Pawan Kalyana : ఏపీ ఎన్నికల్లో ఇటీవల 99 అభ్యర్థులతో కూడిన తొలి జాబితా ప్రకటించిన తర్వాత తొలిసారిగా జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి తాడేపల్లిగూడెంలో తెలుగు జన విజయకేతనం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఇరు పార్టీలకు చెందిన కీలక నాయకులు హాజరయ్యారు. ఈ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
“ఐదుగురు రెడ్ల కోసం ఐదు కోట్ల మంది తిప్పలు పడుతున్నారు. నేను తెలుగు మీడియం లో చదువుకున్నా. నాకు సంస్కారం ఉంది కాబట్టే నీలాగా మాట్లాడలేకపోతున్న జగన్. పవన్ కళ్యాణ్ అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు. నిన్ను అంధ: పాతాళానికి తొక్కే వామనుడి పాదం నాది. నా వాళ్ళు నాతో నడుస్తారు. నీకు మధ్యలో వచ్చిన ఇబ్బంది ఏంటి? ఓడినప్పుడు నేను ప్రజల్లోనే ఉన్నాను. గెలిచినప్పుడు కూడా వారితోనే ఉంటాను.. నాతో స్నేహం అంటే చచ్చేదాకా ఉంటుంది. నాతో వైరం పెట్టుకుంటే అవతలివాడు చచ్చేదాకా ఉంటుంది. నేను సామాన్యుడిని.. నేను రాజకీయాలు చేస్తే ఎందుకు నువ్వు తట్టుకోలేకపోతున్నావ్? నిన్ను అంధ: పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదు. వ్యూహాలు రచించాను. నీ కోటలు బద్దలు కొడతాను. నాకు సలహాలు ఇచ్చే వాళ్ళు కాదు.. నాతో పోరాడే వాళ్ళు కావాలి. నా శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టే 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలు అడిగానని” పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి పై జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు.
ఈ సభకు పవన్ కళ్యాణ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నంత సేపు యువత కేరింతలు కొట్టారు. ఇరు పార్టీలు జన సమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగు జన విజయకేతనం సభ విజయవంతమైంది. ఇక చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ప్రసంగాలు అంతంత మాత్రంగానే సాగాయి. పవన్ కళ్యాణ్ మాత్రం విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. తాను టిడిపి తో ఎందుకు పొత్తు పెట్టుకున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో అది అవసరమైందో? పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరించారు. “జగన్మోహన్ రెడ్డికి 24 పవర్ తెలియడం లేదు. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద పాదం పెట్టి తొక్కుతుంటే తెలిసింది ఆయన బలం ఎంత అనేది. వైసీపీ కి నా వామన అవతారం చూపిస్తా. త్వరలో ఎన్నికలు ఉన్నాయి.. అవి పూర్తయిన తర్వాత ఏమిటో వైసిపి వాళ్లకు తెలుస్తుంది. నాకు జగన్మోహన్ రెడ్డి జూబ్లీహిల్స్ కాలనీ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి తెలుసు. చెక్ పోస్ట్ దగ్గర ఏం చేసేవాడు? బంజారాహిల్స్ కెంటకి రెస్టారెంట్లో ఏం చేసేవాడో కూడా తెలుసు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి.. అతని బతుకు ఏంటో తెలుసుకుంటే మంచిది. నీకు యుద్ధం ఇస్తాను సిద్ధంగా ఉండు” అంటూ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరి దీనిపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.