Best Tourist Places: భారత దేశం ప్రకృతి అందాలకు నెలవు. అటు ఈశాన్య రాష్ట్రాలు, ఇటు సముద్ర తీరాలు.. పైన పర్వతాలు.. లోయలు.. ఇలా ఏవైపు వెళ్లినా ప్రకృతి రమణీయత మనల్ని మైమరపిస్తుంది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు మన దేశంలోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు. కానీ భారతీయుల్లో చాలా తక్కువ మంది సందర్శిస్తున్నారు. కానీ, జీవితంలో ఒక్కసారి అయినా చూడాల్సిన ప్రదేశాలు కూడా మన దేశంలో కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
జోగ్ జలపాతం..
కర్ణాటక రాష్ట్రంలోని ఉన్న జోగ్ జలపాతం భారత దేశంలో అత్యంత ఎత్తయిన జలపాతాల్లో ఒకటి. ఇది షిమోగా జిల్లాలో ఉంది. శరావతి నది ద్వారా ఈ జలపాతాలు ఏర్పడ్డాయి. ఇది రాజా, రాణి, రోవర్, రాకెట్ అనే నాలుగు విభిన్న జలపాతాలతో 253 మీటర్ల(330 అడుగుల) ఎత్తునుంచి జాలువారతుంటాయి. చుట్టుపక్కల పచ్చదనం, నీరు కిందపడే శబ్దం జోగ్ జలపాతాన్ని ఒక అద్భుతమైన దృశ్యంగా ఆవిష్కరిస్తుంది.
రాన్ ఆఫ్ కచ్
ఇది గుజరాత్‌లోని థార్ ఎడారిలో ఉంది. ప్రత్యేక రాన్ ఉత్సవ సమయంలో ఇక్కడ సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, ప్రకాశవంతమైన రంగులతో ఆ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. నీలి ఆకాశం నేపథ్యంలో ఉండే తెల్లటి ఉప్పు ప్లాట్‌లు, సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో మంత్రముగ్ధులను చేస్తాయి.
గురుడోంగ్మార్..
ఉత్తర సిక్కింలో 17,800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గురుడోంగ్మార్ సరస్సు ప్రపంచంలో ఎత్తయిన సరస్సుల్లో ఒకటి. ఈ సరస్సుకు గురు పద్మసంభవ అనే పేరు పెట్టారు. ఈ సరస్సును బౌద్ధులు, సిక్కులు పవిత్రంగా భావిస్తారు. చుట్టూ గంభీరమైన కాంచన జంగాతో సహా మంచుతో కప్పబడిన పర్వతాలతో ఉన్న ఈ సరస్సును చూడడం అదృష్టంగా భావించాలి. సరస్సులోని స్వచ్ఛమైన నీలిరంగు నీరు చుట్టూ ఉన్న శిఖరాల అందాలను ప్రతిబింభిస్తుంది.
ప్రశార లేక్..
హిమాలయాల్లోని ధౌలాధర్ శ్రేణిలో ఉన్న ఈ సరస్సు చుట్టూ మామూలు సమయాల్లో పచ్చదనం, శీతాకాలంలో మంచుతో కప్పబడిన శిఖరాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రశాంతమైన వాతావరణానికి ప్రతిసిద్ధి. ఇది ప్రకృతి ప్రేమికులు, ఏకాంతం కోరుకునేవారికి చాలా బాగా నచ్చుతుంది. సమీపంలోని ఆలయం నిర్మలమైన ప్రకృతి దృశ్యానికి ఆధ్యాత్మికతను జోడిస్తుంది.
పహల్గామ్..
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గామ్ ఒక పుందర పట్టణం. దట్టమైన పచ్చికబయళ్లు, దట్టమైన అడవులు, లోయ గుండా ప్రవహించే లిడర్ నదితో ఇది ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది. అమర్‌నాథ్ గుహకు ప్రతిసిద్ధి చెందిన ట్రెక్‌తోసహా ఈ ప్రాంతంలోని అనేక ట్రెక్‌లు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్…
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్న ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గొప్ప జీవవైవిధ్యం, అద్భుతమైన పూల ప్రదర్శనకు ప్రసిద్ధి. యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఆర్కిడ్స్, పాపీస్, మేరిగోల్డ్‌లతో సహా వివిధ రకాల అల్పైన్ పూలతో లోయ అందంగా కనిపిస్తుంది. మంత్ర ముగ్ధులను చేస్తుంది.