Vijay Antony Daughter : 16 ఏళ్ల లారా ఆత్మహత్య.. ఎవరూ ఊహించనిది. నాన్న ‘బిచ్చగాడు’ విజయ్ ది సక్సెస్ ఫుల్ కెరియర్, ముచ్చటైన కుటుంబం, ఆనందకరమైన జీవితం… ఇన్ని ఉన్నా ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? లారా మరణం అనంతరం అందరినీ వేధిస్తున్న సందేహాలివి. కానీ ఒకరి ఆత్మహత్యకు పురిగొల్పిన అంశం ఇదీ అని కచ్చితంగా చెప్పలేం. అయితే వారి మానసిక స్థితి, వ్యక్తిత్వం, కుటుంబ నేపథ్యాల ఆధారంగా ఆ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి నియంత్రించే వీలుంది. డిప్రెషన్‌ను పసిగట్టి మానసిక చికిత్స అందిస్తే కచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. మనలో ఎక్కువ మందికి డిప్రెషన్ గురించిన అవగాహన ఉండదు. దాన్నొక మానసిక సమస్యగా భావించాలనే విషయం కూడా తెలియదు.
కారణాలు అనేకం
ఆత్మహత్యకు కారణాలు అనేకం. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమలో విఫలం… ఇలా చెప్పుకుంటే పోతే ఆత్మహత్యకు రకరకాల కారణాలు ఉంటాయి. అయితే అసలు కారణమేమీ లేకుండా మెదడులో జరిగే రసాయన మార్పుల మూలంగా కూడా డిప్రెషన్ తలెత్తవచ్చు. విచారం, నిరాశానిస్పృహలు మొదలైన భావోద్వేగాలు తాత్కాలికమైనవి. కానీ వైద్య పరిభాషలో పేర్కొనే ‘డిప్రెషన్’ ఒకసారి తలెత్తితే క్రమేపీ పెరుగుతూ పోతుందే తప్ప తగ్గదు. ఆత్మహత్య డిప్రెషన్‌లో ఓ భాగం. టైఫాయిడ్‌లో జ్వరం కనిపించినట్టు డిప్రెషన్‌లో ఆత్మహత్య ఉండొచ్చు. డిప్రెషన్‌లో కూరుకుపోయిన ప్రతి వ్యక్తీ ఆత్మహత్య చేసుకోకపోయినా ఆత్మహత్య చేసుకునే అవకాశాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. డిప్రెషన్ డిజార్డర్ అత్యంత సాధారణమైన లక్షణం ఆత్మహత్య. అలాగే డిప్రెషన్‌తోపాటు క్షణికావేశం కూడా కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు కారణమవుతూ ఉంటుంది.
డిప్రెషన్ అంటే?
మానసిక కుంగుబాటే ‘డిప్రెషన్’. వ్యాపారంలో నష్టం, జీవిత భాగస్వామితో మనస్పర్థలు, ఆస్థి తగాదాలు, ఆర్థిక సమస్యలు, పరీక్షలో ఫెయిలవ్వడం, అవమానం, ప్రేమ వైఫల్యం, మానసిక ఒత్తిడి… ఇలా మనసు మీద ప్రభావం చూపించే అంశాలకు అంతు ఉండదు. ఇలాంటి పరిస్థితుల పట్ల వ్యక్తులు స్పందించే తీరు, స్వభావాలు వేర్వేరుగా ఉంటాయి. కొందరు ఆ పరిస్థితులను మనోధైర్యంతో ఎదుర్కొని, పాజిటివ్ యాంగిల్‌లో సమస్యలకు పరిష్కారాలు, ప్రత్యామ్నాయాలు వెతుక్కుని జీవితంలో ముందుకు సాగటానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు సమస్యను భూతద్దంలో నుంచి చూస్తూ, దాని చుట్టే పరిభ్రమిస్తూ క్రమేపీ డిప్రెషన్‌లో కూరుకుపోతారు. ఆ స్థితి దీర్ఝకాలంపాటు కొనసాగితే ఆత్మహత్య ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. ఈ కోవకు చెందిన వ్యక్తుల డిప్రెషన్ ఆత్మహత్యకు దారి తీయటానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇక రెండో కోవకు చెందిన వ్యక్తులు ‘క్షణికావేశాపరులు’. వీళ్లకు డిప్రెషన్ డిజార్డర్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అయితే క్షణికావేశం ఉండటం వల్ల హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంటారు. డిప్రెషన్ డిజార్డర్ ఉన్నవాళ్ల ఆత్మహత్యలను ముందుగానే పసిగట్టే వీలుంటుంది. కానీ క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడేవారిని గుర్తించటం కష్టం. ఈ రెండు రకాల వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకునే తీరులు కూడా వేరుగా ఉంటాయి. మొదటి రకం వ్యక్తులు ముందస్తు ప్రణాళిక వేసుకుని పకడ్బందీగా ఆత్మహత్య చేసుకుంటే ఆవేశపరులు అప్పటిదాకా బాగుండి హఠాత్తుగా సూసైడ్ చేసుకుంటారు.
మానసిక చికిత్స అందించాలి
డిప్రెషన్ డిజార్డర్ ఉన్న వ్యక్తులకు మానసిక చికిత్స అందించకపోతే సమస్య తీవ్రత పెరిగి ఆత్మహత్య చేసుకోవాలనే బలమైన నిర్ణయానికొస్తారు. ఇందుకు కావలసిన సమాచారాన్ని సేకరిస్తారు. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా, ఆత్మహత్యలో విజయం సాధించేలా రాత్రి వేళనే ఆత్మహత్యకు ఎంచుకుంటారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకన్న వ్యక్తి అంతకు కొంత కాలం ముందు నుంచీ కొద్ది కొద్దిగా మాత్రలు సేకరించి పెట్టుకుంటూ ఉంటాడు. ఉరి వేసుకోవాలనుకున్న వ్యక్తి అందుకు కావలసిన పరికరాల్ని ఎంచుకుని దాచుకుంటాడు. రాత్రి భోజనం తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తన గదిలోకెళ్లి గడి పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. రాత్రి కాబట్టి వెంటనే ఎవరూ అతని ప్రయత్నాన్ని కనిపెట్టే అవకాశం ఉండదు. తలుపు కొట్టినా నిద్ర పోయాడని ఊరుకుంటారనే ఉద్దేశంతోనే… ఈ వ్యక్తులు ఆత్మహత్యకు ఆ సమయాన్ని ఎంచుకుంటూ ఉంటారు.
ఇక క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునేవాళ్లకు అంతకు ఐదు నిమిషాల ముందువరకూ ఆ ఆలోచన ఉండకపోవచ్చు. వీళ్లు అప్పటికప్పుడు ఆవేశంలో ఈ అఘాయిత్యానికి పాల్పడుతూ ఉంటారు. ఎత్తైన బిల్డింగ్ నుంచి దూకేయడం, మణికట్టును బ్లేడ్‌తో కోసుకోవడం, యాసిడ్ తాగేయడం,తగలబెట్టుకోవడం వంటి భయంకరమైన ప్రయత్నాలను ఎంచుకుంటారు. వీళ్లు ఎంచుకునే పద్ధతుల్లో తామెంత బాధకు గురయ్యామో అందరికీ తెలియజెప్పాలనే ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది.
డిప్రెషన్‌ను ఇలా పసిగట్టవచ్చు
డిప్రెషన్‌ను పసిగట్టి మానసిక చికిత్స అందిస్తే కచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. మనలో ఎక్కువ మందికి డిప్రెషన్ గురించిన అవగాహన ఉండదు. దాన్నొక మానసిక సమస్యగా భావించాలనే విషయం కూడా తెలియదు. దగ్గు, జ్వరంలాగే డిప్రెషన్ అత్యంత సాధారణమైన రుగ్మత. శారీరక సమస్యలకు ఎలాగైతే వైద్య చికిత్స తీసుకుంటామో, మానసిక సమస్యకూ వైద్య చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రుగ్మత తీవ్రత పెరిగి ఆత్మహత్యకు దారి తీయకుండా ఉండాలంటే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
కుటుంబం తోడ్పాటు అవసరం
మెదడులో కలిగే రసాయన మార్పుల వల్ల తలెత్తే డిప్రెషన్‌కు చికిత్స ఎంతో తేలిక. రోజుకి ఒక్క మాత్రతో డిప్రెషన్‌ను అదుపులోకి తీసుకురావొచ్చు. డిప్రెషన్‌కు కారణమైన పరిస్థితులను వైద్యులు సరిదిద్దలేకపోయినా వాటిని ఎదుర్కొనే మానసిక స్థయిర్యాన్ని, ధైర్యాన్ని చికిత్సతో అందించే వీలుంది. వైద్య చికిత్సతో జీవితాన్ని చూసే దృష్టి కోణాన్ని మార్చవచ్చు. ఉదాహరణకు… వ్యాపారంలో లక్షల నష్టం వచ్చి డిప్రెషన్‌లో కూరుకుపోయిన వ్యక్తికి ఆ నష్టం భర్తీ చేసినా తిరిగి అదే పరిస్థితి పునరావృతమైతే మళ్లీ డిప్రెషన్‌లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ వైద్య చికిత్స ఇవ్వటం ద్వారా ఆ నష్టం చుట్టూ తిరిగే అతని ఆలోచనల్ని నష్టాన్ని భర్తీ చేసే మార్గాల వైపు మళ్లించవచ్చు. అంతటితో జీవితం పూర్తయిపోలేదని, మరో వ్యాపార ప్రయత్నం చేసి విజయం సాధించే వీలుందనే మానసిక ధైర్యాన్ని ఆ వ్యక్తిలో పెంపొందించవచ్చు. అయితే ఇందుకోసం కుటుంబ సభ్యుల తోడ్పాటు కూడా ఎంతో అవసరం.
ఆదుకునే హెల్ప్‌లైన్స్
ప్రపంచ జనాభాలో 5 శాతం డిప్రెషన్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడైంది. ఈ లెక్కన ఒక్క మన దేశంలోనే దాదాపు 6 కోట్ల మందికి డిప్రెషన్ డిజార్డర్ ఉన్నట్టు భావించాలి. ఈ రుగ్మత ఉన్న వాళ్లలో కనీసం 15 శాతం మంది ఆత్మహత్య చేసుకుంటారు. పురుషులతో పోలిస్తే ఆత్మహత్యకు ప్రయత్నించే స్త్రీల శాతం రెండింతలు. అయితే ఆత్మహత్యలో విజయం సాధించే వాళ్లలో పురుషులే ముందున్నారు. ఇందుకు కారణం స్త్రీలు ఏడుపుతో, ఎదుటి వాళ్లకి చెప్పుకుని మనసులోని బాధని దింపుకుంటారు. కానీ పురుషులు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. సామాజిక నిబంధనలు, కట్టుబాట్ల మూలంగా పురుషులు ఏడవటానికి వెనకాడతారు. దాంతో మద్యంతో బాధని మర్చిపోయే ప్రయత్నం చేసి పరిస్థితిని మరీ దిగజార్చుకుంటారు. చివరికి ఆత్మహత్యతో తమ సమస్యకు ముగింపు పలుకుతారు. ‘నేను బాధలో ఉన్నాను, కాపాడండీ! అని చెప్పే ప్రయత్నమే…’ ఆత్మహత్య. ఇలాంటి వాళ్ల బాధను వ్యక్తం చేసే వీలు కల్పించగలిగితే డిప్రెషన్ డిజార్డర్ ఆత్మహత్య వరకూ వెళ్లకుండా నియంత్రించవచ్చు. ఇందుకోసం హెల్ప్‌లైన్స్ ఉపయోగపడతాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎటువంటి రుసుమూ వసూలు చేయకుండా వీటిని నిర్వహిస్తు న్నాయి. ఈ హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి మనసులోని బాధని వెళ్లగక్కవచ్చు. ఫలితంగా మానసిక ఊరట పొందవచ్చు.
ఇలాంటి కొన్ని హెల్ప్‌లైన్స్:
రోషిణి: 040- 66202000, 66202001,
హవాయీ పటేల్: 98662 43824.