Petrol Diesel Crisis : దేశంలో ఒక్కసారిగా పెట్రోల్ కొరత ఏర్పడింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బంకుల్లో నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో చాలా మందికి అర్థం కావడం లేదు. పెట్రోల్ దొరకడం లేదు అని మాత్రం ప్రచారం చేస్తున్నారు. దీంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఎందుకు దొరకడం లేదు.. ఎన్నిరోజులు ఇబ్బంది ఉంటుంది అని కూడా తెలుసుకోకుండా.. వాహనాల్లో ఇంధనం ఉన్నా.. బంకులకు వెళ్తున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం ఏ బంకు చూసినా వాహనాదారుతో కిటకిటలాడుతున్నాయి.
ఏం జరిగిందంటే..
అసలు ఏం జరిగిందంటే.. మంగళవారం ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నాకు దిగారు. కేంద్రం హిట్ అండ్ రన్ వాహనదారులకు విధించే శిక్ష, జరిమానాను పెంచింది. హిట్ అండ్ రన్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల జరిమానా విధించాలని చట్ట సవరణ చేసింది. దీనికి నిరసనగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నాకు దిగారు. దీంతో పెట్రో ఉత్పత్తుల రవాణా నిలిచిపోయింది. ఈ సమాచారం గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఇంకేముంది.. అయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె చేస్తున్నారట.. ఇంధన దొరకదట అని దానికి మరికొంత జోడించి ప్రచారం చేయడంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు.
ధర్నా విరమణ..
పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించారు. అయినా ప్రచారం మాత్రం ఆగడం లేదు. దీంతో పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె లేదని తెలిపారు. పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఆయిల్ ట్యాంకర్లను యథావిధిగా నడుపుతామని పేర్కొన్నారు.