్‌ చేసేలా ఆర్టీసీ విలీనంపై ఆర్డినెన్స్‌ తెచ్చే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గంపగుత్తగా తమకే పడతాయని భావిస్తున్నారు.